- తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల కమిషన్
కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. దీనిని బెంగాల్ బాలల హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. రెండు రోజుల్లోగా బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కు గురవ్వడంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న ఓ వ్యక్తి.. అభిషేక్ బెనర్జీ కూతురును అత్యాచారం చేస్తామని, అలా చేసిన వారికీ రూ.10 కోట్ల రివార్డు అందిస్తామని బెదిరించడం కలకలం రేపింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిని బెంగాల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సుమోటోగా స్వీకరించింది. ఓ ప్రకటన జారీ చేసింది. “అతడి అసభ్యకరమైన వ్యాఖ్యలు నీచమైన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. అవి చిన్నారి భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయి. ఆర్జీకర్ ట్రైనీ డాక్టర్ మృతితో రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోయింది. ఇటువంటి సమయంలో మరొక రేప్ కు పిలుపునివ్వడం కచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడమే. ఆ వ్యక్తిని శిక్షించకపోతే సమాజానికి ప్రమాదకరమైన సంకేతం పంపిచినట్టవుతుంది. ఇది కేవలం ఆ మైనర్ బాలికనే కాకుండా మొత్తం మైనర్ బాలికలందర్ని ప్రమాదంలో పడేస్తుంది. పొక్సో చట్టం కింద అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాం” అని తెలిపింది.