కథలో పాత్రలే దెయ్యాలు
టైటిల్ : కాజల్ కార్తీక
డైరెక్షన్ : డీకే
కాస్ట్ : కాజల్ అగర్వాల్, రెజీనా, రైజా విల్సన్
ప్లాట్ ఫాం : ఆహా
కార్తీక (రెజీనా) ప్రేమలో ఓడిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడేందుకు బుక్స్ చదవడం అలవాటు చేసుకుంటుంది. ఒక ఫ్రెండ్ సలహాతో పాతకాలం నాటి ఒక లైబ్రరీకి వెళ్తుంది. అక్కడామెకు వంద ఏళ్ల నాటి ‘కాటుకబొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. చూడ్డానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో కార్తీక ఆ పుస్తకం చదవడం మొదలుపెడుతుంది. అప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది. ఆ పుస్తకంలో ఉన్న పాత్రలన్నీ కార్తీకకు దెయ్యాలుగా కనిపిస్తాయి. వాళ్లలో ఆ పుస్తకం రాసిన కార్తీక(కాజల్ అగర్వాల్) కూడా ఉంటుంది. ఇంతకీ పుస్తకం రాసిన కార్తీకకు, చదువుతున్న కార్తీకకు సంబంధం ఏంటి? ఆ పుస్తకంలోని పాత్రధారులు ఎలా చనిపోయారు? ఎందుకు దెయ్యాలుగా మారారు?.. ఇలాంటి ప్రశ్నలకు ఈ సినిమా చూస్తే సమాధానం దొరుకుతుంది.
అయితే.. కార్తీక చదువుతున్న పుస్తకంలో మొత్తం ఆరు కథలు ఉంటాయి. ఆ కథలు అన్నింటిలో హారర్ కామన్.
మీరా : కార్తీక పుస్తకం చదవడం మొదలుపెట్టాక ఒక్కో కథ స్క్రీన్‌పై వస్తుంటుంది. వీటిలో మీరా, శక్తి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్ శక్తికి మీరా ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది.
జననీ అయ్యర్ : అనుబంధాలు, ఆప్యాయతలు మర్చిపోయిన ఇద్దరు స్నేహితులకు వాటిని ఏలియన్స్ ఎలా గుర్తుచేశాయనేదే ఈ ఎపిసోడ్.
సిద్ధార్థ్ అభిమన్యు : సిద్ధార్థ్ అభిమన్యు అనే మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వచ్చిన మూవీ డైరెక్టర్ జాకబ్, సింగర్ శృతికి ఎదురయ్యే వింత మనుషులు, అనుభవాలు ఉంటాయి ఈ ఎపిసోడ్‌లో.
కాజల్, రెజీనా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇద్దరి యాక్టింగ్ బాగుంది. కాజల్ రోల్ స్క్రీన్ మీద చాలా తక్కువ టైం కనిపిస్తుంది.
నైజీరియా టు లండన్
టైటిల్ : మడు
డైరెక్షన్ : మాథ్యూ ఓజెన్స్, జోయెల్ కాచి బెన్సన్
కాస్ట్ : ఆంథోనీ మడు
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
వయోలా డేవిస్ అనే అతను... ఒక అబ్బాయి వర్షంలో తడుస్తూ.. అందంగా బ్యాలె డాన్స్ చేస్తున్న ఒక వీడియో క్లిప్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. ఆ వీడియో నైజీరియాలోని లాగోస్‌లో తీశారు. అందులో డాన్స్ చేసింది పన్నెండేండ్ల ఆంథోని మడు. ఒక గ్రౌండ్‌లో పిల్లలంతా ఆడుకుంటుంటే.. మడు మాత్రం బ్యాలె డాన్స్ చేస్తుంటాడు. ఏ ట్రైనింగ్ లేకుండా ఎంతో బాగా డాన్స్ చేస్తాడు. చుట్టుపక్కల వాళ్లు ‘ఆడపిల్లలా డాన్స్ చేస్తున్నావ’ని వెక్కిరించినా అవేమీ పట్టించుకోడు. ఆ ఒక్క వీడియోతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంటాడు మడు. ఆ వీడియో వల్లే అతనికి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న ఎల్మ్‌హర్స్ట్ బ్యాలె స్కూల్‌లో డాన్స్ నేర్చుకునే అవకాశం వస్తుంది. అంతేకాదు.. ఏడేండ్ల పాటు అతని చదువులకు అయ్యే ఖర్చుల కోసం స్కాలర్‌షిప్ కూడా దక్కుతుంది. ఈ ప్రయాణమంతా ‘మడు’ పేరుతో ఒక డాక్యుమెంటరీగా తీశారు. తన కలలను నెరవేర్చుకోవడానికి పన్నెండేండ్ల వయసులోనే తల్లి, తండ్రి, తోబుట్టువులను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిన మడు జర్నీని ఈ డాక్యుమెంటరీలో చాలా బాగా చూపించారు.
వీడియో గేమ్
టైటిల్ : ఫాల్అవుట్
డైరెక్షన్ : జోనథన్ నోలన్
కాస్ట్ : ఎల్లా పర్నెల్, ఆరోన్ మోటెన్, కైల్ మాక్‌లాచ్లాన్, మోయిసెస్ అరియాస్, క్సీలియా - జోన్స్, వాల్టన్ గోగ్గిన్స్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఫాల్అవుట్ వెబ్ సిరీస్‌ని ఒక వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో అనేక ఫిక్షన్ క్యారెక్టర్లు ఉంటాయి. ముఖ్యంగా రెట్రో ఫ్యూచరిజంతో తీసిన ఈ సినిమాలో 1950ల నాటి పరిస్థితులను చక్కగా చూపించారు. ఈ కథ లూసీ, కిరాయి హంతకుడు గౌల్, మ్యాగ్జిమస్ చుట్టూ తిరుగుతుంది. లూసీ ఒక వాల్ట్ నుంచి భూమ్మీదకు వస్తుంది. అప్పటికే భూమి మీద అల్లకల్లోలం జరిగిపోతుంది. బతకడానికే కష్టమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటి స్థితి నుంచి భూమిని కాపాడడమే ఆమె లక్ష్యం. కానీ.. ఆమెను చంపడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఆమె వాళ్లను ఎలా ఎదిరించింది? భూమిని ఎలా కాపాడింది? అనేదే అసలు కథ.
సిరీస్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కథలో ట్విస్ట్‌లు చాలా ఉన్నాయి. యాక్టింగ్ విషయానికి వస్తే.. ప్రధాన పాత్రల్లో చేసినవాళ్లంతా ఆకట్టుకున్నారు.
ఆ హత్యల వెనక...
టైటిల్ : ఇన్‌స్పెక్టర్ రిషి
డైరెక్షన్ : జె.ఎస్. నందిని
కాస్ట్ : నవీన్ చంద్ర, సునైనా ఎల్లా, కన్న రవి, కుమారవేల్, మీషా ఘోషల్, సెమ్మలర్ అన్నం, గజరాజ్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్
తమిళనాడులోని తేన్కాడు అనే అటవీ ప్రాంతానికి ఫొటోలు తీయడానికి ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ వెళ్తాడు. అతను అదే అడవిలో చనిపోతాడు. మరో విషయం ఏంటంటే.. అతని శవం చుట్టూ సాలె గూడు కట్టి ఉంటుంది. అతని చావు వెనుక ఎవరున్నారు? అక్కడ ఏం జరుగుతోంది? అనేది తెలుసుకోవడానికి అధికారులు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రిషి(నవీన్ చంద్ర)ని పంపిస్తారు. అయితే రిషిని అక్కడికి పంపించడం అక్కడి సబ్ఇన్స్పెక్టర్ అయ్యనార్(కన్నా రవి)కి నచ్చదు. అతని వల్లే అయ్యనార్కి ప్రమోషన్ దక్కదేమో అని బాధపడుతుంటాడు. అదే అడవిలో ఫారెస్ట్ రేంజర్‌గా సత్య(శ్రీకృష్ణ దయాళ్), గార్డ్స్‌గా ఖ్యాతి (సునయన), ఇర్ఫాన్ (ఎలాంగో కొమరవెల్) పనిచేస్తుంటారు. ఫొటోగ్రాఫర్ హత్య కేసు తేలకముందే అదే తరహాలో మరికొన్ని హత్యలు జరుగుతాయి. ఈ హత్యలకు కారణం.. అక్కడి దేవత ‘వనరచ్చి’ అని అందరూ నమ్ముతారు. కొందరైతే వనరచ్చిని చూశామని కూడా చెప్తారు. అయితే.. ఆ హత్యలన్నీ వనరచ్చి చేసిందా? లేక మరెవరైనా చేస్తున్నారా? అనేది తెలుసుకోవడానికి రిషి రంగంలోకి దిగుతాడు. చివరికి ఆ హత్యలకు కారణం కనుగొన్నాడా? లేదా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
కథ అంతా అడవిలోనే నడుస్తుంది. సినిమా పేరు చూసి క్రైమ్ థ్రిల్లర్ అనుకుంటారు. కానీ.. ఇందులో మిస్టరీతోపాటు ఎన్నో ట్విస్ట్‌లు ఉన్నాయి. కథ ఎక్కడా బోర్ కొట్టించదు. నవీన్ చంద్ర యాక్టింగ్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ సునయన కూడా మెప్పించింది.
