టెక్నాలజీ లేని టైంలో ఇన్వెస్టిగేషన్
టైటిల్ : శేఖర్ హోం
డైరెక్షన్ : శ్రీజిత్ ముఖర్జీ
కాస్ట్ : కేకే మెనన్, రణ్వీర్ షోరే, రసిక దుగల్, కీర్తి కుల్హరి, దిబ్యేందు భట్టాచార్య
ప్లాట్ ఫాం : జియో సినిమా
లాంగ్వేజ్ : హిందీ, తెలుగు
1990ల కాలం నాటి కథ ఇది. పశ్చిమ బెంగాల్‌లోని లోన్పూర్ అనే విలేజ్‌లో జరుగుతుంది. శేఖర్ (కే కే మెనన్) అనే డిటెక్టివ్ ఆ ఊళ్లో అద్దె ఇంట్లో ఉంటుంటాడు. ఒకసారి శేఖర్ని వెతుక్కుంటూ జయ్ వ్రత్ (రణ్ వీర్ షోరే) అనే వ్యక్తి వస్తాడు. ఇద్దరూ కలిసి నేరస్తులను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతారు. కట్ చేస్తే.. అక్కడ అధికారంలో ఉన్న కొందరు రాజకీయ నాయకులకు సంబంధించిన సీక్రెట్స్‌ను ఒక వ్యక్తి వీడియోల రూపంలో పంపి, డబ్బులు ఇవ్వమని బెదిరిస్తుంటాడు. అతన్ని పట్టుకునే టైంలోనే శేఖర్‌కి ‘ఇరాబతి’ (రసిక దుగల్) పరిచయం అవుతుంది. ఇద్దరూ కలిసి ఒక జమీందారు ఇంటికి వెళ్తారు. ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్లు హత్యకు గురవుతుంటారు. అదంతా దెయ్యం పనే అనుకుంటుంటారు అంతా. అది దెయ్యమా లేక మనిషా? అనేది డిటెక్టివ్ శేఖర్ తెలుసుకోవడానికి రెడీ అవుతాడు. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? కేసు ఎలా ముగు స్తుంది? అనేది తెరపై చూడాల్సిందే. టెక్నాలజీ లేని టైంలో అలాంటి కేసులను ఎలా సాల్వ్ చేశాడు? అనేది ఆసక్తికరమైన పాయింట్. ఓవరాల్‌గా డిటెక్టివ్ శేఖర్ ఒక్కో కేసును ఎలా ఛేదించాడనేది ఈ స్టోరీ. ఇప్పుడొస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది.
ఎరక్కపోయి వచ్చి..ఇరుక్కుని..
టైటిల్ : గర్ర్...,
డైరెక్షన్ : జె.కె., కాస్ట్ : కుంచకో బోబన్, సూరజ్ వెంజరమూడు, శృతి రామచంద్రన్, అనఘ, రాజేశ్ మాధవన్
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
లాంగ్వేజ్ : మలయాళం, తెలుగు
రెజిమెన్ నాడర్ (కుంచకో బోబన్), రచన (అనఘ) ప్రేమించుకుంటారు. పెండ్లి చేసుకోవాలి అనుకుంటారు. రచన తండ్రి తిరువనంతపురంలో ఒక పొలిటీషియన్. తన స్థాయికి తగిన సంబంధం కాదని వాళ్ల పెండ్లికి ఒప్పుకోడు. ఆ పట్టుదలతోనే రచనను ఒక గదిలో బంధిస్తాడు. సెల్‌ఫోన్ కూడా లేకపోవడంతో ప్రేమికులిద్దరికీ కమ్యూనికేషన్ కట్ అవుతుంది. ఆ బాధలో రెజిమెన్ తాగుడుకి అలవాటు పడతాడు. మరో వైపు జూలో సెక్యూరిటీ ఆఫీసర్ అయిన హరిదాస్ నాయర్ (సూరజ్) కథ మరొకటి. ఇతని భార్య మృదుల నాయర్ (శృతి రామచంద్రన్). జాబ్ చేయాలనేది ఆమె కల. కానీ పెండ్లి కావడంతో అది కలగానే మిగిలిపోతుంది. దీంతో భర్తను వేధిస్తుంటుంది. ఆ టెన్షన్లో ఉన్న అతను పనిలో పొరపాట్లు చేస్తుంటాడు. కట్ చేస్తే.. రెజిమెన్ తన ఫ్రెండ్ అనస్ (రాజేశ్ మాధవన్)తో కలిసి కార్లో వెళ్తుంటారు. బాగా తాగేసి ఉంటారు. దాంతో పోలీసులు పట్టుకుంటారని భయపడి కారును జూ వైపుకి తిప్పుతాడు అనస్. అనుకోకుండా రెజిమెన్ జూలోని సింహం ఎన్ క్లోజర్లోకి వెళ్తాడు. తాగిన మత్తులో ఉన్న రెజిమెన్ను సేఫ్‌గా బయటకు తీసుకురావడానికి హరిదాస్ నానా తిప్పలు పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాలి. కామెడీ కాస్త తక్కువైంది. సింహం కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
బ్రహ్మ రాక్షసుడి పెండ్లి గోల
టైటిల్ : ముంజ్య
