తెలంగాణ కిచెన్ : వేసవి..రుచుల కాంబినేషన్​

వామ్మో ఈ వేడికి ఏదీ తినాలనిపించట్లేదు. నీళ్ల చారు ఏదైనా ఉంటే బాగుండు. టిఫిన్​లోకి చట్నీ ఏం తింటాం? చారు ఏదైనా ఉంటే హాయిగా తినొచ్చు” అనే డైలాగ్​ వేసవికాలంలో  ప్రతి ఇంటా వినిపిస్తుంటుంది. ఇలాంటప్పుడే ‘‘కొత్తగా ఏం వండాలా?’’ అని ఆలోచిస్తుంటారు. ఇక ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టండి. పొట్టని చల్లగా ఉంచే టేస్టీ, హెల్దీ రెసిపీలు ఇవి.

కారా బాత్ - నీరు చట్నీ

కావాల్సినవి :
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
నూనె - ఒక టేబుల్ స్పూన్
జీడిపప్పులు - పది
ఆవాలు, శనగపప్పు, జీలకర్ర - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
కరివేపాకు - కొంచెం
అల్లం తురుము - ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - రెండు
ఉల్లిగడ్డ తరుగు (సన్నని) - ఒక కప్పు
ఉప్పు - సరిపడా, పచ్చి బటానీ - టేబుల్ స్పూన్
క్యారెట్, బీన్స్ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
బొంబాయి రవ్వ - ఒక కప్పు
టొమాటో తరుగు - పావు కప్పు
వేడి నీళ్లు - మూడు కప్పులు
పసుపు - అర టీస్పూన్
కొత్తిమీర - కొంచెం
చట్నీకోసం : 
అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి - ఐదు
కొత్తిమీర - కొంచెం
పుదీనా ఆకులు - ఐదు
పచ్చికొబ్బరి ముక్కలు - ఒక కప్పు
ఉప్పు - సరిపడా
పుట్నాలు (వేగించి) - ఒక టేబుల్ స్పూన్
నీళ్లు - సరిపడా
చింతపండు - ఒక టీస్పూన్

తయారీ : ఒక పాన్​లో నెయ్యి, నూనె వేడి చేసి జీడిపప్పులు వేగించి పక్కన పెట్టాలి. తర్వాత అందులో ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేగించాలి. అల్లం తురుము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, పచ్చి బటానీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ తరుగు వేగించాలి. తర్వాత బొంబాయి రవ్వ కలపాలి. అది కాసేపు వేగించాక అందులో టొమాటో తరుగు వేసి, వేడి నీళ్లు పోసి కలపాలి. ఉండ కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత పసుపు, కొత్తిమీర కలపాలి. మిక్సీజార్​లో అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పచ్చికొబ్బరి ముక్కలు, పుట్నాలు, చింతపండు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో మరికొన్ని నీళ్లు పోసి కలిపి, తాలింపు వేయాలి. ఈ నీటి చట్నీని, ఉప్మాతో పాటు తింటే ఆ టేస్టే వేరు. 

పెసరపప్పు పులుసు

కావాల్సినవి :
పెసరపప్పు - అర కప్పు
ఉల్లిగడ్డలు (చిన్నవి) - పది
పచ్చిమిర్చి - ఐదు
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - సరిపడా
నిమ్మరసం - రెండు టీస్పూన్లు
తయారీ : పెసరపప్పుని నూనె లేకుండా వేగించాలి. తర్వాత నీళ్లు పోసి ఉడికించాలి. మరో పాన్​లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. అవన్నీ ఉడికించి, మెదిపిన పెసరపప్పు కలపాలి. తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. అందులో తాలింపు వేసి, కొత్తిమీర చల్లుకుంటే పెసరపప్పు పులుసు రెడీ.

టిఫిన్ సాంబార్ 

కావాల్సినవి :
కందిపప్పు - అర కప్పు
మునక్కాయ - ఒకటి
సొరకాయ లేదా బూడిద గుమ్మడి కాయ ముక్కలు - పావు కప్పు
తీపి గుమ్మడి కాయ ముక్కలు - ముప్పావు కప్పు
పచ్చిమిర్చి - రెండు, టొమాటో - ఒకటి
క్యారెట్ ముక్కలు - పావు కప్పు, కారం - అర టీస్పూన్ప
సుపు - పావు టీస్పూన్, ఉల్లిగడ్డ - ఒకటి, నీళ్లు - సరిపడా చింతపండు - నిమ్మకాయ సైజు, పచ్చిశనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
ధనియాలు - రెండు టేబుల్ స్పూన్లు, మెంతులు - పావు టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, మినప్పప్పు, బియ్యం - ఒక్కో టేబుల్ స్పూన్
పచ్చి కొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు, ఉప్పు - సరిపడా, బెల్లం - 50 గ్రాములు

తయారీ : కందిపప్పుని అరగంట నానబెట్టాలి. తర్వాత ఒక గిన్నె​లో నానబెట్టిన కందిపప్పు, పసుపు, కారం, మునక్కాయ, సొరకాయ లేదా బూడిద గుమ్మడి, తీపి గుమ్మడి, టొమాటో, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు వేయాలి. అందులో అర లీటర్ నీళ్లు పోసి ఉడికించాలి. ప్రెజర్ కుక్కర్​లో పెడితే నాలుగు విజిల్స్ వచ్చేవరకు. ఉడికాక, చల్లారనివ్వాలి. ఆపై వాటన్నింటినీ మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో చింతపండు వేసి వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. 
పాన్​లో ఎండు మిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, బియ్యం, ధనియాలు వేసి నూనె లేకుండా వేగించాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేగించాలి. వాటన్నింటినీ మిక్సీజార్​లో వేయాలి. వాటిలో నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. 
పాన్​లో నూనె వేడి చేసి కరివేపాకు, ఎండు మిర్చి, ఆవాలు వేగించాలి. అందులో చింతపండు రసం మరిగించి, సాంబార్ పేస్ట్ కలపాలి. ఆపై గ్రైండ్ చేసిన కందిపప్పు మిశ్రమం కలపాలి. ఉప్పు, బెల్లం వేయాలి. తరువాత నీళ్లు పోసి బాగా తెర్లే వరకు కాగబెట్టాలి. చివరిగా కొత్తిమీర, నెయ్యి కలపాలి. ఈ సాంబార్ ఇడ్లీ, వడల్లోకి చాలా బాగుంటుంది.

సొరకాయ పులుసు

కావాల్సినవి :
సొరకాయ ముక్కలు - రెండు కప్పులు
ఉప్పు, నీళ్లు - సరిపడా
కారం - రెండు టీస్పూన్లు
చింతపండు - నిమ్మకాయ సైజు
ఉల్లిగడ్డ తరుగు - ఒకటి 
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
మెంతులు - పావు టీస్పూన్
పోపు దినుసులు - ఒక టేబుల్ స్పూన్
వెల్లుల్లి - నాలుగు
కరివేపాకు - కొంచెం
పచ్చిమిర్చి - రెండు
టొమాటో - ఒకటి
పసుపు - పావు టీస్పూన్
ధనియాల పొడి - ఒక టీస్పూన్
 

తయారీ : చింతపండు నానబెట్టాలి. నూనె వేడి చేసి మెంతులు, పోపు దినుసులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేగించాలి. అవి వేగాక, సొరకాయ ముక్కలు, ఉప్పు ఒక్కోటిగా వేగించాలి. అందులో పసుపు కలిపి, మూతపెట్టి ఉడికించాలి. తర్వాత చింతపండు పులుసు పోయాలి. అందులో కారం, ధనియాల పొడి వేయాలి. నీళ్లు పోసి మూతపెట్టాలి. తక్కువ మంట మీద ఐదు నిమిషాలు ఉడికిస్తే సూపర్​ సొరకాయ 
పులుసు రెడీ.

జొన్న అన్నం - పెరుగు చారు

కావాల్సినవి :
జొన్న రవ్వ - ఒక కప్పు
నీళ్లు - మూడున్నర కప్పులు
ఉప్పు - సరిపడా
పెరుగు - రెండు కప్పులు
ఉల్లిగడ్డ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం ముక్కలు - ఒక టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
నూనె - అర టేబుల్ స్పూన్​ 
పోపు దినుసులు - ఒక టీస్పూన్
పసుపు, కారం - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున

తయారీ : గిన్నెలో రవ్వ వేసి నీళ్లతో కడగాలి. తర్వాత అర కప్పు నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. పాన్​లో మూడు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించాలి. తరువాత ఉప్పు వేసి కలిపి అందులో నానబెట్టిన జొన్న రవ్వని నీళ్లతో సహా వేయాలి. మూతపెట్టి ఉడికిస్తూ, మధ్య మధ్యలో ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతుండాలి. రవ్వ బాగా ఉడికాక ఒక గిన్నెలో పెట్టాలి.  
మరో గిన్నెలో పెరుగు వేసి గిలక్కొట్టాలి. అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు కలపాలి. నూనె వేడి చేసి పోపు దినుసులు వేయాలి. అందులో కొంచెం పసుపు, కారం కూడా వేసి కలపాలి. ఆ పోపుని పెరుగు మిశ్రమంలో కలపాలి.  జొన్న అన్నంలో ఈ పెరుగు చారు వేసుకుని తింటే ‘ఈ జన్మమే....’ అని పాడుకోవాల్సిందే. ఒంటికి చలువ చేయడమే కాకుండా బరువు తగ్గేందుకు బెస్ట్ రెసిపీ ఇది.