ఒకప్పుడు ఆయన జీతం నెలకు 150 రూపాయలు. అప్పట్లో అది ఒక వాచ్‌మెన్‌కు వచ్చే శాలరీ కంటే తక్కువ. కానీ.. ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ 5 వేల కోట్లకు పైమాటే. ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరాలు అధిరోహించిన ఆయన ఎవరో కాదు.. థైరోకేర్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ ఆరోకియస్వామి వేలుమణి. ఆయన కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా యూనికార్న్ కంపెనీని నిర్మించి సక్సెస్‌కు కేరాఫ్‌గా నిలిచాడు.
డాక్టర్ వేలుమణి పేదరికంతోపాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆయన జీవితంలో ఒక్కపూట భోజనం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇండియాలో డయాగ్నస్టిక్స్ ఇండస్ట్రీ మీద తనదైన ముద్ర వేశాడు. థైరాయిడ్ టెస్ట్ ధర తగ్గించి లక్షలాది మందికి అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అతి పెద్ద థైరాయిడ్ పరీక్షా కేంద్రాన్ని నిర్మించాడు.
ఆరోకియస్వామి వేలుమణి తమిళనాడులోని కోయంబత్తూరు, అప్పనైకెన్‌పట్టి పుదూర్ అనే కుగ్రామంలో 1959 ఏప్రిల్‌లో పుట్టాడు. వేలుమణి తండ్రి వ్యవసాయం చేసేవాడు. పాడి పశువులు కూడా ఉండేవి. తల్లి గేదెల పాలు పితికి అమ్మేది. అయినా.. కుటుంబం గడవడం కాస్త కష్టంగానే ఉండేది. మూడు పూటలా భోజనం చేయలేని రోజులు వాళ్ల జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వేలుమణిని వాళ్ల తండ్రి స్థోమతకు మించి ఖర్చుపెట్టి మరీ చదివించాడు. వాళ్ల ఊళ్లోనే ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. తర్వాత కోయంబత్తూరులో శ్రీ రామకృష్ణ మిషన్ విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో 1978లో డిగ్రీ పూర్తి చేశాడు. ముంబై యూనివర్సిటీ నుంచి1985లో మాస్టర్స్ డిగ్రీ, ఇదే యూనివర్సిటీలో1995లో ‘థైరాయిడ్ బయోకెమిస్ట్రీ’లో డాక్టోరల్ డిగ్రీ అందుకున్నాడు.
150 రూపాయల జీతం
బీఎస్సీ పూర్తి చేశాక మంచి ఉద్యోగం వస్తుందని.. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వేలుమణి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ.. అతను ఊహించింది ఏదీ జరగలేదు.1979లో ‘జెమిని క్యాప్సూల్స్’ అనే చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. అతనికి అదే మొదటి ఉద్యోగం.150 రూపాయలు జీతం వచ్చేది. ఆ ఏరియా వాచ్‌మెన్ జీతం కంటే తక్కువ జీతం అది. అయినా.. నాలుగేండ్ల వరకు అక్కడే పనిచేశాడు. వచ్చిన జీతం నుంచి 50 రూపాయలు తన ఖర్చుల కోసం పెట్టుకుని... మిగతా వంద రూపాయలు అతని ఫ్యామిలీకి పంపేవాడు. కానీ.. వేలుమణి చేరిన నాలుగేండ్లకు కంపెనీ మూతపడింది.
బార్క్‌లో ...
వేలుమణి మళ్లీ ఉద్యోగాల వేటలో పడ్డాడు. కానీ.. ఎక్కడా సరైన ఉద్యోగం దొరకలేదు. చివరికి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీని బార్క్ అని కూడా పిలుస్తారు)లో చేరాడు. భారతదేశంలోనే ప్రధానమైన అణు పరిశోధనా కేంద్రంలో పని చేస్తానని కలలో కూడా అనుకోలేదు అతను. అందుకే ఉద్యోగం దొరకగానే చాలా సంతోషించాడు. అందులో లాబొరేటరీ అసిస్టెంట్‌గా చేరాడు.
