Telangana Tour : వెయ్యేళ్ల ఆలయం.. ఎదురెదురుగా శివ కేశవుల విగ్రహాలు ఇక్కడ విశేషం

శివ కేశవుల విగ్రహాలు ఎదురెదురుగా ఉండటం చాలా అరుదు. ఇలాంటి ఆలయం చొప్పదండిలో మాత్రమే ఉంది. చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పురాతన ఆలయం కావడంతో ఈ గుడిని దర్శించేందుకు భక్తులు ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడి శివలింగం ఇసుకతో కనిపిస్తుంది. ఒకప్పటి 'చొప్పద్యాండి" కాలక్రమేణా 'చొప్పదండి"గా మారింది. ఈ శివకేశవాలయం విశాలమైన ప్రాకారాల మధ్య పెద్ద శిలలతో కనిపిస్తుంది.

దక్షిణ దిశలో వీరభద్రస్వామి ఆలయం, యజ్ఞ గుండం, మండపానికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. చొప్పదండి శివకేశవ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యులు క్రీ.శ. 1009వ సంవత్సరంలో నిర్మించినట్లు ఈ ఆలయం వద్ద లభించిన శాసనం ద్వారా తెలుస్తోంది. 

ఇసుక లింగం

కళ్యాణి చాళుక్యుల కాలంలో విరాజిల్లిన ఈ ఆలయానికి ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. పూర్వీకుల కథనం ప్రకారం ఇక్కడ శివలింగం ఇసుకతో చేసిందని, లింగానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస శుద్ధ పంచమి రోజున శంభుస్వామి జాతర జరుగుతుంది. దీపావళి, కార్తీక మాసంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. వంశపారంపర్య అర్చకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు బృందంగా ఏర్పడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. స్థానికులు, విదేశాల్లో స్థిరపడిన వాళ్లు విరాళాలు అందిస్తున్నారు. దాతల సాయంతో భక్తులకు కావాల్సిన సదుపాయాలు సమకూరుతున్నాయి.