పేలియో డైట్
వ్యవసాయం డెవలప్ కాకముందు మన పూర్వీకులంతా వేటపై ఆధారపడి బతికేవాళ్లు. అప్పట్లో వాళ్లు ఎలాంటి ఫుడ్ తిన్నారో అలాంటిదే ఈ పేలియో డైట్. ఇప్పుడు వస్తున్న జబ్బులన్నీ మనం తింటున్న వెస్టర్న్ ఫుడ్, ధాన్యాలు, మిల్క్ ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ వల్లే అని ఈ డైట్ సిద్ధాంతం చెప్తోంది. అందుకే ఈ డైట్‌లో మన పూర్వీకులు ఎలా తిన్నారో మనం కూడా ఇప్పుడు అలానే తినాలి. ఈ డైట్‌లో లీన్ ప్రొటీన్, కూరగాయలు, పండ్లు, నట్స్, సీడ్స్ ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఫుడ్, షుగర్, మిల్క్ ప్రొడక్ట్స్, ధాన్యాలు తినకూడదు. మిల్క్ ప్రొడక్ట్స్‌లో జున్ను, వెన్న మాత్రం తినొచ్చు. చాలా డైట్స్‌లో ఆలుగడ్డలు, చిలగడదుంపలు తినకూడదు. కానీ.. ఇందులో వాటిని పుష్కలంగా తినొచ్చు. ఈ డైట్‌ని బరువు తగ్గడానికి ఎక్కువగా ఫాలో అవుతారు. ఇందులో రోజుకు 300–900 కేలరీలు మాత్రమే తీసుకుంటారు. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, బ్లడ్‌లో ట్రైగ్లిజరైడ్స్, బీపీ తగ్గుతాయి.
లో కార్బ్ డైట్
ఇలాంటి డైట్స్‌ని కొన్ని దశాబ్దాల నుంచి బరువు తగ్గడానికి ఫాలో అవుతున్నారు. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ తింటారు. రోజుకు 20–150 గ్రాముల కార్బ్స్ మాత్రమే తీసుకుంటారు. దాంతోపాటు కొంత ప్రొటీన్, ఫ్యాట్స్ తీసుకుంటారు. సాధారణంగా కార్బ్ నుంచే ఎక్కువ కేలరీలు వస్తాయి. కానీ.. కార్బ్ తక్కువగా తీసుకోవడం వల్ల అప్పటికే బాడీలో ఉన్న కొవ్వులు కరిగి శక్తిని ఇస్తుంటాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించుకునేందుకు ఈ డైట్ చేస్తుంటారు. ఈ డైట్ వల్ల ఆకలి తగ్గుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ లెవల్స్, రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
అల్ట్రా లో ఫ్యాట్ డైట్
ఒక రోజుకు అవసరమయ్యే కేలరీల్లో కొవ్వు నుంచి10 శాతం కంటే తక్కువ అందేలా తినడమే ఈ డైట్. సాధారణంగా మనం తినే ఫుడ్‌లో దాదాపు 30 శాతం ఏదో ఒక రకమైన ఫ్యాట్ ఉంటుంది. కానీ.. ఇందులో తగ్గించి తీసుకోవాలి. ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఊబకాయం ఉన్నవాళ్లు చాలామంది ఈ డైట్ చేసి బరువు తగ్గారు. ఒక స్టడీ ప్రకారం.. ఊబకాయం ఉన్నవాళ్లు వాళ్ల డైట్‌లో 7–14 శాతం ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల 8 -వారాల్లో సగటున 6.7 కిలోల బరువు తగ్గారు. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. కానీ.. ఈ డైట్ ఎక్కువ రోజులు చేయడం ప్రమాదం అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే.. ఫ్యాట్స్ కణ త్వచాలు (సెల్ మెంబ్రేన్స్), హార్మోన్లను తయారీలో, కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించడంలో సాయపడతాయి. కొవ్వులు తక్కువగా ఉంటే ఇవి మందగిస్తాయి.
హెచ్‌సీజీ డైట్
హెచ్‌సీజీ(హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్) డైట్చాలా స్పీడ్‌గా వెయిట్ తగ్గిస్తుంది. ఈ డైట్‌తో రోజుకు సుమారు 450 గ్రాముల నుంచి- కిలో వరకు బరువు తగ్గుతారు. ఈ డైట్ ఆకలిని తగ్గించి, మెటబాలిజంని బూస్ట్ చేసి, కొవ్వుని కరిగిస్తుంది. హెచ్‌సీజీ అనేది గర్భధారణ మొదట్లో ఎక్కువగా ఉండే హార్మోన్. దీన్ని బాడీలోకి పంపడం వల్ల వెయిట్ తగ్గిస్తారు. ఈ డైట్‌లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో హెచ్‌సీజీ సప్లిమెంట్లు తీసుకుంటారు. రెండవ దశలో తక్కువ కార్బ్స్ ఫుడ్ తీసుకోవాలి. రోజుకు కేవలం 500 కేలరీలు మాత్రమే అందేలా చూసుకోవాలి. దాంతోపాటే హెచ్‌సీజీ సప్లిమెంట్ డ్రాప్స్, పెల్లెట్స్, ఇంజెక్షన్స్‌లో ఏదైనా తీసుకోవాలి. తర్వాత నెమ్మదిగా ఫుడ్ తీసుకోవడం పెంచాలి. హెచ్‌సీజీ తీసుకోవడం ఆపేయాలి. ఈ డైట్ పూర్తి కావడానికి మొత్తంగా 36 వారాలు పడుతుంది. అయితే.. ఈ డైట్‌ని చాలా తక్కువమంది ఫాలో అవుతారు. కొన్ని స్టడీల ప్రకారం.. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్లే బరువు తగ్గుతున్నారని, దానికి కారణం.. హెచ్‌సీజీ హార్మోన్ కాదని తేల్చాయి. పైగా దీనివల్ల మజిల్ లాస్, తలనొప్పి, అలసట లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ డైట్‌ని ఎఫ్‌డీఏ(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ – అమెరికా) డిస్ అప్రూవ్ చేసింది.
