పోటెత్తిన వరద ప్రాణహిత బ్యాక్ వాటర్ తో వేలాది ఎకరాల్లో నీట మునిగిన పత్తి ,కంది

  • జలదిగ్బంధంలో 14 గ్రామాలు
  • ఐదు రోజులుగా గెరువియ్యకుండా కురుస్తున్న వర్షాలు
  • నిత్యవసరాలు, మందుల కోసం అవస్థలు

ఆసిఫాబాద్/ కాగజ్​నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర నుంచి వరద తోడవడంతో ప్రాణహిత, వార్దా నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రాణహిత బ్యాక్ వాటర్​తో నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పత్తి, కంది, వరి పంటలు నీట మునిగాయి. చింతలమానేపల్లి, బెజ్జుర్ మండలాల్లో 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద పోటుకు బ్రిడ్జీలపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. నిత్యవసరాలు, మెడిసిన్ కోసం ప్రజలు గోస పడుతున్నారు. 

  • దిందా గ్రామంలో ఐదు రోజులుగా..

మండలంలోని గూడెం వద్ద తెలంగాణ- మహారాష్ట్ర అంతరాష్ట్ర బ్రిడ్జ్ కింద ఆరడుగుల దూరంలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బెజ్జూర్‌ మండలం తలాయి వద్ద నది ఉధృతికి మండలం లోని తలాయి, తిక్కపల్లి, భీమారం, సోమిని, గెర్రెగూడ, కొత్త గెర్రగూడ, చింతపూడి, పాత సోమిని, సుశ్మీర్, మొగవెళ్లి, ఇప్పలగూడ, బండ్లగూడ, నాగపెల్లి గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం ఐదు రోజులుగా జలదిగ్బంధంలోనే బిక్కుబిక్కుమంటున్నారు. దహెగాం మండలంలోని మొట్లగూడ, రావులపల్లి, రాంపూర్, లోహ, టేపర్గాం, దిగిడ గ్రామ శివారులోని దాదాపు వెయ్యి ఎకరాల పత్తి పంట ప్రాణహిత బ్యాక్ వాటర్​లో మునిగిపోయాయి. ప్రాణహిత వరదతోపాటు వాగులు ఉప్పొంగడంతో ప్రజలు ఊర్లు దాటలేకపోతున్నారు.

  • వరద ప్రాంతాల్లో కనిపించని స్పెషల్ ఆఫీసర్లు

గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోగా ప్రత్యేక అధికారులు మాత్రం వరద ప్రాంతాల్లో కనీసం పర్యటించడంలేదు. ఈ సమయంలో బాధిత ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అధికారులు, మండల, గ్రామ ప్రత్యేక అధికారులు ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. కేవలం పోలీస్​ అధికారులు మాత్రమే వరదతో నిండిన వాగులు దగ్గర రాకపోకలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గతంలో వరదలు వచ్చిన సమయంలో తాత్కాలికంగా నాటు పడవలతో ప్రజలు రాకపోకలు కొనసాగించేవారు.

అయితే ఈసారి ముందు జాగ్రత్తగా పోలీస్ శాఖ నాటు పడవలను నడపకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రజలు మరింత ఇబ్బందుల్లో పడ్డారు. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులు కనీసం నాటు పడవ అయినా ఏర్పాటు చేయాలని తమ గోడు వెళ్లబోసుకుంటూ కలెక్టర్​కు లెటర్ రాసినా ఫలితం లేకుండాపోయింది. ఈ గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి వైద్యం అందడంలేదు.

  • కూలిన ఇల్లు

దహెగాం, వెలుగు: మంగళవారం రాత్రి దహెగాం మండల కేంద్రానికి చెందిన దాసరి ఎల్లమ్మ అనే వృద్ధురాలి ఇల్లు కూలిపోయింది. ఎల్లమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా చప్పుడు రావడంతో భయంతో బయటకు వచ్చింది. కొద్దిసేపటికే ఇల్లు కూలిపోయింది. బయటకు రావడంతో ప్రమాదం తప్పిందని, ఒంటరిగా ఉంటున్న తనకు నీడ లేకుంటా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.