మంచి జరుగుతదని..గణపతి లడ్డూల చోరీ  

  • వినాయక మండపాల్లోంచి ఎత్తుకుపోయి తింటున్న భక్తులు
  • ఇప్పటికే సిటీలో మూడు చోట్ల లడ్డూలు మాయం 
  • గతంలోనూ ఈ తరహా ఘటనలు  
  • కేసులు నమోదు చేయని పోలీసులు 
  • అరిష్టమంటున్న పండితులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : గణనాథుల నిర్వాహకులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత గణేశుడి చేతిలో పెట్టే లడ్డూను కాపాడుకోవడం వారికి పెద్ద టాస్క్​లా మారింది. చవితి ప్రారంభమై మూడు రోజుల్లోనే నగరంలోని మండపాల్లో లడ్డూలు మాయమవుతుండడమే దీనికి కారణం. ఆదివారం నిజాంపేట్​లో రెండు చోట్ల, సోమవారం కీసర పరిధిలో మరోచోట వినాయకుడి లడ్డూలను ఎత్తుకువెళ్లారు. ఇది ఎవరైనా ప్రొఫెషనల్​దొంగల పనా అంటే అదీ కాదు..కేవలం లడ్డూ దొంగతనం చేసి తింటే మంచి జరుగుతుందన్న మూఢ నమ్మకమే జనాలను ఈ చర్యలకు ప్రోత్సహిస్తున్నది. 

ఆయురారోగ్యాలు...సిరిసంపదలంటూ..

గణపతితో పాటు నవరాత్రులు పూజలుందుకునే లడ్డూను చివరి రోజు వేలం వేస్తారు. కొందరు ఈ లడ్డూ కోసం రూ. లక్షలు కూడా పెట్టడానికి వెనుకాడరు. పోటీ పడి మరీ దక్కించుకుంటారు. అలాంటి వారిని అదృష్టవంతులుగా భావిస్తారు. అయితే, అలాంటి అదృష్టాన్ని తాము వేలంలో పాల్గొనకుండా పొందాలనే ఆలోచనో లేక గణేశుడి చేతిలో లడ్డూ చోరీ చేసి తింటే సిరి సంపదలు కలుగుతాయని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనే మూఢ నమ్మకంతోనో ఈ చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో గణనాథుడి చేతిలో పెట్టిన రెండు, మూడు రోజుల్లోనే చాలా మండపాల్లో లడ్డూలు మాయమవుతున్నాయి. ముందే స్కెచ్​వేసుకుంటున్న కొంతమంది భక్తులు అర్ధరాత్రి వేళల్లో అందరూ పడుకున్నాక లడ్డూలను లేపేస్తున్నారు. ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా తీసుకుంటూ సంతృప్తి చెందుతున్నారు.  

కేసులు పెట్టని పోలీసులు.. 

కొన్నేండ్లుగా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా లడ్డూల దొంగతనం కొనసాగుతోంది. కొన్ని చోట్ల లడ్డూలు పోతే కొందరు నిర్వాహకులు విషయాన్ని పెద్దది చేయకుండా మరో లడ్డూ పెట్టి కాపలా కాస్తుంటే ..కొంతమంది మాత్రం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా గతేడాది మూడు కమిషనరేట్ల పరిధిలో 8 లడ్డూలను ఎత్తుకెళ్లినట్టు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని మండపాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోనే లడ్డూ దొంగలు ఎవరో తెలుసుకున్నారు. కానీ, కేసులు నమోదు చేయలేదు. కేవలం హుండీ, ఇతర వస్తువులు పోతేనే కేసు ఫైల్​ చేస్తున్నారు. మంచి జరుగుతుందనే ఈ చోరీలు చేస్తున్నారని, వేరే ఉద్దేశం లేదని తెలుసుకుని వదిలేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న చాలామంది దొంగతనాలు చేస్తున్నారు.  

Also Read :- జర్నలిస్ట్ సంక్షేమానికి మంచి రోజులు.!

రాత్రీపగలు..కాపలా..

సిటీతో పాటు శివార్లలో లడ్డూల దొంగతనాలు జరుగుతున్నాయని తెలుసుకుంటున్న నిర్వాహకులు మండపాల్లో నిద్ర కూడా పోవడం లేదు. రాత్రంతా వంతులు వేసుకుని మరీ మేలుకుని లడ్డూ కాపాడుకుంటున్నారు. కొన్ని చోట్ల లడ్డూల కోసం వచ్చి దొరికిన వారు తన్నులు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొందరు దొంగతనం చేస్తూ దొరికితే లడ్డూకు డబుల్​ రేట్​ ఇచ్చి బయటపడుతున్నారు.  

 కీసరలో లడ్డూను ఎత్తుకెళ్లి తినేశారు!

మేడ్చల్: కీసరలోని సిద్ధార్థ కాలనీ గణేశ్​మండపంలో దొంగలు పడ్డారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మండపంలో ఎవరూ లేనిది గమనించిన ఐదుగురు లోపలకు చొరబడ్డారు. విగ్రహం చేతిలోని లడ్డూను ఎత్తుకెళ్లి తినేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సోమవారం ఉదయం మండప నిర్వాహకులు కీసర పీఎస్​లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు  నిందితులను మైనర్లుగా గుర్తించారు.  దీంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

లడ్డూ చోరీ చేస్తే అనర్థాలే 

దొంగింలించిన లడ్డు తింటే అదృష్టం అనే భ్రమలో కొంతమంది భక్తులున్నారు. అలాంటి వాళ్లే మండపాల్లోని లడ్డూలను చోరీ చేస్తున్నారు.  దీని వల్ల వారికి అనర్థాలు కలుగుతాయి తప్ప మంచి జరగదు. భక్తి నిష్టలతో ఆ గణేశుడితో పాటు నవరాత్రులు లడ్డూను పూజించి భుజిస్తేనే మేలు జరుగుతుంది. దేవుడికి ప్రీతిపాత్రమైన లడ్డూను ఎత్తుకువెళ్తే అరిష్టం. 

– సంతోశ్, పూజారి, బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