నల్గొండ జిల్లాలో బదిలీల పంచాయితీ

  • చూపకుండా ట్రాన్స్​ఫర్లు రెండు నెలలుగా సెలవుల్లో జేపీఎస్​లు
  • బదిలీలపై వెళ్లలేక మూకుమ్మడిగా సెలవులు పెట్టిన పంచాయతీ కార్యదర్శులు
  • 62 మంది సెలవులపై వెళ్లిన సెక్రటరీలు
  • ఖాళీ జీపీలకు ఇన్​చార్జి సెక్రటరీల పేరుతో రెండు జీపీల బాధ్యతలు

సూర్యాపేట, వెలుగు: పంచాయతీరాజ్​శాఖలో విలేజ్​ సెక్రటరీల బదిలీల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో మొత్తం 218  ఖాళీలు చూపించి కేవలం 180 మందిని మాత్రమే బదిలీ చేయడంతో పంచాయితీ మొదలైంది.రెండు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. ఒకేచోట నాలుగేండ్లు నిండిన వారందరినీ బదిలీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు వివరాలు సేకరించారు. సీనియార్టీ ప్రకారం ట్రాన్స్​ఫర్లు చేపట్టారు. అయితే ఓపీఎస్ ఖాళీలు చూపించకుండా కేవలం జేపీఎస్ ల ఖాళీలు చూపించి బదిలీలు చేపట్టడంతో  పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవులు పెట్టి విధులకు దూరంగా ఉంటున్నారు. ఈ తతంగం రెండు నెలల నుంచి నడుస్తున్నా జిల్లా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇన్​చార్జిలను నియమించి చేతులు దులుపుకోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. 

ఖాళీలు చూపించకుండా బదిలీలు..

జిల్లాలో మొత్తం 475 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 51 మంది ఓపీఎస్ లు, 336 మంది జేపీఎస్ లు పనిచేస్తున్నారు. గత ఆగస్టులో గ్రేడ్ 1,2,3 పంచాయతీ కార్యదర్శులను మొత్తం 180 మందిని ఇతర గ్రామాలకు బదిలీ చేశారు. కానీ మొత్తం 218  ఖాళీలు చూపించి కేవలం 180 మందిని మాత్రమే బదిలీ చేయడంతో అక్కడే పంచాయితీ మొదలైంది. దీంతో ఓపీఎస్ ల స్థానంలో జేపీఎస్ లను ఖాళీ ఉన్న స్థానాలకు కాకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేయడంపై పంచాయతీ కార్యదర్శులు అధికారుల తీరుపై గుర్రుగా ఉన్నారు.   

మూకుమ్మడిగా సెలవులపై కార్యదర్శులు..

జిల్లా అధికారులు ఇష్టానుసారంగా బదిలీ చేయడంపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధులను బహిష్కరించారు. బదిలీపై వెళ్లలేక రెండు నెలలుగా 62 మంది పంచాయతీ కార్యదర్శులు సెలవులు పెట్టి వెళ్లారు. అయితే సెలవుల్లో ఉన్న కార్యదర్శుల సమస్యను పరిష్కరించకుండా అధికారులు ఖాళీగా ఉన్న జీపీల్లో పక్క జీపీ కార్యదర్శులను ఇన్​చార్జిలుగా నియమించారు. మొత్తం 475 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 62 మంది కార్యదర్శులు సెలవులపై వెళ్లారు. మరో 13 గ్రామ పంచాయతీలకు మాత్రం రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు లేక ఖాళీగా ఉన్నాయి. 

అయితే దీనిపై పంచాయతీ కార్యదర్శులు గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, వెంటనే సమస్యను పరిష్కరించి బదిలీలు చేపట్టాలని జిల్లా పంచాయతీశాఖ అధికారిని ఆదేశించారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికే పాలకవర్గం లేక గ్రామాల్లో ఇన్​చార్జి అధికారులతో కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పుడు రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక పంచాయతీ సెక్రటరీని ఇన్​చార్జిగా నియమించడంతో పారిశుధ్యం పడకేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు.  

సెక్రటరీలు సెలవుల్లో ఉన్నది వాస్తవం 

గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా కొందరు సెలవులు పెట్టారు. మరికొంతమంది మెడికల్ లీవ్ లో ఉన్నారు. ఈ కారణంగా ఖాళీగా ఉన్న జీపీల్లో సెక్రటరీలకు ఇన్​చార్జిల బాధ్యతలు అప్పగించాం. గతంలో జరిగిన బదిలీలపై నాకు అవగాహన లేదు.

నారాయణరెడ్డి, ఇన్​చార్జి డీపీవో