సాంప్రదాయానికి అర్థం చెప్పే పండుగ. తెలుగువారికి పెద్ద పండగ.. ఎక్కడున్నా అందరూ ఒక్క చోటికి చేరి చేసుకునే పండుగ.. సంక్రాంతి పండుగ. సందడిని తెస్తూ… అంబరాన్నంటే విధంగా సంబరాలు చేసుకోమని చెప్పే పండుగ సంక్రాంతి. పంటతల్లి ఇంటికొచ్చే పండుగ.. పదిమంది పంచుకునే ఫలితం. భూమితల్లి ఇచ్చే భోగభాగ్యాలు.. సంక్రాంతి తెస్తుంది ధాన్యపురాశులు. ఇదీ మూడురోజుల పాటు ముచ్చటగా సందడిగా జరుపుకొనే సంక్రాంతి పండుగ సందర్భం.
సంక్రాంతి పండుగకు నెలరోజుల ముందే ఇళ్లల్లో హడావిడి మొదలవుతుంది. మూడురోజుల పండుగను ఆస్వాదించడానికి ఎదురు చూపులు చూస్తారు. సాంప్రదాయాలకు నెలవైన పండుగ. తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే పండుగ. ఏ పండుగకు ఎలాగున్నా.. ఈ పండుగలో సంప్రదాయానికే ప్రాధాన్యతనిస్తారు. భోగి మొదలు ముక్కనుమ వరకు ఇంట్లో సందడే సందడి. కొత్త అల్లుళ్లు.. కొంటె మరదళ్లు… కోడి పందాలు.. పిండి వంటలు.. సరదా ఆటలు… సాంప్రదాయ పనులు… అన్నీ సంక్రాంతిలో భాగమే. ఇవన్నీ ఒకెత్తైతే పండుగలో డూడూ బసవన్నలు, హరిదాసుల రాకలు ఊరికి దేవుళ్ల రూపంలో అతిధులొచ్చినట్లుగా తెలుగువారు భావించే సమయం.
భోగి : భోగి మంటలు.. బోగిళ్లు.. భోగభాగ్యాల భోగిళ్లతో ప్రారంభమవుతుంది సంక్రాంతి పండుగ. పాతకు పాతరేస్తూ కొత్తను ఆహ్వానించడం భోగి పండుగ లక్షణం. భోగిమంటల సారం. అందుకే పాత వస్తువులన్నీ భోగిమంటల్లో వేసేస్తారు. మనిషికి ప్రకృతి ఆరాధ్య దైవం. అందులోనూ సూర్యుడు అంటే ప్రత్యక్షదైవంగా చూస్తారు. అప్పటి వరకు నరాలను పిండే చలిని అనుభవిస్తూ… వేడి కలిగించాలనే సూచికగా భోగిమంటను వేస్తారు. అంతేకాదు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన సందర్భంగా కావడంతో వేసవికి స్వాగతం పలికేదిగా కూడా భోగిమంటగా వర్ణిస్తారు. భోగి పండుగ రోజు తెలుగు లోగిళ్లలో ఎంతో సందడి ఉంటుంది.
పుష్యమాసంలో వచ్చే పర్వదినం సంక్రాంతి. మకరంలో సుర్యుడు సంక్రమించిన సందర్భం.. మకర సంక్రాంతి. ప్రతీ మాసంలో సంక్రమణం ఉన్నా పుష్యమాసంలో వచ్చే మకర సంక్రమణం అతి పవిత్రంగా భావిస్తారు. మకర సంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణ దిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్లుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరు నెలలు ఉత్తరాయణం అంటారు. అంతకు ముందు ఆర్నెల్లు దక్షిణాయనం. దక్షిణాయణాన్ని పితృయానం అని, ఉత్తరాయణాన్ని దేవయానం అని చెబుతారు. అందుకనే ఈ రోజుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు.
సంక్రాంతి రోజే అసలు పండుగ సంక్రాంతి రోజే అసలు పండుగ మొదలవుతుంది. తీపితో మొదలై అన్ని రకాల వంటలు చేసుకుంటారు. పిండి వంటలకు ప్రత్యేకత సంక్రాంతి. పితృదేవతలను తలచుకున్న రోజు కావడంతో ఆ రోజు సందడిగా పండుగ చేసుకుంటారు. గాలిపటాలు ఎగరవేస్తారు. ఎన్నో ఆటలు ఆడతారు. ఆడపిల్లలైతే ఉయ్యాలాటలు.. కోలాటాలు ఇంకా ఎన్నెన్నో చేస్తూ పండుగను ఆస్వాదిస్తారు. ఇక మూడో రోజు కనుమ.. పశువులను పూజించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. తెలుగువారు పంట తరువాత గోవులకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. అందుకే గోవులను పూజించుకోవడం ద్వారా వారికి క్షేమం కలుగుతుందని నమ్మకం.