HMPV వైరస్ విషయంలో చైనా మాటలు ఎంత వరకు నమ్మొచ్చు?

కోవిడ్ 19 వైరస్ వచ్చి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. లాక్ డౌన్ తో ప్రపంచమంతా కొన్నాళ్లు స్థంభించిన పరిస్థితిని చూశాం. లాక్ డౌన్ లో ప్రపంచ దేశాల ప్రజలు అల్లాడిన ఘటనలు మరువక ముందే మరో వైరస్ చైనాలో కలకలం సృష్టిస్తోంది. కొత్తగా HMPV  వైరస్ విజృంభిస్తుండటంతో చైనాలో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. చైనాతో పాటు ప్రపంచ దేశాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

చైనాలో హెచ్ఎంపీ వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతున్నది. శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో అక్కడి హాస్పిటల్స్ రద్దీగా మారాయి. చైనాలోని నార్తర్న్ రీజియన్స్​లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని అక్కడి వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు చైనాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా కన్​ఫార్మ్ చేసింది. 

వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తి చెందుతున్నది. చిన్నారులతో పాటు వయస్సు పైబడినవారిలోనూ ఈ రకం వైరస్ కనిపిస్తున్నది. ఈ వైరస్ బారినపడివాళ్లు.. జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. ఫ్లూ తరహా లక్షణాలు బయటపడుతున్నాయి. 

చైనా మాటలు ఎంత వరకు నమ్మొచ్చు?

 తాజాగా వచ్చిన ఈ వైరస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న పరిస్థితులలో.. భయపడాల్సిన పరిస్తితి లేదని చైనా అంటోంది. చలికాలంలో వచ్చే వ్యాధులలో ఇదొకటి అన్నట్లుగా సింపుల్ గా చెప్పేసింది. 

భయాందోళన అవసరం లేదని, HMPV  వైరస్ తో అంత పెద్ద ముప్పేమీ లేదని చైనా చెప్పనైతే చెప్పింది కానీ.. చైనా మాటలు ఎంత వరకు నమ్మవచ్చు అనే ఆందోళనలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. కోవిడ్ 19 సమయంలో కూడా ఇలాగే చాపకింద నీరులా వ్యాపించి అల్లకల్లోలం చేసింది. అంశంపై భారత ఆరోగ్య శాఖ చేసిన ప్రకటన కాస్త ఉపశమనంలా కనిపిస్తుంది. 

ప్రస్తుతానికి ముప్పు లేదు: కేంద్రం

చైనా మాటలు నమ్మలేని పరిస్థితులలో భారత ఆరోగ్య శాఖ చేసిన ప్రకటన దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. చైనాలో స్ప్రెడ్ అవుతున్న హెచ్ఎంపీవీతో ప్రస్తుతానికి భారత్​కు ఎలాంటి ముప్పులేదని వైద్యశాఖ అధికారులు సూచించారు. వైరస్ వ్యాపించిన రోగుల లక్షణాల ఆధారంగా వైద్యులు ప్రకటన చేశారు. శ్వాసకోశ ఇన్​ఫెక్షన్ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని హెల్త్ సర్వీసెస్ డైరెక్టరేట్ జర్నల్ డాక్టర్ అతుల్ గోయెల్ తెలిపారు. దీనికి ప్రత్యేకంగా యాంటీ వైరల్ ట్రీట్ మెంట్ అంటూ ఏమీ లేదు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు తెలిపారు.