పెండ్లి ఎవరితో!
టైటిల్ : పొన్ ఒండ్రు కండేన్
డైరెక్షన్ : ప్రియా. వి
కాస్ట్ : వసంత్ రవి, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి,
ప్లాట్ ఫాం : జియో సినిమా
ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. శాండీ (ఐశ్వర్య లక్ష్మి)ని గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న శివ (అశోక్ సెల్వన్), ఉద్యోగం లేని సాయి (వసంత్ రవి) ప్రేమిస్తారు. సాయి అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకుంటుంటాడు. వీళ్లిద్దరూ ఒకప్పుడు స్కూల్‌లో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోతారు. వాళ్లతోపాటే వాళ్లిద్దరి మధ్య శతృత్వం కూడా పెరిగి పెద్దది అవుతుంది. ఈ ఇద్దరి గురించి తెలిసి.. ఎవరికి ‘ఓకే’ చెప్పాలో అర్థంకాక అయోమయంలో పడిపోతుంది శాండీ. అయితే.. శాండీని దక్కించుకోవడానికి శివ చాలా తెలివిగా ఎత్తులు వేస్తుంటాడు. సాయి మాత్రం అందులో కాస్త వెనకబడతాడు. చివరికి శాండీ ఎవరిని పెండ్లి చేసుకుంది? చిన్నప్పుడు శివ, సాయిల మధ్య గొడవ ఎందుకు జరిగింది? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా? లేదా? ఐశ్వర్య లక్ష్మి యాక్టింగ్ చాలా బాగుంది. పని మనిషిగా నటించిన దీప్కా శంకర్ కామెడీ బాగుంటుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది.
ఎవరు చంపారు?
టైటిల్ : అమర్ సింగ్ చమ్కీలా
డైరెక్షన్ : ఇంతియాజ్ అలీ
కాస్ట్ : దిల్జీత్ దోసంజ్, పరిణీతి చోప్రా, అంజుమ్ బాత్రా, అపీందర్ సింగ్, అనురాగ్
ప్లాట్ ఫాం : నెట్‍ఫ్లిక్స్
యువతలో జోష్ నింపే పాటలతో పంజాబీల మనసులు దోచిన సింగర్, మ్యుజీషియన్ అమర్ సింగ్ చమ్కీలా జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈయన1980ల్లో చాలా పాపులర్. ‘ఎల్విస్ ఆఫ్ పంజాబ్’గా పేరు.30 ఏండ్లు కూడా నిండకముందే అతన్ని కొంతమంది చంపేశారు. అమర్ సింగ్ చమ్కీలా (దిల్జీత్ దోసంజ్), ఆయన భార్య సింగర్ అమర్జోత్ (పరిణీతి చోప్రా)ల హత్యతో ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. అమర్‌సింగ్‌ది చాలా పేద కుటుంబం. సాక్సులు తయారు చేసే కంపెనీలో పని చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం ఇష్టం. చుట్టు పక్కల పరిస్థితులపై జానపద పాటలు పాడుతుండేవాడు. పాట మీద ఇష్టంతో అప్పటికే పాపులర్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న షిండా దగ్గర చేరుతాడు. లిరిక్స్ రాసివ్వడం, ట్యూన్ చేసి ఇవ్వడం లాంటి పనులు చేస్తుంటాడు. ఒకసారి స్టేజీ మీద పాడే అవకాశం దొరుకుతుంది. ఆ పాట విన్న అందరూ అతన్ని మెచ్చుకుంటారు. అప్పటినుంచి చమ్కీలాకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. జానపద గాయకుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. చమ్కీలా పాడిన పాటల క్యాసెట్స్కు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. చమ్కీలాకు విదేశాల్లో పాడే అవకాశం వస్తుంది. అతని పాటల్లో అశ్లీల పదాలు ఉన్నాయని బెదిరింపు కాల్స్ వచ్చేవి. ఒకరోజు కొందరు దుండగులు చమ్కీలాతోపాటు అతని భార్యని కూడా గన్‌తో కాల్చి చంపేస్తారు.
ఆ హత్యల మిస్టరీ ఇప్పటికీ తేలకపోవడంతో కూడా చమ్కీలాని ఎవరు చంపారనేది డైరెక్టర్ సినిమాలో చెప్పలేదు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్.