ఏంటీ నిజమా : 2050 నాటికి చాక్లెట్లు ఉండవా.. మాయం అవుతాయా..?

సంతోషం ఏ రూపంలో వచ్చినా నోటిని తీపి చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తోంది. ఒకప్పుడు సంప్రదాయ తీపి పదార్థాలు ఆ తియ్యదనాన్ని తీర్చేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని చాకొలెట్లు ఆక్రమించాయి అనడంలో సందేహం లేదు. ప్రపంచంలో ఏ మూలకెళ్లి చూసిన చాకొలెట్ల టేస్ట్, క్రేజ్, సేమ్ టు సేమ్ ఉంటాయి. అంతలా నచ్చేసింది కనుకే పసి పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు చాకొలెట్ని మైమ'రుచి' చప్పరిస్తారు. అయితే, ఇంకో ముప్పై ఏండ్లు అంటే 2050 నాటికి చాకొలెట్లు దొరకవు అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. ఇంతకీ ఇది నిజమేనా?
 
మన దగ్గరికి చాకొలెట్ల సంస్కృతి అమెరికా దేశాల్లో వీటిని విపరీతంగా తింటారు. ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల టన్నుల చాకొలెట్లు ఉత్పత్తి అవుతుంటే వీళ్లే 10 లక్షల టన్నులు తింటున్నారు. వీళ్ల తర్వాత స్విట్జర్లాండ్, చైనా, భారత్లో కూడా చాకొలెట్ల వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది. గతేడాది మన దేశంలో రెండు లక్షల 52 వేల టన్నుల చాకొలెట్లు తిన్నారు. అమెరికాలో సగటున ఒక వ్యక్తి ఎనిమిది కేజీల చాకోలెట్లు తింటున్నారట.

డిమాండికి తగ్గ సప్లై లేదు

 ఏ వస్తువైనా డిమాండ్ అండ్ సప్లై సూత్రం మీదే నడుస్తుంది. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోతే.. సంక్షోభం తలెత్తుతుంది. ఇదే ఇప్పుడు చాకొలేట్లకూ వర్తిస్తుంది. చాకొలెట్లకు మార్కెట్లో డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. 2009 నుంచి 2019తో పోలిస్తే పదేళ్లలో చాకొలెట్ల డిమాండ్ మూడింతలైంది. ఉత్పత్తి మాత్రం అదే నిష్పత్తిలో పెరగడం లేదు అంటున్నారు. దీనికోసం చాకొలెట్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను
అన్వేషించే పనిలో పడ్డాయి.

 ఎందుకు పెరగడంలేదు?

చాకొలెట్లు తయారీకి కావాల్సిన పదార్థం కోకో. ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల కోకో చెట్లు సరిగ్గా పెరగడం లేదు. దీంతో కోకో ఉత్పత్తి తగ్గిపోతోంది. కోకో చెట్లు ప్రత్యేకమైన వాతావరణంలోనే పెరుగుతాయి. వాటికి తేమ, నీడ అవసరం. వాతావరణ మార్పుల కారణంగా వేడికి అవి సరిగ్గా పెరగక ఉత్పత్తి భారీగా పడిపోతోంది. కోకోను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం ఘనా . ఇప్పుడు ఈ దేశంలో ఉత్పత్తి పడిపోవడంతో చైనా దీనికి అండగా నిలిచి ఒకటిన్నర బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించి కోకో పంటపై దృష్టి పెట్టింది.

నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఓ ఓఓఏ), కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులతో కలసి ప్రపంచ వ్యాప్తంగా కోకో చెట్లు పెరిగే 294 ప్రదేశాల్లో అధ్యయనం చేపట్టింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇక్కడ పెరుగుతున్న చెట్లలో 2050 నాటికి కేవలం 10.5 శాతం చెట్లే కోకోను ఉత్పత్తి చెయ్యగలవని, మిగతా 89.5 శాతం చెట్లు అనుకున్నట్టు ఉత్పత్తి చేయకపోవచ్చని అంచనా వేసింది..

అంతా అబద్ధం

'ఇప్పుడు డిమాండ్ కి సరిపడ చాకొలెట్ నిల్వలు ఉన్నాయి. 2050లో కూడా చాకొలెట్ల ఉత్పత్తి తగ్గదు. అప్పటికీ 2.1 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంది అంతే. ఆఫ్రికాలో కోకో చెట్లు పెరగకుంటే, ఇండోనేసియా, ఆస్ట్రేలియాలలో పెరుగుతాయి. తేమ, నీడ లేకుండా పెరిగే కోకో చెట్లను సృష్టించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల చాకొలెట్లు తగ్గిపోతాయని జర్నల్ ప్రచురించడం వాస్తవ దూరం. దీనికి ఎన్డీఓఏ కూడా మద్దతివ్వడం హాస్యాస్పదం! నిజానికి గ్లోబల్ వార్మింగ్ ఆందోళనకరం. దీని ప్రభావం ప్రతి దేశంపై ఉంటుంది. ప్రతి ఒక్కరూ గ్లోబల్ వార్మింగ్పై పోరాటం చేయాల్సిందే. కానీ, గ్లోబల్ వార్మింగ్ వల్ల 2050 నాటికి చాకోలెట్లే ఉండవు అనేది భయపెట్టడానికి వండి వార్చిన వైరల్ వార్తే తప్ప ఇంకేం కాదు. ' అని 'ఫోర్బ్స్', సైన్స్ అలర్ట్'లో విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు వాదనల్లోనూ నిజమే ఉన్నా.. భవిష్యత్తులో ఏమవుతుందో కాలమే చెప్పాలి!