అప్లై చేస్తున్నరు.. ఎగ్జామ్ రాస్తలేరు!

  • మెజార్టీ పోటీ పరీక్షల్లో అభ్యర్థులది ఇదే వైఖరి 
  • గ్రూప్ 3 ఎగ్జామ్​కు సగం మంది అటెండ్ కాలె 
  • గ్రూప్1 మెయిన్స్ కు 67శాతమే హాజరు 
  • సీరియస్​గా ప్రిపేర్ కాకపోవడం.. సెంటర్లు దూరం పడటమే ప్రధాన కారణం! 

హైదరాబాద్, వెలుగు: సర్కారు కొలువులపై అభ్యర్థుల్లో ఆసక్తి తగ్గుతోంది. పోటీ పరీక్షల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నా.. పరీక్షలు మాత్రం తక్కువ మందే రాస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్ 3 పరీక్షకైతే ఏకంగా సగం మంది హాజరుకాలేదు. గతంలో జరిగిన గ్రూప్1 మెయిన్స్​ కూ మూడోవంతు డుమ్మా కొట్టారు. పరీక్షలకు గైర్హాజర్ కావడానికి ఒక్కో పరీక్షకు ఒక్కో రకమైక కారణం ఉన్నట్టు అభ్యర్థులు చెప్తున్నారు. అయితే, సీరియస్​గా ప్రిపేర్​ కాకపోవడంతో పాటు పరీక్షా కేంద్రాలూ దూరంగా పడటమే ప్రధాన కారణంగా అకాడమిక్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. 

గ్రూప్1మెయిన్స్ కు 21,093 మందే అటెండ్

రాష్ట్రంలోని 563 పోస్టుల భర్తీకి జూన్ లో గ్రూప్1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..3.02 లక్షల మంది (74 శాతం) మాత్రమే హాజరయ్యారు. అప్పటికే వివిధ కారణాలతో రెండు సార్లు రాసిన తర్వాత పరీక్ష రద్దు అయింది. తొలిసారి జరిగిన పరీక్షకు 75శాతం మంది పరీక్ష రాస్తే.. రెండోసారి నిర్వహించిన పరీక్షకు 61శాతమే అటెండ్ అయ్యారు. ఇక మూడోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ నుంచి 1: 50 రేషియోలో 31,403 మందిని మెయిన్స్ కు ఎంపిక చేస్తే 21,093 (67.17%) మంది హాజరయ్యారు. కీలకమైన మెయిన్స్ ఎగ్జామ్స్ నూ అభ్యర్థులు పట్టించుకోకపోవడం టీజీపీఎస్సీ అధికారులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. 

కారణాలు చాలానే.. 

ఫీజు చెల్లించి పోటీ పరీక్షకు దరఖాస్తు చేసినా.. ఎగ్జామ్ కు అటెండ్ కాకపోవడానికి చాలానే కారణాలు కన్పిస్తున్నాయి. టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలపై అభ్యర్థుల్లో  పూర్తిస్థాయి నమ్మకం ఇంకా రాలేదని ఎక్స్ పర్ట్స్ అభిప్రాయ పడుతున్నారు.  మళ్లీ రద్దు అవుతాయి లేదా మళ్లీ నిర్వహిస్తారనే ప్రచారమూ దీనికి ఓ కారణంగా పేర్కొంటున్నారు. మరోపక్క పరీక్షకు సీరియస్​గా ప్రిపేర్ కాకపోవడంతో పాటు, అభ్యర్థులకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లు వారుంటున్న ప్రాంతానికి దూరంగా ఉండటం రీజన్​గా తెలుస్తోంది. వీటికితోడు దరఖాస్తు చేసుకున్న చాలామంది అభ్యర్థులకు గురుకులాలు, స్కూళ్లలో జాబ్స్ రావడంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కూడా వచ్చాయి. దీంతో డబ్బులు ఖర్చు చేసి మళ్లీ పరీక్ష రాయడం దేనికనే భావనతో కొందరు దూరంగా ఉన్నట్టు అభ్యర్థులు
చెప్తున్నారు.

90శాతం దాటిందే లేదు

ఇటీవల జరిగిన గ్రూప్ 3 పరీక్షకు అప్లై చేసిన వారిలో ఏకంగా  సగం మంది  అటెండ్ కాలేదు. మూడు పేపర్లలోనూ అదే వైఖరి కన్పించింది. భారీగా  1,363 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో.. 5,36,400 మంది అప్లై చేశారు. కానీ, పరీక్ష రాసేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు. 76శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకున్నారు. పేపర్1కు 51.1%, పేపర్ 2కు  50.7%, పేపర్ 3కి 50.24 శాతం మంది హజరయ్యారు. మొత్తం 5,36,400 మందికి గాను కేవలం 2,69,483 మంది ఎగ్జామ్ రాశారు. గతేడాది జరిగిన గ్రూప్ 4 పరీక్షకు 9,51,321 మంది అప్లై చేస్తే.. వారిలో7.61 లక్షల మంది అటెండ్ అయ్యారు.

ALSO READ : సాగునీటి బోర్ల కోసం పోడు రైతుల నిరీక్షణ

 సుమారు రెండు లక్షల మంది గైర్హాజరయ్యారు. జూన్ నెలలో నిర్వహించిన డీఎస్సీ –2024కు మాత్రం.. ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే అభ్యర్థుల నుంచి మంచి స్పందన  లభించింది. 2.79 లక్షల మందికి గానూ 2.45 లక్షల (87%) మంది హాజరయ్యారు. అయితే, టీజీపీఎస్సీ నిర్వహించిన  పరీక్షలకూ అటెండెన్స్ 90శాతం దాటింది లేదు.