ఆగమైంది చాలు..ఆలోచిద్దాం!

 తెలంగాణ స్వరాష్ట్ర  తొలి, మలి దశ ఉద్యమాల్లో నిరుద్యోగులు, విద్యార్థులు ముందుండి పోరాడినది, ప్రాణ త్యాగాలు చేసినది చరిత్రకు తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం వచ్చి కూడా పదేండ్లు దాటింది. తొలి రెండుసార్లు బీఆర్ఎస్​కు ప్రజలు అధికారం ఇచ్చారు. ఏడునెలల కిందట అదే ప్రజలు మార్పు కోరారు.  కాంగ్రెస్​కు అధికార పగ్గాలు అందించారు. కొంతకాలంగా రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగే ఆందోళనలను చూస్తుంటే.. అధికారం కోల్పోగానే మళ్లీ ఉద్యమకాలం నాటి కొలువుల సెంటిమెంట్ ను  ప్రస్తుత ప్రతిపక్షం అందుకుంది! 

 గత పదేండ్ల పాలనలో నిరుద్యోగులు, విద్యార్థులకు చేసిన అన్యాయంపై, ఉద్యోగాల భర్తీలో చేసిన ఆలస్యం, నిర్లక్ష్యంపై చర్చించుకుంటే.. ‘‘ కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది’’.. అనే సామెతనే అవుతుంది. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్​లోని నియామకాల భర్తీపై పదేండ్ల పాలకులు ఎంతగా నిర్లక్ష్యం చేశారో జగమెరిగిన సత్యమే! ప్రస్తుత ప్రతిపక్ష తీరు చూస్తుంటే..  నరసింహ సినిమాలో  హీరోయిన్ నీలాంబరి పాత్ర “ నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దు. దక్కితే సహించను. విడగొట్టి తీరతా’’ అనే డైలాగ్ గుర్తుకువస్తుంది.

కొలువుల జాతర,  తీపి కబురు అంటూ..

 తెలంగాణలో 1 లక్ష 91వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినది తెలిసిందే. అయినా.. సక్రమంగా, త్వరగా భర్తీ చేయలేకపోయారు పదేండ్ల పాలకులు.  త్వరలో కొలువుల జాతర. కొద్దిరోజుల్లో నిరుద్యోగులకు తీపి కబురు..  అంటూ లెక్కకు మిక్కిలిసార్లు ఊరించారు. ఏండ్లకేండ్లు నోటిఫికేషన్లను సాగదీశారు. పేపర్​ లీక్ లు, పరీక్షల వాయిదాలతో చివరకు నిరుద్యోగులను ఆత్మహత్యలకు కూడా పురికొల్పాయి. 

 రెండేండ్ల కిందట కూడా.. సత్వరమే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2022 మార్చిలో అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రి  చెప్పారు.  ఆనాడు రాష్ట్రంలో 80,039 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. అయినా.. తమ హయాంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు?  పదేండ్లు  తీవ్ర నిర్లక్షం చేసి .. ఇప్పుడు నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్న ప్రస్తుత ప్రభుత్వంపై ఎగదోయడం, పరీక్షలు వాయిదాలు వేయాలంటూ ఆందోళనలకు పిలుపునివ్వడం విడ్డూరం!   

పేపర్ లీక్​లు..ఆత్మహత్యలేగా..

పదేండ్ల స్వ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు కలల కొలువులు సాధించేందుకు  ప్రైవేటు జాబ్​లు వదిలేసి.. ఆర్థికంగా కష్టనష్టాలు పడుతూ.. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటూ ప్రిపేర్ అయ్యారు. ఏండ్లకేండ్లు నోటిఫికేషన్లు 
సాగదీస్తుంటే నిస్సహాయతతో ఎదురుచూశారు. విలువైన సమయం కోల్పోయారు. అన్నీ భరిస్తూ  ప్రిపే రైనా చివరకు దక్కిందేంటి..? పేపర్ లీక్ లేగా..? అవహేళనలేగా? ఆత్మహత్యలేగా..?  ఏనాడైనా చేసిన తప్పులపై ఒప్పుకున్నారా?  పైగా ప్రశ్నించిన నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులను అణచివేయలేదా.?  

వాయిదా ఎవరికి ఫాయిదా..

