పైసలిస్తేనే అన్​ఫిట్​ .. మూడు స్టంట్లు పడిన కార్మికుడు ఫిట్​ఫర్ ​జాబ్​

  • ఒక స్టంట్​ పడిన సర్ఫేస్​ కార్మికుడికి అన్​ఫిట్​ 
  • సింగరేణిలో మెడికల్​బోర్డు అవినీతిపై సీఐడీ ఎంక్వైరీ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి మెడికల్​బోర్డులో పైసలిస్తేనే అన్​ఫిట్​అయ్యే పరిస్థితి నెలకొంది. మెడికల్​ బోర్డులో అక్రమాలపై సీఐడీతో విచారణ చేపట్టాలంటూ డీజీపీకి గతంలో సీఎండీ బలరాం లేఖ రాశారు. దీంతో సింగరేణి కాలరీస్​కంపెనీలో ఇన్వాలిడేషన్​(మెడికల్​ బోర్డు)ద్వారా నియామకాలు పొందిన వారిపై నాలుగైదు నెలల కిందట సీఐడీ ఎంక్వైరీ చేపట్టింది. 

రెండు నెలల కిందట సీఐడీ బృందాలు ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాయి.  ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదు. దీంతో దళారులు అందిన కాడికి దండుకుంటున్నారు. గతంలో అన్​ ఫిట్​ కోసం రూ. 5 నుంచి రూ. 6లక్షలు ఇస్తే ఇప్పుడు రూ. 6 నుంచి రూ.7లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజుల కిందట నిర్వహించిన మెడికల్​ బోర్డులో 206 మంది అటెండ్​అయితే 186 మంది అన్​ఫిట్​ కావడం అక్రమాలకు అద్దం పడ్తొందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 

మూడు స్టంట్లు పడ్డా ఫిట్ ఫర్​ జాబ్​:

సింగరేణి కాలరీస్​ కంపెనీ శ్రీరాంపూర్​ ఏరియాలో అండర్​గ్రౌండ్​ మైన్​లో కోల్​ కట్టర్​గా పనిచేస్తున్న శంకర్​ అనే కార్మికుడికి మూడు స్టంట్లు పడ్డాయి. పక్షవాతం ఎఫెక్ట్​ అయింది. వెన్నుముక సమస్యతో బాధపడుతున్నాడు. తాను పనిచేయలేకపోతున్నానని, తనను అన్​ఫిట్ చేయాలని​మెడికల్​ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు.  వైద్యులు పరీక్షించిన అనంతరం ఫిట్​ఫర్​జాబ్​అని రాయడంతో శంకర్​కు విస్తుపోయాడు. సర్ఫేస్​లో పనిచేస్తున్న ఓ కార్మికుడికి ఒక్క స్టంటే పడింది. అయినా ఆయనను వైద్యులు అన్​ఫిట్​చేయడం చర్చనీయాంశంగా మారింది. 

ALSO READ : నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ

ఆఫీసర్ల కనుసన్నలలోనే :

మెడికల్​ బోర్డు దందా సింగరేణి ఆఫీసర్ల కనుసన్నలలోనే జరుగుతుందని సింగరేణిలో గుర్తింపుసంఘం నేతలు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెంలోని సింగరేణి హాస్పటల్​లో కీలక శాఖల్లో ఉన్న వారిలో ఒకరిద్దరు దళారుల అవతారం ఎత్తి దందాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెడికల్​ దందాలో కింది స్థాయి నుంచి హైదరాబాద్ వరకు లావాదేవీలున్నాయి . హైదరాబాద్ నుంచి వచ్చే డాక్టర్లకు దళారులిచ్చిన లిస్టు చేరుతుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

186 మంది అన్​ఫిట్​ ​

కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​హాస్పిటల్​లో మూడు రోజుల కిందట నిర్వహించిన మెడికల్​ బోర్డుకు 238 మందిని ఆఫీసర్లు పిలిచారు. 32 మంది అబ్సెంట్ కాగా.. 186 మంది అన్​ఫిట్​ అయ్యారు.  హయ్యర్​ రిఫరల్స్​కు 13 మందిని పంపారు.  ఈ 13 మంది దళారులను కలిసి వస్తే మెడికల్​ బోర్డులో అన్​ఫిట్​అవుతారనే ప్రచారం జరుగుతోంది. 

ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, మంచిర్యాల, శ్రీరాంపూర్​, మందమర్రి, ఆర్జీ1,2,3 ఏరియాల్లో ఎనిమిది సీఐడీ బృందాలు విచారణ చేపట్టాయి.  విచారణ నివేదికలను పోలీసులకు రెండు నెలల కిందటే అందజేశాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు లేకపోవడంతో మెడికల్​బోర్డులో దందా మరింత జోరందుకుంది.  సీఐడీ నివేదికలను బహిర్గతం చేసి దళారులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. 
 మెడికల్​ బోర్డు ద్వారా ఇప్పటి వరకు దాదాపు 14 వేల మందికి పైగా కార్మికులు అన్​ ఫిట్​అయ్యారు. ఈ క్రమంలో దాదాపు రూ. 450 కోట్ల రూ. 500 కోట్లకు పైగా అన్‌‌‌‌ ఫిట్ ద్వారా చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.