డైరెక్షన్ : ఆదిత్య సర్పోత్దర్
కాస్ట్ : అభయ్ వర్మ, శర్వారి, సత్యరాజ్, మోనా సింగ్
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంగ్వేజ్ : తెలుగు
బిట్టు (అభయ్ వర్మ) హెయిర్ డ్రెస్సర్. అతడిని ఒక కల వెంటాడుతుంటుంది. ఆ కలలో ఒక రావి చెట్టు, దానిపై ఒక భయంకరమైన రూపం ఉంటుంది. అది కనిపించగానే బిట్టు భయపడుతుంటాడు. తన సిస్టర్ ఎంగేజ్మెంట్ కోసం వాళ్ల పూర్వీకుల ఇంటికి వెళ్తారు. అక్కడ ఉన్న రావి చెట్టు మీద ముంజ్య అనే బ్రహ్మ రాక్షసుడి వల్ల తన తండ్రి చనిపోయాడని బిట్టుకు తెలుస్తుంది. దాంతో అతను రావి చెట్టు దగ్గరకు వెళ్తుండగా వాళ్ల బామ్మ గీత (సుహాస్ జోషి) అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఆమె చనిపోతుంది. అప్పుడు ఆ రాక్షసుడు చెట్టును వదిలేసి బిట్టును పట్టుకుంటాడు. తనకు, మున్నీతో పెండ్లి చేయమని వెంటపడతాడు. అలా బిట్టుతో కలిసి సిటీకి వచ్చేస్తాడు. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్! అదేంటంటే.. బిట్టు ప్రేయసిని చూసిన రాక్షసుడు ఆమె తనకు కావాలని కోరతాడు. ఆ తర్వాత ఏమవుతుంది? అనేదే మిగతా కథ. అయితే రాక్షసుడు పెండ్లి చేసుకోవాలనుకున్న మున్నీ ఎవరు? వాళ్లెందుకు పెండ్లి చేసుకోలేదు? రాక్షసుడి నుంచి ప్రేయసిని బిట్టు ఎలా కాపాడుకుంటాడు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. భయపెట్టే ఈ మూవీలో కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
బంగ్లాలో ఉన్న దెయ్యం ఎవరు?
టైటిల్ : ఓ ఎం జీ ( ఓ మంచి ఘోస్ట్)
డైరెక్షన్ : శంకర్ కె. మార్తాండ్
కాస్ట్ : వెన్నెల కిషోర్, నందిత శ్వేత, షకలక శంకర్, నాగినీడు
ప్లాట్ ఫాం : ఆహా
లాంగ్వేజ్ : తెలుగు
ఈ కథ1970లో మొదలవుతుంది. ఒక జంట ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పాతబంగ్లాలో ఉంచుతారు. ఆ అమ్మాయి తండ్రిని లక్ష రూపాయలు ఇమ్మని బెదిరిస్తారు. అతను ఆ డబ్బు తీసుకుని వచ్చేలోపు, ఆ బంగ్లాలోని దెయ్యం ఆ ఇద్దరినీ చంపేస్తుంది. కట్ చేస్తే.. కథ 2023లోకి ఓపెన్ అవుతుంది. చైతన్య, పావురం, సీత, లక్ష్మణ్ అనుకోకుండా పోలీస్ స్టేషన్లో పరిచయం అవుతుంది. వాళ్ల సమస్యలు తీరాలంటే డబ్బు సంపాదించాలి అనుకుంటారు. అందుకోసం ఏం చేయాలని ఆలోచిస్తుండగా.. ‘‘నా మేనమామ రాజకీయ నాయకుడు. ఆయన కూతురు కీర్తి (నందిత శ్వేత)ని కిడ్నాప్ చేద్దాం. ఒకవేళ నేరం బయటపడితే నేను చూసుకుంటాన’’ని మిగతా వాళ్లకి మాట ఇస్తాడు చైతన్య. అందుకు మిగతా వాళ్లు ‘ఓకే’ అంటారు. ఒక పథకం ప్రకారం కీర్తిని కిడ్నాప్ చేస్తారు.1970ల నాటి పాత బంగ్లాకు ఆమెను తీసుకొచ్చి అక్కడ బంధిస్తారు. నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే ఆమెను వదిలిపెడతామని సదాశివరావుకు ఫోన్ చేస్తారు. ఇక్కడే ట్విస్ట్ ఒకటి ఉంటుంది. కీర్తిని ఒక దెయ్యం ఆవహించడంతో కొన్ని రోజులుగా సదాశివరావు కుటుంబ సభ్యులు భూత వైద్యుడితో పూజలు చేయిస్తూ ఉంటారు. ఆ రోజున ఆ ప్రేతాత్మను బంధించకపోతే కీర్తికి ప్రమాదం జరుగుతుందని వాళ్లంతా కంగారు పడుతుంటారు. ఆ విషయం కిడ్నాపర్లకు తెలియదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? కీర్తిని ఆవహించిన ప్రేతాత్మ ఎవరు? ఆ బంగ్లాలో ప్రేతాత్మగా తిరుగుతున్నది ఎవరు? అనేదే కథ.