డ్యుకెన్ డైట్
ఇది హై ప్రొటీన్, లో కార్బ్ డైట్. దీన్ని నాలుగు ఫేజ్‌లుగా చేస్తారు. ప్రతి ఫేజ్‌లో ఎంత వెయిట్ తగ్గాలి? అనేదాన్ని బట్టి డ్యూరేషన్ డిసైడ్ చేస్తారు. ప్రతి ఫేజ్‌లో తినే ఫుడ్స్ మారుతుంటాయి. ఇందులో వెయిట్ లాస్ ఫేజ్‌ల్లో హై ప్రొటీన్ ఫుడ్‌తోపాటు తప్పనిసరి ఓట్స్ ఊక తినాలి. మిగతా ఫేజ్‌ల్లో నాన్ స్టార్చీ కూరగాయలతో పాటు కొన్ని కార్బ్స్, ఫ్యాట్స్ తినాలి. డైట్ పూర్తయ్యాక కూడా కొన్ని రోజుల పాటు ప్రొటీన్ తీసుకోవడం తప్పనిసరి. ఒక స్టడీ ప్రకారం.. ఈ డైట్‌ని ఫాలో అయ్యే కొందరు మహిళలు రోజుకు సుమారు వెయ్యి కేలరీల ఫుడ్, 100 గ్రాముల ప్రొటీన్ తిన్నారు. వాళ్లు 8 నుంచి 10 వారాల్లో సగటున15 కిలోల బరువు తగ్గారు. కానీ.. ఈ డైట్‌లో మజిల్ లాస్ కూడా ఉంటుందని కొందరు చెప్తున్నారు.
అట్కిన్స్ డైట్
తక్కువ కార్బ్స్‌తో బరువు తగ్గించే డైట్ ఇది. ఇందులో కార్బ్స్‌కి దూరంగా ఉండి నచ్చినంత ప్రొటీన్, ఫ్యాట్స్ ఫుడ్ తింటూ బరువు తగ్గొచ్చు. అట్కిన్స్ డైట్‌ని నాలుగు దశలుగా విభజించారు. ఇది ఇండక్షన్ దశతో మొదలవుతుంది. ఇందులో రెండు వారాల పాటు రోజుకు 20 గ్రాముల కార్బ్స్ తీసుకుంటారు. తర్వాత దశల్లో మెల్లిమెల్లిగా హైల్దీ కార్బ్స్‌ని చేరుస్తారు. ఇది వెయిట్ లాస్ టార్గెట్‌ని చేరుకునేవరకు కొనసాగుతుంది. పొట్ట దగ్గర ఉండే ప్రమాదకరమైన కొవ్వుని తగ్గిస్తుంది. ఈ డైట్ వల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, ఇన్సులిన్, బీపీ అదుపులో ఉంటాయి. హెచ్‌డీఎల్(మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది.
జీఎం డైట్
దీన్ని జనరల్ మోటార్స్ డైట్ అని కూడా పిలుస్తారు. కేవలం వారంలో ఆరు కిలోలకు పైగా బరువు తగ్గించే డైట్ ఇది. ఇది ఏడు రోజుల డైట్ ప్లాన్. ఈ ఏడు రోజులు డాక్టర్ చెప్పిన ఫుడ్ మాత్రమే తినాలి. ఏ ఫుడ్ ఎంత తినాలనేది బరువు, శరీరతత్వాన్ని బట్టి డాక్టర్లు సూచిస్తారు. దీనివల్ల శరీరంలోని వ్యర్ధాలు తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాడీలో కొవ్వును కరిగించే కెపాసిటీపెరుగుతుంది. ఈ డైట్‌ని మళ్లీ మళ్లీ చేయొచ్చు. కానీ.. ప్రతి సైకిల్‌కి కనీసం ఐదు నుంచి ఏడు రోజుల గ్యాప్ ఉండాలి. డైట్‌లో ఉన్న ప్రతిరోజూ 8–12 గ్లాసుల నీళ్లు తాగాలి. మొదటి మూడు రోజులు ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయకూడదు.