ఆధ్యాత్మికం : మౌనాన్ని మించిన మంచి లేదు.. 3 రకాలుగా మౌనం.. రమణ మహర్షి చెప్పిన సూక్తి ఇదే..!

తుపాకి తూటా కన్నా మౌనం చాలా ప్రమాదం. వేదాలు, పురాణాలు కూడా మౌనం గురించి చాలా గొప్పగా చెప్పాయి. స్నానం చేసేటప్పుడు మౌనంగా శరీరం మీద, భోజనం చేస్తున్నప్పుడు జీర్ణవ్యవస్థ మీద, చదువుతున్నప్పుడు మనసు మీద దృష్టి పెట్టాలి..

మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ మౌనం అంతకన్నా గొప్పది. ఇళ్లలో కొందరు స్త్రీలు మౌన వ్రతాన్ని పాటిస్తుంటారు. మాట్లాడకుండా తమ ఆలోచనలను సైగలతో చెప్పడానికి ఇబ్బందులు పడుతుంటారు. ప్రతి మనిషిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు చెడు గుణాలుంటాయి. మంచివైపు మనిషి నడవకుండా అడ్డుకుంటాయి. మౌనం పాటించడం వల్ల వీటిని అదుపు చేయొచ్చు.

రుషులంతా మౌనంగా ఉన్నారు కాబట్టి వాళ్లను మునులని కూడా అంటారని చెప్తారు. కానీ మౌనంగా ఉండటం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు. మనిషిలో ఉన్న అన్ని రకాల చెడుగుణాలను అణచివేయడం అంటే ఎక్కువకాలం బతకాలి...ఎక్కువ డబ్బు సంపాదించాలి.... సంసార సుఖాలు ఎక్కువ అనుభవించాలి. దాన ధర్మాలు చేయకూడదు. అవమానం పొందితే తిరగబడాలి వంటి విషయాలలో మౌనం పా టించాలని శాస్త్రాలు చెప్తున్నాయి.

మాట వెండి... మనసు బంగారం

యోగ సిద్ధాంతంలో మౌనం గురించి పతంజలి చాలా గొప్పగా వివరించాడు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందుదు లాంటి వాళ్లు మౌనం ప్రాధాన్యం గురించి చెప్పారు. “మౌనం అంగీకారం కాదు, అలాగని ఇతరుల మీదకు నెట్టేస్తున్నట్లు కాదు. మౌనం ఓ ప్రశాంతత అని రమణ మహర్షి చెప్తాడు.

 మాట ఇతరులను నొప్పించకుండా... మంచి జరిగేలా ఉండాలి. అలా వీలుకానప్పుడు మౌనంగా ఉండటమే మంచిదని మహాభారతంలోని విదుర నీతి చెప్తుంది. నోరు మాట్లాడకూడదు... హృదయం మాత్రమే మాట్లాడాలని విజ్ఞులు చెప్తారు. దీనికి సంబంధించిన కథ ఒకటి మన పురాణాల్లో ఉంది. 

వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే వినాయకుడు రాశాడని చెప్తారు. అయితే మహాభారతాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి అయిపోయే వరకు
వినాయకుడు మాట్లాడలేదట. 'ఇంతకాలం ఎలా మౌనంగా ఉండగలిగావు?' అని వ్యాసుడు అడిగితే, అందుకు వినాయకుడు 'స్వామీ! ప్రతి మనిషిలోనూ జీవించడానికి అవసరమైన శక్తి ఉంటుంది. కానీ మాట సరిలేకపోతే ఆ శక్తిని పూర్తిగా పొందలేము. వాక్ శుద్ధి పోతుంది. దాంతో ఆలోచనలు కూడా ఆగిపోతాయి. అందుకే ఇంతకాలం నేను మౌనంగా ఉన్నానని చెప్పాడు.

ప్రయోజనాలు

మౌనం అంటే బాహ్యమైనది మాత్రమే కాదు. అంతర్గతమైనది కూడా. ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదు. తక్కువగా మాట్లాడే వాళ్ల మాటకు సమాజంలో విలువ ఉంటుంది... కోపాన్ని మాటల్లో వ్యక్తం చేయకుండా అదుపు చేసుకోవచ్చు. ఇతరులతో మాటల యుద్ధాలు ఉండవు. దాంతో అశాంతి కలగదు. మాట విలువ తెలిసిన వాళ్లు ఎక్కువ మాట్లాడరు. అవసరం అయినా చాలా తక్కువ మాట్లాడతారు. మాటలను పొదుపుగా వాడటం వల్ల శరీరానికీ మంచిదే. మాటలు తగ్గించి మనసు పని మీద పెడితే తొందరగా పూర్తి చేయొచ్చు. ప్రయోజనాన్నీ పొందొచ్చు అన్ని విషయాలు తెలిసిన వాళ్లు, కార్యాన్ని సాధించే శక్తి ఉన్న వాళ్లు తీర్పు చెప్పి సమస్యను పరిష్కరించే సమర్థులు ఒక్కోసారి మౌనంగా ఉంటారు. అలాంటప్పుడు ఎదుటి వాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మౌనం మూడు రకాలు

  •  వాగ్ మౌనం : దీనివల్ల ఇతరులను ఇబ్బంది పెట్టేలా మాట్లాడకుండా ఉంటారు. అబద్ధాలు ఆడే అవకాశం లేదు. గర్వంలాంటి చెడు గుణాలను ప్రదర్శించాల్సిన పనీ ఉండదు.
  •  అక్షమౌనం:  దీనిలో ఇంద్రియాలను నిగ్రహిస్తారు. అన్ని రకాల ఇంద్రియాలను నిగ్రహించుకోవటం వల్ల శరీరంలోని శక్తి నశించదు. పైగా మరింత శక్తివంతులుగా తయారవుతారు.
  •  కాష్ఠమౌనం:  మిగిలిన రెండు మౌనాలకంటే ఇదే చాలా గొప్పది. మనసు ఎప్పుడూ పరిపరి విధాల సంచరిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడో తిరుగుతుంది. దానిని కట్టడి చేసి ఆధీనంలో ఉంచుకోవడమే కాష్ఠమౌనం.

ఈ మూడు రకాల మౌనాలను పాటించగలిగితే మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు. సమాజంలోనూ ఉన్నత వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు. కీర్తి ప్రతిష్టలు సంపాదించొచ్చు. మాట్లాడటం చాలా సులభం, మాట్లాడకుండా ఉండటమే కష్టం. మౌనం కూడా యోగసాధనలో భాగమేనని చెప్తారు ఆధ్యాత్మికవేత్తలు...

-వెలుగు,లైఫ్-