అందులోనే పద్నాలుగేండ్లు పనిచేశాడు. పరిశోధనా కేంద్రంలో ఉన్న టైంలోనే ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత మాస్టర్ డిగ్రీ పూర్తి చేయడంతో ముంబైలోని పరేల్‌లో ఉన్న టాటా మెమోరియల్ హాస్పిటల్‌లోని బార్క్ విభాగంలో రేడియేషన్ మెడిసిన్ సెంటర్లో పనిచేసేందుకు ప్రమోట్ చేశారు. కానీ.. అతనికి బయోకెమిస్ట్రీపై ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో డాక్టరేట్ చదివే అవకాశం వచ్చింది. వెంటనే మరో ఆలోచన లేకుండా డాక్టరేట్ పూర్తిచేశాడు.
లాబొరేటరీ పెట్టాలని..
అప్పట్లో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికి చాలా ఖర్చయ్యేది. తక్కువ ధరకు ఆ టెస్ట్ అందించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేశాడు. థైరాయిడ్ పరీక్ష చేయించుకోలేని పేదలకు ఎలాగైనా సాయం చేయాలని ఒక సంస్థ పెట్టాలి అనుకున్నాడు. కానీ.. అతని దగ్గర డబ్బు లేదు. అందుకే అతని పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) నుండి లక్ష రూపాయలు తీసి వాటితో కంపెనీ పెట్టాడు. సంస్థ పెట్టగానే.. కంపెనీలో మొదటి ఉద్యోగిగా తనే చేరాలని వేలుమణి భార్య సుమతి అనుకుంది. అప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తున్న ఉద్యోగం మానేసిందామె. ఇద్దరూ కలిసి పేద ప్రజలకు తక్కువ ధరలో థైరాయిడ్ టెస్ట్‌లు అందించడం మొదలుపెట్టారు. అలా1996లో థైరోకేర్ టెక్నాలజీస్ పుట్టింది. కంపెనీ పెట్టిన 23 ఏండ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.
ప్రివెంటివ్ టెస్ట్‌లు
డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఫ్రాంఛైజీ మోడల్స్‌ని తీసుకొచ్చాడు. తక్కువ ధరలకే టెస్టింగ్ సర్వీసులను అందించాడు. 2006లో ప్రివెంటివ్ హెల్త్‌కేర్ డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించడంలో ముందున్నాడు. తక్కువ ధరకు టెస్ట్‌లు చేయడం వల్ల వచ్చే నష్టాలను ఎక్కువ వాల్యూమ్‌లు సంపాదించి లాభాలుగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇతర ల్యాబ్‌లతో పోలిస్తే.. ధరలను చాలా తగ్గించాడు.
అప్పట్లో ఏ ల్యాబ్‌కు రోజుకు రెండు మూడు కంటే ఎక్కువ థైరాయిడ్ టెస్ట్ శాంపిల్స్ వచ్చేవి కాదు. అందుకే పెద్ద ల్యాబ్‌లు పెట్టడం కంటే చిన్న ల్యాబ్‌లు ఎక్కువగా పెట్టడంవల్ల వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నాడు. ఫ్రాంచైజీ మోడల్‌ను పరిచయం చేశాడు. దాంతో శాంపిల్స్ సంఖ్య బాగా పెరిగింది. ఆ తర్వాత అన్ని రకాల రక్త పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ డయాగ్నస్టిక్స్, ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలతో సహా అనేక టెస్ట్‌లు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు థైరోకేర్‌లో లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రొఫైల్ నుండి క్యాన్సర్, షుగర్, వంధ్యత్వ పరీక్షల వరకు అన్ని టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
వేలుమణి ఎంతో కష్టపడి కంపెనీని డెవలప్ చేశాడు. అన్నీ తానై కంపెనీని ముందుకు నడిపించాడు. సీఈవో, ఎండీ, చైర్మన్‌గా మూడు బాధ్యతలు తనవే. ఇప్పుడు ఇండియాతోపాటు నేపాల్, బంగ్లాదేశ్‌లో కూడా సర్వీసులు అందిస్తోంది. మొత్తం 1,120కిపైగా అవుట్‌లెట్లు ఉన్నాయి.
