OTT MOVIES : ఓటీటీలో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్న సినిమాలు.. మీరు కూడా చూసేయండి

స్మగ్లింగ్‌‌‌‌ చేస్తూ చనిపోతే.. 

టైటిల్ : క్రూ
డైరెక్షన్ : రాజేష్ కృష్ణన్ 
కాస్ట్ : కరీనా కపూర్‌‌‌‌‌‌‌‌, టబు, కృతి సనన్‌‌‌‌, శాశ్వత ఛటర్జీ
ప్లాట్​ ఫాం : నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌

ఈ సినిమాలో సీరియస్‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌ని, కామెడీగా చూపించారు. గీతా (టబు), జాస్మిన్ (కరీనా కపూర్ ఖాన్), దివ్య (కృతి సనన్) కోహినూర్ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌ హోస్టెస్‌‌‌‌ల్లా పనిచేస్తుంటారు. ముగ్గురూ మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టి, ఆర్థిక ఇబ్బందులతో బతుకుతున్నవాళ్లే. దానికి తోడు వాళ్లు పనిచేస్తున్న కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడంతో ఆరు నెలల నుంచి యాజమాన్యం జీతాలు ఇవ్వడం మానేస్తుంది.  కంపెనీ యజమాని విజయ్ వాలియా (శాశ్వత ఛటర్జీ) మాత్రం లగ్జరీ లైఫ్‌‌‌‌ గడుపుతుంటాడు. కంపెనీ హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ మాత్రం త్వరలోనే జీతాలు చెల్లిస్తామని చెప్తుంటాడు. అదే టైంలో అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి కోహినూర్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌లోనే బంగారం స్మగ్లింగ్ చేస్తాడు.

గీతా, జాస్మిన్‌‌‌‌, దివ్య ఉన్న విమానం ఎక్కిన ఆ వ్యక్తి ప్రయాణం మధ్యలోనే చనిపోతాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో చొక్కా విప్పి చూస్తే.. వాళ్లకు అతని పొట్ట చుట్టూ అతికించిన గోల్డ్‌‌‌‌ బిస్కెట్లు కనిపిస్తాయి. అప్పటికే ముగ్గురూ కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉంటారు. దాంతో వాళ్లు ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం ఏంటి? దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఇంతకీ ఆ బంగారం ఎవరిది?  తెలియాలంటే సినిమా చూడాలి.

కిడ్నాపర్స్ దొరికారా? 

టైటిల్ : జై గణేశ్​
డైరెక్షన్ : రంజిత్ శంకర్
కాస్ట్ : ఉన్ని ముకుందన్, మహిమ నంబియార్,     జోమోల్, హరీష్ పెరడి
ప్లాట్​ ఫాం : మనోరమా మ్యాక్స్‌‌‌‌

గణేష్ (ఉన్ని ముకుందన్) ఒక బైక్ రైడర్‌‌‌‌‌‌‌‌. కానీ.. బైక్‌‌‌‌ యాక్సిడెంట్‌‌‌‌లో కాళ్ల కదలికను శాశ్వతంగా కోల్పోతాడు. వీల్​చైర్‌‌‌‌‌‌‌‌కే పరిమితం అవుతాడు. అయినా.. జీవితం అక్కడితో ఆగిపోకూడదు అనుకుంటాడు. ఏదో ఒక పని చేయాలి అనుకుంటాడు. అందుకే గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుని, ఒక టీవీ ఛానెల్‌‌‌‌లో పనికి చేరుతాడు. అతను ఎథికల్ హ్యాకింగ్‌‌‌‌ కూడా బాగా చేయగలడు. గణేష్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేసిన కామిక్ సూపర్ హీరో క్యారెక్టర్ “జై గణేష్” పెద్ద హిట్‌‌‌‌ అవుతుంది. ఛానెల్‌‌‌‌లో పనిచేస్తూనే లాయర్ పార్వతి మరార్ (జోమోల్)కి కేసులను పరిష్కరించడంలో రహస్యంగా సాయం చేస్తుంటాడు. కొన్నాళ్లకు ఉద్యోగం మానేసి సొంతంగా కామిక్స్‌‌‌‌ను పబ్లిష్‌‌‌‌ చేసే ప్రయత్నాలు మొదలుపెడతాడు.

