Cockroach Milk: బొద్దింక పాలు తాగితే ఇలా అవుతుందని తెలిస్తే ఎవరూ తాగకుండా ఉండరేమో..!

గత కొన్నేళ్లుగా ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి. సూపర్ ఫుడ్స్ అనే పదం ఈ మధ్య జోరుగా వినిపిస్తోంది. వాస్తవం చెప్పాలంటే అసలు సూపర్ ఫుడ్స్ అనేవే లేవనేది డాక్టర్లు చెబుతున్న మాట. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా న్యూటిషన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవేనంటూ కంపెనీలు ఊదరగొడుతుంటాయే తప్ప నిజానికి అలాంటివేమీ ఉండవని చెబుతున్నారు. ఈ మధ్య ఇలానే బాగా ప్రచారం జరుగుతున్న ఒక సూపర్ ఫుడ్స్లో ఒకటి బొద్దింక పాలు. బొద్దింక పాలల్లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. అసలు ఈ బొద్దింక పాలల్లో నిజంగానే పోషక విలువలు ఉన్నాయా లేక ఇదంతా ఫేక్ ప్రచారమేనా.. నిజానిజాలేంటో తెలుసుకుందాం..

బొద్దింక పాలలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని, డిప్లోప్టెరా పంక్టాటా (Diploptera punctata) అనే బొద్దింక రకం పాలు మనుషులకు మేలు చేస్తాయని వెల్లడైంది. అయితే ఈ బొద్దింక రకం అరుదుగా ఉంటుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు ఈ బొద్దింక పాలలో ఎక్కువగా ఉంటాయని తేలింది. మానవ శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల  ఎమినో యాసిడ్స్ ఈ బొద్దింక పాలలో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మాంసకృత్తుల్లో మాత్రమే ఈ తొమ్మిది రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అవి కాకుండా బొద్దింక పాలల్లో మాత్రమే ఇవి మొత్తం ఉన్నాయని తెలిసింది. అందువల్ల.. డిప్లోప్టెరా పంక్టాటా బొద్దింక పాలను ప్రొటీన్లు ఇచ్చే నాన్-డైరీ మిల్క్గా పరిగణించడం జరిగింది. అయితే.. పాల కోసం బొద్దింకలను చంపుకుంటూ పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. 1,000 బొద్దింకల నుంచి 100 గ్రాముల పాలను మాత్రమే సేకరించగలమని ఈ బొద్దింక పాలపై పరిశోధన చేసిన నిపుణులు తెలిపారు. ఆవు పాల కంటే బొద్దింక పాలలో మూడు రెట్లు పోషక విలువలు ఉన్నాయని ల్యాబ్ రీసెర్చ్లో వెల్లడైంది.

1977లో చేసిన ల్యాబ్ అనాలసిస్ ప్రకారం.. బొద్దింక పాలలో ఏఏ పోషకాలు ఎంత శాతం ఉన్నాయంటే.. ప్రోటీన్లు 45 శాతం, కార్బోహైడ్రేట్లు 25 శాతం, కొవ్వు (లిపిడ్స్) 16 నుంచి 22 శాతం, 5 శాతం అమినో యాసిడ్స్. లాక్టోస్ సమస్యతో ఇబ్బందిపడుతున్న వారికి, మిల్క్ అలర్జీస్తో బాధపడేవారికి బొద్దింక పాలు ప్రత్యామ్నయం అని నిపుణులు చెబుతున్నారు. బొద్దింక పాలు లాక్టోస్-ఫ్రీ అవడమే ఇందుకు కారణం. 250 ఎంఎల్ బొద్దింక పాలతో 700 క్యాలరీలు పొందొచ్చు. ఒక కప్పు ఆవు పాల కంటే ఇది మూడు రెట్లు అధికం. ఏతావాతా చెప్పొచ్చేది ఏంటంటే.. బొద్దింక పాలను ఎక్కువ తాగితే బరువు పెరిగే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలు, గర్భిణి మహిళలకు ఈ బొద్దింక పాలు మంచిది కాదు. ప్రస్తుతం బొద్దింక పాలు అంతలా అందుబాటులో లేవు. ఇప్పటికైతే బొద్దింక పాలపై హైప్ మాత్రమే ఉంది తప్ప కచ్చితమైన పరిశోధనలు జరగలేదు. ప్రజలు కూడా బొద్దింక పాలను తాగేందుకు అంత ఆసక్తి చూపే అవకాశం లేదు.