బిచ్కుందలో ఏటీఎం ఎత్తుకెళ్లిన దొంగలు

పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఏటీఎం మెషీన్​ను దొంగలు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి బిచ్కుంద మెయిన్​ రోడ్​లో ఉన్న ఏటీఎంను ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో అలారం మోగడంతో బ్యాంక్​ మేనేజర్​ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఏటీఎం మెషీన్​తో పరారయ్యారు.  బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నరేశ్, ఎస్ఐ మోహన్​రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

నలుగురు నిందితులు ఏటీఎం చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఏటీఎంలో రూ.3 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం. జుక్కల్​ మండలం మహారాష్ట్ర సరిహద్దులోని గుల్లా గ్రామం వద్ద ఓ వెహికల్ ను పోలీసులు గుర్తించారు. దొంగలు అక్కడ వాహనాన్ని మార్చి వేరే వెహికల్​లో పరారైనట్లు అనుమానిస్తున్నారు.