ఆ క్రమంలోనే పిల్లలకోపం ఒక అప్లికేషన్​ తయారుచేసిన నిధి(మహిమ)ని కలుస్తాడు. నిధి తన యాప్ ద్వారా జై గణేష్ కామిక్స్‌‌‌‌ను పబ్లిష్‌‌‌‌ చేస్తుంటుంది.  గణేష్ చూస్తుండగానే ఎమ్మెల్యే కొడుకు అయాన్‌‌‌‌ కిడ్నాప్ అవుతాడు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిందితుడిని పట్టుకోలేకపోతారు. దాంతో గణేష్ తనకు తెలిసిన టెక్నాలజీ ద్వారా అయాన్‌‌‌‌ను కాపాడడంలో పోలీసులకు సాయం చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పోలీసులు అయాన్‌‌‌‌ను కాపాడారా? లేదా? అందుకోసం గణేష్ ఏం చేశాడు? అనేది సినిమా.

సమర యోధుడి చరిత్ర

టైటిల్ : స్వతంత్ర వీరసావర్కర్‌‌‌‌‌‌‌‌
డైరెక్షన్ : రణ్​దీప్ హుడా
కాస్ట్ : రణ్​దీప్ హుడా, అమిత్‌‌‌‌ సియాల్‌‌‌‌, అంకిత లోఖండె, ఆర్‌‌‌‌‌‌‌‌. భక్తి క్లైన్‌‌‌‌,  రాజేష్‌‌‌‌ ఖేరా
ఫ్లాట్‌‌‌‌ఫాం : జీ5

వి.డి. సావర్కర్ జీవితం ఆధారంగా తీసిన బయోపిక్‌‌‌‌ ఇది. ఈ సినిమాని డైరెక్ట్‌‌‌‌ చేసిన రణ్​దీప్ హుడానే సావర్కర్‌‌‌‌‌‌‌‌గా నటించాడు. ఇందులో సావర్కర్‌‌‌‌‌‌‌‌ జీవితంలోని ప్రతి కోణాన్ని చూపించారు. సావర్కర్ యువకుడిగా ఉన్నప్పుడు అతని తండ్రి చనిపోతాడు. అప్పుడే అతను పెద్దయ్యాక స్వాతంత్ర్య సమరయోధుడు కావాలని నిర్ణయించుకుంటాడు. తన పోరాటాన్ని మరింత బలంగా చేసేందుకు లండన్ వెళ్లి బ్రిటిష్ చట్టాల గురించి చదువుకోవాలి అనుకుంటాడు. ఆ ప్రయాణంలో భాగంగానే పునేలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరతాడు. అతను క్యాంపస్‌‌‌‌లోకి వెళ్లే ముందే ‘అభినవ్ భారత్ సొసైటీ’ని స్థాపిస్తాడు. అతని ఫ్రెండ్స్‌‌‌‌, తోటి స్వాతంత్ర్య సమరయోధులు అభినవ్ భారత్ సొసైటీ ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేస్తుంటారు.

మరోవైపు సావర్కర్ కాలేజీలో తోటి స్టూడెంట్స్‌‌‌‌ని స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా చేస్తుంటాడు. అతను పునేలో ఉన్నప్పుడే రాడికల్ నేషనలిస్ట్ నాయకుడు లోకమాన్య తిలక్‌‌‌‌ని కలుస్తాడు. లండన్‌‌‌‌లో చదువుకోవాలనే సావర్కర్‌‌‌‌‌‌‌‌ కలను నెరవేరడానికి ఆయనే సాయం చేస్తాడు. ఆ తర్వాత సావర్కర్‌‌‌‌‌‌‌‌ పోరాటం ఎలాంటి ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాలి.

