పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా? 

భూమ్మీద టెంపరేచర్లలో ప్రతి ఏడాది కొంత మార్పు కనిపిస్తూనే ఉంది. ఎంతో కొంత టెంపరేచర్‌‌‌‌ పెరుగుతూనే ఉంది. భూమి సగటు టెంపరేచర్‌‌‌‌15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. కానీ.. కొన్ని పరిస్థితుల వల్ల గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువ, తక్కువ  కూడా నమోదైంది. ఇలా టెంపరేచర్లలో మార్పులు రావడం సహజమే. కానీ.. గతంతో పోలిస్తే గడిచిన కొన్ని దశాబ్దాల్లో టెంపరేచర్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి.1880 నుంచి సైంటిస్ట్‌‌లు టెంపరేచర్లలో మార్పులను తెలుసుకోవడానికి శాటిలైట్స్‌‌ ఉపయోగిస్తున్నారు.

నాసా ప్రకారం.. భూమిపై సగటు ప్రపంచ ఉష్ణోగ్రత1880 నుండి ఇప్పటివరకు కనీసం1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగింది.  భూమి టెంపరేచర్‌‌‌‌ పెరుగుతోందని చెప్పడానికి మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. సైంటిస్ట్‌‌లు చెట్ల వలయాలు, ఐస్​కోర్స్‌‌తో పాటు మరికొన్ని నేచురల్ ఇండికేషన్స్‌‌పై ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో కొన్ని శతాబ్దాల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు లేవని కొన్నేండ్ల నుంచే ఈ మార్పులు వస్తున్నాయని చెప్పారు. 


మహాసముద్రాల టెంపరేచర్లు పెరగడం, ఉత్తరార్ధగోళంలో మంచు కరగడం లాంటివన్నీ భూమి వేడెక్కుతోందని చెప్పడానికి సూచికలే. అయితే.. భూమి వాతావరణం దాని 4.5 బిలియన్ సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ మారుతూనే ఉంది. కానీ.. సాధారణంగా వందల, వేల సంవత్సరాల్లో జరిగే మార్పులు ఇప్పుడు దశాబ్దాల్లోనే జరుగుతున్నాయి. ఉదాహరణకు1975 నుండి దాదాపు దశాబ్దానికి 0.15 నుండి 0.20 డిగ్రీల సెల్సియస్ చొప్పున టెంపరేచర్లు పెరిగాయి.1977 నుంచి చూస్తే.. దాదాపు ప్రతి ఏడాది టెంపరేచర్లు పెరుగుతూనే ఉన్నాయి. 2010 నుండి ఇప్పటివరకు10 అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సంవత్సరాలుగా రికార్డ్‌‌ అయ్యాయి.