- సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసుల నిర్వాకం
- మంగళవారం మట్టపల్లి చెక్పోస్ట్ వద్ద ఎద్దుల లారీ పట్టివేత
- సెటిల్మెంట్ కోసం కాలయాపన
- ఆలస్యం కావడంతో 15 ఎడ్లు మృతి
- ఎస్ఐపై విచారణ కు ఆదేశించిన ఎస్పీ రాహుల్ హెగ్డే
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో పోలీసులు పైసల కోసం 15 పశువుల ప్రాణాలు తీశారు. మంగళవారం ఉదయం పట్టుకున్న ఓ పశువుల కంటైనర్ను డబ్బులిచ్చేంత వరకు కదలనివ్వకపోవడంతో అందులోని మూగజీవాలు తిండీ తిప్పలు, గాలి వెలుతురు లేక కన్నుమూశాయి. ఘటన గురించి తెలుసుకున్న ఎస్పీ రాహుల్హెగ్డే ఎస్ఐపై విచారణకు ఆదేశించారు. తమిళనాడుకు చెందిన నటరాజ్, స్వామి సూర్యాపేటలో 26 ఎడ్లను కొని వాటిని ఓ కంటైనర్ లారీలో కుక్కి ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరికి తరలిస్తున్నారు.
మంగళవారం ఉదయం మట్టపల్లి వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో కంటైనర్ లో ఉన్న ఎడ్లను గుర్తించారు. మఠంపల్లి పోలీసులకు సమాచారమివ్వగా ఎస్సై రామాంజనేయులు వచ్చి కంటైనర్ను పీఎస్కు తరలించారు. కంటైనర్ను వదిలివేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందిగా ఎస్ఐ డిమాండ్చేసినట్టు తెలిసింది. అయితే.. ఎంత ఇవ్వాలన్నది చెప్పడంలో ఆలస్యం చేయడంతో సాయంత్రం వరకూ ఎడ్లు లారీలోనే ఉన్నాయి.
గాలి ఆడకపోవడం, సరిపడా వెలుతురు లేకపోవడం, పశువులకు గ్రాసం,నీరు ఇవ్వకపోవడంతో15 ఎడ్లు అందులోనే చనిపోయాయి. ముందు 13 ఎడ్లే చనిపోయినా, పోస్ట్మార్టం చేసేందుకు వెటర్నరీ డాక్టర్లు లేకపోవడంతో కిందకు దింపలేదు. దీంతో బుధవారం ఉదయం వరకు మరో రెండు పశువులు కన్నుమూశాయి. ఈ సమాచారం ఎస్పీకి రాహుల్హెగ్డేకి చేరడంతో పశువులను తరలించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
తర్వాత వారిని అరెస్ట్ చేశారు. ఎడ్లను మట్టపల్లి గోశాలకు తరలించారు. ఎస్ఐ రామాంజనేయులుపై విచారణకు ఆదేశించారు. విషయం బయటకు పొక్కడంతో నల్గొండ గోశాలకు ఆవులను తరలించే క్రమంలో చనిపోయాయని పోలీసులు కట్టుకథలు ప్రచారం చేశారు. చివరకు నలుగురు వెటర్నటీ ఆఫీసర్ల టీం మృతి చెందిన ఎడ్లకు మట్టపల్లి కృష్ణా నది సమీపంలో పోస్ట్ మార్టం నిర్వహించాయి.