విలేజ్‌ పాలిటిక్స్‌

టైటిల్ : పంచాయత్ సీజన్–3 
డైరెక్షన్ :  దీపక్ కుమార్ మిశ్రా
కాస్ట్ : జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్, దుర్గేశ్ కుమార్, పంకజ్ జా, సునీత రాజ్వర్
ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో

పంచాయత్ వెబ్ సిరీస్ రెండు సీజన్లు సక్సెస్ కావడంతో మూడో సీజన్‌‌ని తీసుకొచ్చారు మేకర్స్‌‌. దీనికోసం చాలామంది రెండేండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫులేరా గ్రామ పంచాయతీలో జరిగే కొన్ని సంఘటనలతో ఈ సిరీస్‌‌ తెరకెక్కించారు. ఇక కథలోకి వెళ్తే.. ప్రహ్లాద్ (ఫైజల్ మాలిక్) కొడుకు చనిపోవడంతో పంచాయతీ సెక్రటరీ అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్)ని ఫులేరా నుంచి బదిలీ చేస్తారు. ఈ సీన్‌‌తో రెండో సీజన్‌‌ ముగిసింది. ఫులేరాకు కొత్త సెక్రటరీగా మరో వ్యక్తి రాకతో మూడో సీజన్ మొదలవుతుంది. అయితే.. సర్పంచ్ మంజు దేవి (నీనా గుప్త), ఆమె భర్త బ్రిజ్ భూషణ్ దూబే (రఘువీర్ యాదవ్), ప్రహ్లాద్ సహా కొంతమంది గ్రామస్తులు కలిసి కొత్త సెక్రటరీ రాకుండా అడ్డుకుంటారు. ఫులేరాకు మళ్లీ అభిషేక్ త్రిపాఠిని సెక్రటరీగా తెచ్చుకుంటారు. దీంతో ఎమ్మెల్యే చంద్రకిశోర్ సింగ్ (ప్రకాశ్ జా)తో దూబేతోసాటు ఫులేరా గ్రామస్తులకు విభేదాలు పెరుగుతాయి.

అదే టైంలో కుక్కను చంపిన కేసులో ఎమ్మెల్యే జైలుకు వెళ్తాడు. అభిషేక్ ఫులేరాలో తిరిగి డ్యూటీలో చేరగానే రింకీ (సాన్వికా)తో మళ్లీ లవ్‌‌ మొదలవుతుంది. అంతా బాగానే ఉందనుకునే టైంలో అభిషేక్ ఒక వృద్ధురాలికి ‘ప్రధాన మంత్రి గరీబ్ ఆవాస్ యోజన’ కింద ఇల్లు మంజూరు చేస్తాడు. దాంతో ఫులేరాలో పాలిటిక్స్‌‌ మొదలవుతాయి. అదే టైంలో సర్పంచ్‌‌ ఎన్నికలు కూడా దగ్గరపడడంతో ఊళ్లో రెండు గ్రూపులు తయారవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రాజకీయాలు దేనికి దారి తీశాయి? అనే విషయాలె చెప్పేదే ఈ సీజన్. 

కల సాకారం చేసుకునేందుకు.. 

టైటిల్ : జమ్నాపార్‌‌‌‌ 
డైరెక్షన్ : ప్రశాంత్ భాగియా
కాస్ట్ : రిత్విక్‌‌ సాహోర్‌‌‌‌, శ్రిష్టి గంగూలి రిండాని, రఘురామ్‌‌, వరుణ్‌‌ బడోల
ప్లాట్​ ఫాం : అమెజాన్‌‌ మినీటివి

