తిరుమల లడ్డూ వివాదం: రిటైర్డ్ జడ్జితోవిచారణకు సుప్రీం కోర్టులో పిటిషన్లు

  • సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: వైవీ సుబ్బారెడ్డి
  • స్వతంత్ర కమిటీ ఏర్పాటు  చేయాలి: సుబ్రమణ్య స్వామి

న్యూఢిల్లీ, వెలుగు: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదంపై సుప్రీం కోర్టులో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలు కాగా, సోమవారం మరికొన్ని పిల్స్ ఫైల్ అయ్యాయి. 

సిట్టింగ్ జడ్జి లేదంటే రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరపాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్లపై బీజేపీ నేతసుబ్రమణ్య స్వామి పిల్ దాఖలు చేశారు.

లడ్డూలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ నిరాధార ఆరోపణలు చేసి భక్తులను చంద్రబాబు గందరగోళానికి గురిచేశారని పిటిషన్​లో ఆయన పేర్కొన్నారు. 

పోయిన వారం సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్ సురేశ్ ఖండేరావు చవాంకే కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ వివాదంపై విచారణ జరిపించాలని కోరారు. సిట్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయాలని హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​కు అడ్వొకేట్ సత్యసింగ్ లేఖలో రిక్వెస్ట్ చేశారు.

నెయ్యి కంటే పందికొవ్వే కాస్ట్​లీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి 

నెయ్యి కంటే పంది కొవ్వే కాస్ట్​లీ అని, అలాంటి ఖరీదైన దాన్ని తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో ఎవరైనా కలుపుతారా? అని వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ, అడ్వొకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వివాదాస్పద కామెంట్స్ చేశారు. 

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తరఫున సోమవారం సుప్రీం కోర్టులో సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన ఢిల్లీ తెలంగాణ/ఏపీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కిలో రూ.319 మాత్రమే.. పంది కొవ్వు రూ.450 నుంచి రూ.1,200 వరకు ఉంటది. ఇంతటి ఖరీదైన పందికొవ్వును ఎవరైనా లడ్డూ తయారీలో కలుపుతారా?’’అని వివాదాస్పద కామెంట్లు చేశారు.