మర్డర్ మిస్టరీ
టైటిల్ : శాకాహారి,
డైరెక్షన్ : సందీప్ సుకంద్,
కాస్ట్ : రంగాయణ రఘు, వినయ్ యూజే, గోపాల కృష్ణ దేశ్‌పాండే, నిధి హెగ్డే, హరిణి సుభద్ర
ప్లాట్ ఫాం : ఆహా
లాంగ్వేజ్ : కన్నడ, తెలుగు
సుబ్బన్న (రంగాయణ రఘు) బ్రహ్మచారి. అడవికి ఆనుకుని ఉన్న తీర్థ కొండ ప్రాంతంలో సుబ్బన్న హోటల్ నడుపుతుంటాడు. అది వెజిటేరియన్ హోటల్. అతనికి ఒక తమ్ముడు ఉంటాడు. అతను అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెళ్తుంటాడు. అయితే ఒకరోజు రాత్రి విజయ్ (వినయ్ యూజే) అనే వ్యక్తి ఆ హోటల్‌కు వస్తాడు. అతను కాలిలో బుల్లెట్ గాయం ఉండడం వల్ల సుబ్బన్న అతనికి ఆశ్రయం కల్పిస్తాడు. విజయ్ తన గతమంతా చెప్తాడు. దాంతో ఒక హత్య కేసులో అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చినట్టు తెలుస్తుంది. అయినా విజయ్ పరిస్థితి చూసి కోలుకున్నాక అక్కడి నుంచి వెళ్లమని చెప్తాడు సుబ్బన్న. అయితే, ఆ మర్నాడే విజయ్ చనిపోతాడు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఎస్.ఐ. మల్లికార్జున (గోపాల కృష్ణ దేశ్‌పాండే), విజయ్ కోసం వెతుకుతుంటాడు. విజయ్ శవం పోలీసుకు దొరుకుతుందా? విజయ్ నిర్దోషా? దోషా అనేది ఎలా తెలుస్తుంది? విజయ్‌కి, సుబ్బన్న తమ్ముడికి లింకేంటి? ఈ క్రమంలో సుబ్బన్న ఏం చేస్తాడు? వంటి అంశాలు తెలియాలంటే సినిమా చూడాలి. ఇందులో సుబ్బన్న పాత్రలో రంగాయణ రఘు ఒదిగిపోయారు. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల ఊహకు అందదు. ఆద్యంతం ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది.
ఆఫీస్‌లో బాస్ హత్య?
టైటిల్ : గోళం
డైరెక్షన్ : సంజద్
కాస్ట్ : రంజిత్ సజీవ్, చిన్ను చాందిని, దిలీష్ పోతన్, కార్తిక్ శంకర్, సన్నీ వేన్, శ్రీకాంత్ మురళి, సిద్దిఖీ
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
లాంగ్వేజ్ : మలయాళం, తెలుగు
పొలిటికల్‌గా పలుకుబడి ఉన్న ఒక ఆఫీస్ బాస్ జాన్ (దిలీష్ పోతన్) అకస్మాత్తుగా చనిపోతాడు. అయితే... అతను చనిపోయింది తన ఆఫీసులోనే కావడంతో సంచలనంగా మారుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏఎస్పీ సందీప్ కృష్ణ (రంజిత్ సజీవ్) టీంతో కలిసి ఆఫీస్‌కు వెళ్తాడు. ఉదయం పూట ఆఫీసులో అందరూ ఉండగానే బాస్ ఆఫీసులో ఎలా చనిపోయాడు? అతన్ని మర్డర్ చేసింది ఎవరు? అనేది గోళం కథ. ఈ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఊహించని ట్విస్ట్‌లతో ఉంటుంది. క్లైమాక్స్ కూడా అంతే. సినిమా మొత్తం ఒకే బిల్డింగ్‌లో తీశారు. అయినా ఎక్కడా బోర్ అనిపించదు.