శాంకీ బన్సాల్ (రిత్విక్ సాహోర్) ఒక సీఏ స్టూడెంట్‌‌. ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌‌లో పుట్టి పెరిగాడు. అతని తండ్రి కేడీ బన్సాల్ (వరుణ్ బడోలా) సీఏ కోచింగ్‌‌ క్లాస్‌‌లు చెప్తుంటాడు. శాంకీ ఆ క్లాస్‌‌లో స్టూడెంట్స్‌‌కి హెల్ప్‌‌ చేస్తుంటాడు. అంతేకాదు.. ఒక చిన్న సంస్థలో తన ఆర్టికల్‌‌షిప్‌‌ను కూడా పూర్తి చేస్తాడు. అయితే.. శాంకీకి తన తండ్రి కేడీ బన్సాల్‌‌తో ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. తన తండ్రి ప్రత్యర్థి ప్రవీణ్ రానా (బబ్లా కొచర్) కూడా ఒక కోచింగ్‌‌ సెంటర్ నడుపుతుంటాడు.

కానీ.. శాంకీకి ఏ ఇబ్బంది వచ్చినా రానా హెల్ప్ చేసేవాడు. అదే టైంలో శాంకీ తన సీఏని డిస్టింక్షన్‌‌తో పూర్తి చేసి, దక్షిణ ఢిల్లీలో ఉన్న సాకేత్‌‌లోని ఒక సంస్థలో చేరాలి అనుకుంటాడు. ఆ నిర్ణయంతో తండ్రితో గొడవలు మరింత పెరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? శాంకీ కల నెరవేరిందా? అనేది ఈ వెబ్‌‌సిరీస్‌‌ చూస్తే తెలుస్తుంది.

సుబ్బన్న ఎవరు? 

టైటిల్ : శాఖాహారి 
డైరెక్షన్ : సందీప్ సుంక‌‌డ్
కాస్ట్ : రంగాయ‌‌ణ ర‌‌ఘు, గోపాల‌‌కృష్ణ దేశ్ పాండే, విన‌‌య్ యు.జె., నిధి హెగ్డే
ప్లాట్​ ఫాం :  అమెజాన్ ప్రైమ్‌‌ వీడియో

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌‌బస్టర్ హిట్‌‌ కొట్టిన సినిమా శాఖాహారి. కోటి రూపాయ‌‌ల కంటే తక్కువ బ‌‌డ్జెట్‌‌తో తెర‌‌కెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అదే సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. కథలోకి వెళ్తే.. సుబ్బన్న (రంగాయ‌‌ణ ర‌‌ఘు) ఒక చిన్న టౌన్‌‌లో వెజిటేరియన్‌‌ హోట‌‌ల్ న‌‌డుపుతుంటాడు. మ‌‌ధ్య వ‌‌య‌‌స్కుడైన సుబ్బన్న పెళ్లి చేసుకోకుండా, ఎలాంటి బంధాలు లేకుండా బతికేయాలి అనుకుంటాడు. సుబ్బన్న హోటల్‌‌ నడుపుతున్న పక్క టౌన్‌‌లో మల్లికార్జున్‌‌(గోపాల‌‌కృష్ణ దేశ్‌‌పాండే) ఎస్సైగా పనిచేస్తుంటాడు.

అతను కొన్ని కారణాల వల్ల అక్కడినుంచి ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ కోసం అప్లికేషన్ పెట్టుకుంటాడు. కానీ.. అదే టైంలో హత్య కేసులో నిందితుడిగా గుర్తించి అరెస్ట్‌‌ అయిన విజయ్‌‌ (విన‌‌య్ యు.జె.) పోలీస్‌‌స్టేషన్‌‌ నుంచి తప్పించుకుంటాడు. అక్కడి నుంచి విజయ్‌‌ నేరుగా సుబ్బన్న దగ్గరికెళ్లి, అతని హోటల్‌‌లో తల దాచుకుంటాడు. విజయ్‌‌ని వెతుక్కుంటూ మల్లికార్జున్‌‌ సుబ్బన్న హోటల్‌‌కు వస్తాడు. అక్కడ సుబ్బన్న గురించి కొన్ని షాకింగ్ విష‌‌యాలు తెలుస్తాయి. అవేంటి? ఫ్లాష్‌‌బ్యాక్‌‌లో సుబ్బన్న ఏం చేసేవాడు? అనేదే మిగతా సినిమా.