‘సుడా’ చైర్మన్​ పీఠంపై నువ్వా.. నేనా?

  • అధికార పార్టీ నేతల మధ్య పోటాపోటీ
  • మరిన్ని మండలాలను చేర్చడంతో పోటీ తీవ్రం
  • మంత్రులు, ముఖ్య నేతల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు

ఖమ్మం, వెలుగు:  స్తంభాద్రి అర్బన్​ డెవలప్​ మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్​ పీఠంపై అధికార పార్టీ లీడర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తాజాగా సుడా పరిధిని మరింతగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేయడంతో పోటీ పెరిగింది. తమకే అవకాశం కల్పించాలంటూ ఎవరికివారు రాష్ట్ర కాంగ్రెస్​ ముఖ్యులతో పాటు జిల్లా మంత్రులను వేడుకుంటున్నారు. ఖమ్మం కార్పొరేషన్, వైరా మున్సిపాలిటీ​తో పాటు వైరా, పాలేరు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 46 గ్రామాలను కలుపుతూ 2017 అక్టోబర్​ లో సుడాను ఏర్పాటు చేశారు.

 ఇప్పుడు మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలను కవర్​ చేస్తూ మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలు, 17 మండలాల్లోని 279 గ్రామాలను సుడా పరిధిలోకి తీసుకువచ్చారు. జిల్లాలోని కామేపల్లి, ఏన్కూరు, కారేపల్లి మండలాలు మినహాయించారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలోని లీడర్లే సుడా చైర్మన్​ పదవిని ఆశిస్తుండగా, తాజాగా మరిన్ని మండలాల విలీనంతో ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు కూడా సుడా చైర్మన్​ రేసులోకి వచ్చారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్​ పోస్టులు కోరుకుంటున్న లీడర్లు కూడా ప్రస్తుతం సుడా పీఠంపై కన్నేశారు. 

మస్తు డిమాండ్..​

సుడా పరిధిలో జరిగే రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు, రియల్​ ఎస్టేట్​ వెంచర్లు, లే అవుట్ల అనుమతుల విషయంలో సుడా కీలకం కావడంతో చైర్మన్​ పదవీకి డిమాండ్​ పెరిగింది. దీంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ఉంటుంది. ఆయా మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసే వెంచర్ల నుంచి సుడా ఫీజును వసూలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఆ నిధుల విషయంలో నిర్ణయాధికారంతో పాటు భారీగా ఆదాయ వనరులున్న పదవి కావడంతో లీడర్ల మధ్య సుడా చైర్మన్​, డైరెక్టర్​ పదవులకు పోటీ కనిపిస్తోంది. 

రేసులో ఉన్నది వీళ్లే..!

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత పాలకవర్గాన్ని రద్దుచేశారు. అప్పుడు చైర్మన్​ తో పాటు 14 మంది డైరెక్టర్లుండగా, త్వరలోనే డైరెక్టర్ల సంఖ్యను పెంచుతూ కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటుచేసే అవకాశముంది. జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​, లీడర్లు సాదు రమేశ్ రెడ్డి, కమర్తపు మురళి, మానుకొండ రాధాకిషోర్, మహ్మద్​ జావెద్, మిక్కిలినేని నరేందర్, మట్టా దయానంద్ తదితరులు సుడా పీఠాన్ని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఎంపీలు రఘురాంరెడ్డి, రేణుకాచౌదరి ఆశీస్సులు ఉన్న వారికి పదవి వరించే అవకాశం కనిపిస్తోంది.