శ్రావణమాసం..  వెరైటీ ప్రసాదాలు ఇవే..

శ్రావణ మాసం అంటేనే... ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. మరీ ముఖ్యంగా అమ్మవారికి ప్రసాదాలు పెట్టడం ఆనవాయితీ. ఆ ప్రసాదాల్లో స్వీట్స్​ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు మహిళలు. ఎప్పుడూ ఒకేరకమైన ప్రసాదం పెట్టడం ఇష్టం లేనివాళ్లు వెరైటీగా చేసి పెడతారు. పప్పులతో కూడా వెరైటీగా పాయసం తయారు చేసుకోవచ్చు.  ఇప్పుడు పప్పుల పాయసం   ప్రసాదాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. 

శెనగపప్పు పాయసం​ ప్రసాదం తయారీకి కావలసినవి

  • శెనగపప్పు: ముప్పావు కప్పు
  • పాలు : ముప్పావు కప్పు
  • బెల్లం తురుము: ఒక కప్పు
  • ఎండు కొబ్బరి ముక్కలు : ఒక టేబుల్​ స్పూన్​ ( కావాలంటే)
  • జీడిపప్పు, కిస్మిన్: ఒక్కోటి అర టేబుల్ స్పూన్ చొప్పున
  • నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం: స్టవ్​ పై పాన్​ పెట్టి  శెనగపప్పుని వేగించాలి. తర్వాత వేగించిన పప్పులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి ప్రెజర్ కుక్కర్లో నాలుగు విజిళ్లు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పప్పుగుత్తితో మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బాలి.

 స్టవ్ పై ఒక గిన్నె పెట్టి బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు వేడి చేయాలి. అందులో రుబ్బిన శెనగపప్పు, ఇలాచీ పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గించాలి. తర్వాత నెయ్యిలో వేగించిన కిస్మిస్, జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి స్టవ్ ఆపేయాలి..ఇక శెనగపప్పు పాయసం​ రడీ.. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తరువాత మనం తినాలి.  ఇది ఎంతో టేస్టుగా ఉంటుంది.

పెసరపప్పు పాయసంతయారీకి కావలసిన పదార్దాలు

  • పెసరపప్పు : అరకప్పు
  • నీళ్లు : ఒక కప్పు
  • పాలు: అరకప్పు
  • బెల్లం తురుము లేదా చక్కెర: అరకప్పు
  • ఇలాచీపొడి: అరటీ స్పూన్​
  • జీడిపప్పు, కిస్మిన్: ఒక టేబుల్ స్పూన్ చొప్పున
  • నెయ్యి: సరిపడా

తయారీ విధానం: పెసరపప్పుని ముందుగా వేగించి, నీళ్లతో కడగాలి. తర్వాత ఆ పప్పులో ఒక కప్పు నీళ్లు పోసి ప్రెజర్ కుక్కర్లో రెండు విజిళ్లు వచ్చే వరకు ఉడికించాలి. స్టవ్ పై పాన్​ పెట్టి నెయ్యి వేడి చేయాలి. అందులో పెసరపప్పు ముద్ద, బెల్లం తురుము లేదా చక్కెర వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగాక పాలు పోయాలి. మిశ్రమం దగ్గరికయ్యాక ఇలాచీ పొడి, నెయ్యిలో వేగించిన కిస్మిస్, జీడిపప్పు వేసి కలపాలి. మామూలు పాలకు బదులు కొబ్బరి పాలు కూడా వాడొచ్చు.

కందిపప్పు పాయసానికి కావలసిన పదార్ధాలు

  • ఉడికించిన కందిపప్పు: పావు కప్పు
  • పాలు: ఒక కప్పు,
  •  బెల్లం తురుము: అర కప్పు
  • కిస్మిస్, జీడిపప్పు తరుగు: ఒక్కోటి ఒక టేబుల్ స్పూన్ చొప్పున
  • ఇలాచీ పొడి: అర టీ స్పూన్
  • నెయ్యి: ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం: స్టవ్​ పై  పాన్ పెట్టి నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పు తరుగు, కిస్మిస్లు వేగించి వేరే ప్లేట్లో వేయాలి. అదే పాన్లో ఉడికించిన కందిపప్పు, బెల్లం తురుము, పాలు వేయాలి. మిశ్రమం మరిగాక, స్టవ్ మంట తగ్గించాలి. అలాగే బెల్లం పూర్తిగా కరిగాక, ఇలాచీ పొడి, నెయ్యిలో వేగించిన జీడిపప్పు, కిస్మిస్ లు వేసి కలపాలి. నిమిషం తర్వాత స్టవ్ ఆపేయాలి.. కందిపప్పు పాయసం చేయడానికి మరో పద్దతి కూడా ఉంది. బెల్లాన్ని కందిపప్పుతో పాటు ఉడికించి రుబ్బాలి. దాన్ని వేడి పాలలో కలిపి చేసుకోవచ్చు..