డీఎస్సీ వాయిదా వేయాలని, గ్రూప్ -1 మెయిన్స్​కు  1:100 మందిని సెలెక్ట్  చేయాలని, గ్రూప్ 2, 3ల్లో పోస్టులు పెంచాలని, వాయిదా వేయాలనే డిమాండ్ల ఆందోళనల వెనకాల ఉన్నదెవరు? వాయిదా వేస్తే ఎవరికి ఫాయిదా ? చివరకు నష్టపోయేదెవరు? ఇక కొలువుల కోసం కొట్లాడడంలో తప్పులేదు. అందుకు నోటిఫికేషన్లు అసలే ఇవ్వనప్పుడు, పరీక్షలు సరిగా పెట్టనప్పుడు  చేస్తే బాగుంటుంది.   పిల్ల పుట్టాలన్నా.. తొమ్మిది నెలల దాకా ఎదురు చూడాలి కానీ.. ఏడు నెల ల కింద  వచ్చిన పాలకులపై ఎగదోసే రాజకీయ కుట్రల్లో  కొందరు నిరుద్యోగులు, విద్యార్థులను పావులుగా వాడుకుంటుండడం విషాదం. 

పరీక్షలను సవ్యంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం 

 కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే అప్పటిదాకా ఆగమాగంగా ఉన్న టీజీపీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేసింది. బోర్డుకు కొత్త కమిటీని నియమించింది. పాత, కొత్త నోటిఫికేషన్ల భర్తీకి వేగంగా చర్యలు తీసుకుంటుంది. రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్ 1 ప్రిలిమ్స్​ను సక్రమంగా పూర్తి చేసింది. ఫలితాలు కూడా ప్రకటించింది. ఇప్పటికే ఒకసారి వాయిదాపడిన డీఎస్సీ పరీక్షలు మొదలైనాయి. 

రెండుసార్లు టెట్ నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి 5 వేలకు పైగా ఖాళీలతో డీఎస్సీ వేస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. గత పదేండ్ల పాలకులు మర్చిపోయిన జాబ్ క్యాలెండర్ ను రూపొందించి అమలులోకి తెచ్చేందుకు, దానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించేందుకు కూడా కసరత్తు చేస్తోంది. ఇలా పదేండ్లలో నిరుద్యోగులను నిర్లక్ష్యానికి గురి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం  ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకుపోతోంది. 

ఇది యువతకు తెలియనిదికాదు.  ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహిస్తోంది.  నిరుద్యోగులు కోరుకున్నట్లే గ్రూప్​–2 డిసెంబర్​కు వాయిదా పడింది. గ్రూప్​–1 యథాతథంగా జరుగనుంది. అంతా సవ్యంగా కొనసాగిస్తుంటే .. కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం  నిరుద్యోగులు, విద్యార్థులు నష్టపోకూడదు. పదేండ్లలో ఆగమైనది చాలు.. ఇప్పటికైనా ఆలోచిద్దాం!

నోటిఫికేషన్లు ఎన్ని..జాబ్ క్యాలెండరెక్కడ?

పదేండ్లలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని.? కోర్టు ల మెట్లు ఎక్కినవెన్ని..?  ఏండ్లకు ఏండ్లు సాగదీసినవెన్నో..  నిరుద్యోగులు, విద్యార్థు లకు తెలియనిది కాదు. ఎన్నికలప్పుడే హడావుడిగా నోటిఫికేషన్లు వేస్తే  ఏండ్లకేండ్లు ఎదురుచూడలేదా? ఆ తప్పెవరిది?   కొత్త జిల్లాలు, జోన్ల పేరిట ఏండ్ల పాటు సాగదీశా రు. 2016లో ఒక్క గ్రూప్ 2 వచ్చింది. 2017 లో ఒక్క డీఎస్సీ మాత్రమే ఇచ్చారు.  

ఇక ఏడాది కి రెండుసార్లు వేయాల్సిన  టెట్​ను పదేండ్లలో నాలుగు సార్లే  నిర్వహించారు.  ఉద్యమ కాలంనాటి జాబ్ క్యాలెండర్ హామీని ఎందు కు నెరవేర్చ లేదు?  ఒక్క గ్రూప్1 ప్రిలిమ్స్ నిర్వ హిస్తే.. తొలిసారి పేపర్ లీక్.. రెండోసారి కూడా ఆగమాగంగా పెట్టడంతో  కోర్టు మెట్లె క్కింది. చివరకు రద్దు అయింది.  ఇలాంటి  ఫెయి ల్యూర్స్ చూసైనా నిరుద్యోగులు, విద్యా ర్థులు ఆలోచించాలి. ఇప్పటిదాకా ఏం కోల్పోయామో గుర్తుకు తెచ్చుకోవాలి. అలాంటి ఆలోచన   చే యకుండా రాజకీయ కుట్రల వలలో చిక్కితే.. భవిష్యత్ ఆగం చేసుకోవడం ఖాయం!

- వేల్పుల సురేశ్, సీనియర్ జర్నలిస్టు