Good Health : మెంటల్ హెల్త్ ను సీరియస్ గా తీసుకోండి.. ఎవరూ పట్టించుకోవట్లేదు..!

హెల్దీగా ఉండడమంటే ఫిజికల్ గా  ఫిట్ గా  ఉండడమేనా? మెంటల్ ఫిట్ నెస్ అక్కర్లేదా? మన దేశపోళ్ల ఆలోచన మాత్రం ఇట్లానే ఉందట. మెంటల్ గా  హెల్దీగా ఉండాలని ఇండియన్స్ అనుకోవట్లేదా... ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 నిమిషాలకు ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) చెబుతోంది. అంటే మెంటల్ గా హెల్దీగా లేకపోవడం వల్లే వీళ్లంతా చనిపోతున్నారు. ఫ్యూచర్లో వీరిలో ఎక్కువ మంది మనదేశం వాళ్లే ఉంటారని డబ్ల్యూహెచ్ వో అంటోంది. ఎందుకంటే మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలోనే మెంటల్ హెల్త్ ను  పట్టించుకుంటలేరని తేలింది.గంటలు.. గంటలు నిద్రపోతూ.. ఒంట్లో బాగాలేదా అని అడిగితే.. ఏం చెప్పకుండా.. వాళ్లలో వాళ్లే బాధపడుతున్నట్లు కనపడతారు.  ఇలాంటి వారి గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారు.. వారి సలహాలు సూచనలు ఏంటో తెలుసుకుందాం. . 

ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాళ్లు.. డల్ గా కనిపిస్తే ..  ఏమైందని అడిగితే ఏడ్చినంత పనిచేస్తారు. ఎందుకు ఏడుపొస్తుందో కూడా తెలియడం లేదని చెబుతారు.  ఇంకా ఎవరితోనూ కలవరు.. ఎవరైనా ఫ్రెండ్స్ గాని.. ఇంట్లో వారు గాని అడిగితే  నన్ను  ఒంటరిగా వదిలెయ్యి..  అని అంటారు.  ఎప్పుడు చూసినా ఒక్కరే ఉంటారు.  అసలు అతగాడి సంగతి తెలుసుకుందామని డల్ గా కనిపించే వ్యక్తి పేరెంట్స్ ను అడిగితే.. వాళ్లకు కూడా అలానే కనిపిస్తున్నారని.. ఏం అడిగినా కోపంగా ఉంటున్నారని చెపుతారు. 

ఎప్పుడూ చలాకీగా.. యాక్టివ్ గా.. ఉత్సాహంగా ఉండే వారు డల్ గా ఉంటే ..ఏమీ చెప్పకుండా.. ఒంటరిగా ఉంటే.. ఇలాంటి సమస్యను  అతి సాధారణ మానసిక సమస్య(సీఎండీ)గా డాక్టర్లు చెప్పరు. ఇది కూడా ఒక హెల్త్ ఇష్యూ లాంటిదేనని, పట్టించుకోకపోతే మరెన్నో ప్రాబ్లమ్స్ కు దారి తీస్తుందని సైక్రియాటిస్టులు చెప్తున్నారు. అయితే... సీఎండీని హెల్త్ ఇష్యూగా ఒప్పుకునేందుకు ఎవ్వరూ అంగీకరించరు. ఎందుకంటే మెంటల్ హెల్త్ పై అవగాహన లేకపోవడమే. 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్   మనదేశంలో  ఓ సర్వే చేసింది. దీని ప్రకారం... దేశం మొత్తం మీద 2.7 శాతం మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. దాదాపు 15 కోట్ల మందికి ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు వెంటనే ట్రీట్ మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది.   ఈ విషయంలో ఫేమస్ సైన్స్ జర్నల్ కూడా  ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం డిప్రెషన్ తో బాధపడుతున్న వారు ...  పది మందిలో కేవలం ఒక్కరు మాత్రమే ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. మిగతా తొమ్మిది మంది అసలు తమకు సమస్య ఉన్నట్లే ఒప్పుకుంటలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు.   మనదేశంలో మెంటల్ హెల్త్ పై అవగాహన చాలా తక్కువగా ఉందని  పలు సంస్థలు చేసిన నివేదికలు  చేసిన సర్వే ద్వారా తెలుస్తుంది.  2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానసిక రోగుల్లో 30 శాతం మంది. భారతీయులే ఉంటారని ఓ సర్వే సంస్థ తెలిపింది.

Also Read :- మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా..?

మెంటల్ హెల్త్ దెబ్బతినడానికి మెయిన్ రీజన్ టెక్నాలజీ టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్కెట్ లోకి వస్తున్న గాడ్జెట్లన్నీ భారతీయుల మెంటల్ హెల్త్ ను దెబ్బతీస్తున్నాయి. నగరాలు విస్తరిస్తుండడం. పుట్టిన ఊరును విడిచి బతుకుదెరువుకు వేరే ప్రాంతానికి వెళ్లడం. ఫ్యామిలీలు విడిపోవడం.. ..ఇవన్నీ డిప్రెషన్ ను  పెంచుతున్నాయి. మెంటల్ హెల్ప్ పై ఇప్పుడిప్పుడే అవేర్ వెస్ పెరుగుతోంది. డిప్రెషన్ నుంచి బయటపడడానికి సైక్రియాటిస్టులను కలుస్తున్నారు. పదేళ్ల  కిందట రోజుకు నలుగురైదుగురు పేషెంట్లు కూడా రాని సైక్రియాటిస్టుల దగ్గరకు ఇప్పుడు ఒ వంద మంది దాకా వస్తున్నారు. 

