Good Health : ఐరన్ లోపిస్తే అవయవాలు పాడవుతాయి.. వీటిని తినండీ ఎనర్జీగా ఉండండీ..!

శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ఆ పనిని నిర్వర్తిస్తుంది. రక్తం తగినంత ఆక్సిజన్ ను సరఫరా చేయలేకపోయినా, ఎర్రరక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నా అది రక్తహీనతకు దారితీస్తుంది. ఇందుకు కారణం ఇనుము లోపం. ఎందుకంటే ఎర్రరక్త కణాలు తయారుకావాలంటే ఇనుము, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12 వంటి పోషకాలు కావాలి.  

ఇవి లోపిస్తే రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. చేపలు, కోడిగుడ్లు, కాలేయం, బీట్ రూట్లు, పండ్లు, ములక్కాడల్లో ఇనుము అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవాలి. 

విటమిన్'సి' ఉన్న ఆహారం తరచుగా తీసుకుంటుండాలి. 'సి' విటమిన్ ఇనుము శోషణ రేటును పెంచుతుంది. జామపండ్ల వంటివి తీసుకుంటే ఆహారంలోని ఇనుమును శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. అన్నం లేదా ఏదైనా తిన్న తరువాత టీ, కాఫీ వంటివి తీసుకుంటే అవి మనం తిన్న ఆహారంలోని ఇనుమును శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయి. కాబట్టి కనీసం రెండు గంటల సమయం తరువాత టీ, కాఫీలు తీసుకోవాలి. చిరుధాన్యాల్లో ఐరన్తో పాటు సూక్ష్మ పోషకాలన్నీ తగు మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా సజ్జలు, రాగుల్లో ఇనుము అధిక మోతాదులో ఉంటుంది.