పార్క్​ స్థలానికి ఎసరు..! గ్రేటర్ వరంగల్ లో ఓ బీఆర్ఎస్ నేత దందా

  • సురేంద్రపురి కాలనీలోని ఓపెన్ ల్యాండ్ పై కన్ను
  • రూ.3 కోట్లు విలువైన స్థలం కబ్జాకు ప్రయత్నం
  • బినామీలకు రిజిస్ట్రేషన్ చేసి దౌర్జన్యం
  • ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో లే అవుట్ పార్కులు, ఓపెన్ ల్యాండ్స్ కబ్జాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. ఇప్పటికే పదుల సంఖ్యలో పార్క్ స్థలాలు అన్యాక్రాంతం కాగా, ఇప్పుడు మరోచోట రూ.3 కోట్లు విలువ చేసే కమ్యూనిటీ పర్పస్ ల్యాండ్ పై ఓ బీఆర్ఎస్ నేత కన్నుపడింది. రూల్స్​కు విరుద్ధంగా పార్క్​ స్థలాన్ని తన బినామీల పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. వాళ్లు సదరు ల్యాండ్ పైకి వెళ్లి దౌర్జన్యం చేస్తుండటంతో స్థానికులు పోలీసులు, ఇతర ఆఫీసర్లకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా పరిస్థితి మారకపోగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలు, కార్లలో తరచూ అక్కడికి వస్తూ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

పార్క్ స్థలంపై కన్నేసిన బీఆర్ఎస్ లీడర్..​

గ్రేటర్ వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో వడ్డేపల్లి సమీపంలోని సురేంద్రపురి కాలనీలో వెటర్నరీ, ఇతర ఉద్యోగుల కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 21/1ఏ, 22, 25, 33/ 1ల్లోని 10.20 ఎకరాల భూమిని 1983లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత 118 ప్లాట్లు చేసి, తిరుపతయ్య అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చి ఆయన ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ లే అవుట్ లో భవిష్యత్తు అవసరాల కోసం ఓ చోట 905 గజాలు, మరో రెండుచోట్ల కలిపి 635 గజాలు మొత్తంగా 1,540 గజాల స్థలాన్ని ఓపెన్ ల్యాండ్ గా ఉంచారు.

 ఎవరికి వారు ఇండ్లు కట్టుకోవడంతోపాటు కమ్యూనిటీ అవసరాల కోసం వదిలిన 905 గజాల స్థలంలో ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు. వినాయక మండపాన్ని నిర్మించుకుని, అప్పటి ఎమ్మెల్యే అరూరి రమేశ్ చేతులమీదుగా ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, కమ్యూనిటీ అవసరాలకు ఓపెన్ స్పేస్ గా ఉంచిన 905 గజాల స్థలంపై బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంబంధించిన కమిషన్ చైర్మన్ గా పని చేసిన ఓ నేత కన్ను పడింది. దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు ఆ ల్యాండ్ ను తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చదును చేసే ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో సురేంద్రపురి కాలనీ భూవివాదం తెరమీదకు వచ్చింది.

బినామీల పేరు మీదకు మార్చి..

పార్కు స్థలాన్ని తన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్న బీఆర్ఎస్ నేత ఆ స్థలాన్ని తన బినామీ పేరు మీదకు మార్చాడు. సదరు బినామీ ఆ రిజిస్ట్రేషన్​ కాగితాలతో కోర్టుకు వెళ్లాడు. వాస్తవానికి కోర్టు పరిధిలో ఉన్న స్థలంపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదు. కానీ, వాళ్లు నిబంధనలు తుంగలో తొక్కి ఆ స్థలాన్ని వారికే సంబంధించిన మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం పార్కుకు సంబంధించిన స్థలంలో బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కు పర్మిషన్ కూడా తీసుకోవడం గమనార్హం. కాగా, తరచూ తన అనుచరులతో ల్యాండ్ పైకి వచ్చి, అక్కడ కన్ స్ట్రక్షన్ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, తెరవెనుక సదరు బీఆర్ఎస్ నేతనే చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇదిలాఉంటే పార్కు ల్యాండ్ కబ్జా చేసి, స్థానికులను భయపెట్టే ప్రయత్నం చేస్తుండటంతో వాళ్లంతా అప్పటి వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు అప్పటి డీసీపీ అశోక్ కుమార్ విచారణ చేపట్టి, కబ్జాకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశారు. అయినా తీరుమారకుండా అక్కడకు వచ్చి గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడంతో కాలనీవాసులు పలుమార్లు పోలీసులు, గ్రేటర్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 23న కూడా కార్లు, ఆటోల్లో తన అనుచరులను తీసుకొచ్చి హంగామా సృష్టించే ప్రయత్నం చేయగా, కాలనీవాసులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పార్కు కోసం కేటాయించిన ఓపెన్ ల్యాండ్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతోపాటు భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.