లాభాల్లో అమ్మేశాడు
కంపెనీని 2016లో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ చేశాడు. అప్పుడు కంపెనీ మీద ఉన్న అంచనాలకు మించి షేర్ వ్యాల్యూ పెరిగింది. అయితే.. లిస్టింగ్‌కు వెళ్లే ముందు వేలుమణి భార్య ప్యాంక్రియాసిస్ క్యాన్సర్‌తో చనిపోయింది. అది ఆయనకు కోలుకోలేని ఎదురుదెబ్బ. ఆ తర్వాత రెండు మూడేండ్ల వరకు వేలుమణికి తను ఆమెపై ఎంత ఆధారపడి ఉన్నాడో అర్థమైంది. అదే టైంలో కరోనా ప్యాండెమిక్ సంక్షోభం. కొవిడ్ టెస్ట్ కోసం ఎంపికైన మొదటి కంపెనీ థైరోకేర్. దాంతో.. ఎనిమిది నుండి తొమ్మిది నెలల్లో వ్యాపారం బాగా పెరిగింది. షేర్ ధర రెట్టింపు అయ్యింది.
అంతా బాగానే ఉంది అనుకున్న టైంలోనే కంపెనీని అమ్మేశాడు. అందుకు కారణం... ఆయన పిల్లలు ఆ బిజినెస్‌ని కొనసాగించేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడమే. లాభాల్లో ఉన్నప్పుడే అమ్మడం మంచిది అనుకున్నాడు. పైగా పోటీ పెరిగింది. ఆయనకు కూడా విశ్రాంతి తీసుకోవాలి అనిపించింది. కావాల్సినంత డబ్బు సంపాదించాడు. అందుకే కంపెనీని 2021లో ‘ఫార్మ్ఈజీ’ కంపెనీకి రూ.4,500 కోట్లకు అమ్మేశాడు. దాంతో ఒకప్పుడు 500 రూపాయలతో ముంబయికి వెళ్లిన ఆయన ఆస్తుల విలువ ఐదు వేల కోట్లకు చేరింది.
అగ్రిటెక్‌లో..
‘‘మరిన్ని ఉద్యోగాలను సృష్టించే వ్యాపారాల కోసం చూస్తున్నా. సర్వీసులు అందించే కంటే మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడితే.. ఎక్కవ మందికి ఉపాధి దొరుకుతుంది. అందుకే అగ్రిటెక్ కంపెనీ పెట్టాలని ఉంది. దేశంలో చాలా వ్యవసాయ భూమి ఉంది. గ్రామాల్లో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్లు సరైన పనిని ఎంచుకోవడం లేదు. అలాంటివాళ్లకు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించి.. ఫుడ్, మాంసం, వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసే యూనిట్లు పెడితే వాళ్లకు సాయంగా ఉంటుంది. నేను ఊరి నుంచి వచ్చిన వాడినే. ఒక రైతు కొడుకుని. అందుకే అక్కడికే వెళ్లాలి అనుకుంటున్నా. గ్రామీణ ప్రాంతాల్లో 5,000 ఉద్యోగాలు కల్పించేందుకు వంద కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నా” అన్నారు వేలుమణి.
అప్పు లేదు
వేలుమణికి అప్పు తీసుకోవడం అంటే నచ్చదు. అందుకే కంపెనీ పెట్టేటప్పుడు, పెట్టిన తర్వాత కూడా ఎక్కడా అప్పు చేయలేదు. వచ్చిన లాభాలనే మళ్లీ పెట్టుబడిగా పెట్టాడు. అంతేకాదు.. కంపెనీ పెట్టకముందు కూడా అప్పు చేయలేదు. ఇంతవరకు తన జీవితంలో ఎప్పుడూ ఈఎంఐ కట్టలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.