 డిప్రెషన్ తో బాధపడి, దాని నుంచి బయటపడిన విషయాన్ని సెలబ్రిటీలు ఓపెన్ గా చెప్పుకోవడం.. మిగతావారిలో మార్పు తెస్తోంది. కొందరు డాక్టర్ల దగ్గరకు పొయ్యేందుకు ఇష్టపడకపోయినా యోగా, మెడిటేషన్, ఎక్సర్ సైజులు చేస్తూ డిప్రెషన్ ను తగ్గించుకునేందుకు ట్రై చేస్తున్నారు.నిజానికి సీఎండీతో బాధపడేవారు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కో ఆపరేషన్ తో  ఈజీగా బయటపడొచ్చు. యోగా, మెడిటేషన్ వంటివి కూడా కొంత వరకు డిప్రెషన్ ను తగ్గిస్తాయి. అయితే తాము డిప్రెషన్లో ఉన్నామన్న విషయాన్ని ముందు అంగీకరించాలి. తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. కానీ చాలామంది డిప్రెషన్ లో ఉన్నట్లు ఒప్పుకోరు. అందుకే సీఎండీ వంటి సమస్యకు కూడా డాక్టర్ ను  కలవాల్సి వస్తోంది.

సీఎండీ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. కొందరు ఫిజికల్  ఫిట్ గా  ఉన్నా అలసిపోతుంటారు. ఏ పనినీ ఇంట్రెస్ట్ గా  చేయరు. ఏ కారణం లేకుండానే కోప్పడుతుంటరు.. ఏడుస్తుంటారు. పిల్లల్లో దీనిని ఈజీగా గుర్తించవచ్చు. అప్పటిదాకా హ్యాపీగా ఉన్నవాళ్ల బిహేవియర్ ఒక్కసారిగా మారిపోతుంది. స్కూల్ కు వెళ్లేందుకు ఇష్టపడరు.. ఎప్పుడూ బద్దకంగా ఉంటారు. లేదంటే ఓవర్ యాక్టివ్ గా ఉంటారు. రెండు వారాలకు  మించి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్  కలవడమే బెస్ట్. హార్మోన్ ఇంబాలెన్స్ తో బాధపడుతున్నవారు, థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, డయాబెటిస్ ఉన్నవాళ్లు మిగతావాళ్ల కంటే ఎక్కువగా మానసిక సమస్యలబారిన పడతారు. డబ్ల్యూహెచ్ వో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గర్భిణుల్లో యావరేజ్ గా 10 శాతం మంది, డెలివరి తర్వాత 13 శాతం మంది మహిళలు డిప్రెషన్ కు గురవుతున్నరు. 

మనలాంటి దేశాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటోంది. 18 నుంచి 20 శాతం మధ్యలో ఉంటోంది. పిల్లల విషయానికి వస్తే. ప్రతి వందమందిలో ఇద్దరి మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండడం లేదు. టీనేజర్స్ మాత్రం ఫిజికల్ హెల్త్ తోపాటు మెంటల్ హెల్త్ ను  కూడా బ్యాలెన్స్ చేసుకునేందుకు ట్రై  చేస్తున్నారు. అయితే టీనేజ్ లో శరీరంలో వచ్చే మార్పులు వాళ్లను మరింత డిప్రెషన్ కు  గురిచేస్తున్నాయి.  అయితే దీనిగురించి భయపడాల్సిన పనిలేదు. అవి కాలంతోపాటు పరిష్కారమవుతాయి. జస్ట్ అవేర్నెస్ కల్పిస్తే చాలు. అయితే సోషల్ మీడియా కారణంగా వచ్చే సమస్యలను మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎందుకంటే వీటి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే డాక్టర్ ను  కలవడం తప్పనిసరి.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే మనదేశంలో మహిళలు తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలసట, కంగారు, యాంగ్జైటీ, ఒంటరితనం వంటి ప్రాబ్లమ్స్ తో డాక్టర్ దగ్గరకు వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.  వేధింపులు, పని ఒత్తిడి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సోషల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఎన్విరాన్ మెంట్.. ఇవన్నీ మహిళల్లో మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి.  భర్త సపోర్ట్ తో చాలావరకు వీటిని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ భర్త దగ్గర కూడా తమ సమస్యను చెప్పుకోలేని మహిళల సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ.. పైగా తమకున్నది మానసిక సమస్య అని తెలుసుకునేవారు చాలా తక్కువ. తనతోసహా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలుగానే అనుకుంటారు. చివరకు ఇది తీవ్రమైన ఒత్తిడికి దారితీసి సూసైడ్ చేసుకునేందుకు కారణమవుతోంది.

ఒకసారి నూ సైడ్ ప్రయత్నం చేసినవారు మళ్లీ మళ్లీ సూసైడ్ గురించి ఆలోచించే ప్రమాదముంటుంది. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే దాని ప్రభావం డైరెక్ట్ గా , ఇన్ డైరెక్ట్ గా  135 మందిపై పడుతుందట. ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, చుట్టుపక్కలవారు ఇలా అందరూ ప్రభావితమవుతారని సైక్రియాటిస్టులు చెబుతున్నారు. దేశంలో మానసిక రోగులు పెరుగుతున్నా వాళ్లకు ట్రీట్ మెంట్ చేసే నిపుణుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. అమెరికాలో సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు 60 వేల నుంచి 70 వేల మంది ఉంటరు.. మనదేశంలో మాత్రం కనీసం నాలుగు వేల మంది కూడా లేదు. ఇప్పటికిప్పుడు మరో 20 వేల మంది సైకియాట్రిస్టుల అవసరం ఉందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 43 మెంటల్ హాస్పిటళ్లు ఉంటే.. వాటిలో రెండో.. మూడో ఆస్పత్రుల్లో మాత్రమే అన్ని సదుపాయాలున్నయ్. మిగతావాటిలోఇప్పుడిప్పుడే ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు.

-వెలుగు, లైఫ్-