పాలమూరులో పదోన్నతుల గందరగోళం

  •     ఎస్​జీటీలకు రెండు, మూడు చోట్ల పోస్టింగ్
  •     పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీ
  •     మారుమూల పల్లెల్లో బడులు మూతపడే ప్రమాదం
  •     సాఫ్ట్​వేర్​లో మార్పులు చేసుంటే తప్పు జరిగేది కాదంటున్న టీచర్లు

వనపర్తి, వెలుగు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ఎస్​జీటీ, తత్సమాన టీచర్ల పదోన్నతుల్లో గందరగోళం నెలకొంది. రెండు, మూడు సబ్జెక్టుల్లో ప్రమోషన్ వచ్చిన టీచర్లు ఒకే స్థానాన్ని ఎంచుకోవడంతో మిగతా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 600 పోస్టులు ఖాళీగా ఉండనున్నాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. అయితే, ఖాళీలపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎస్​జీటీలకు బదిలీలు చేపట్టాల్సి ఉన్నందున దానిపై దృష్టి పెట్టారు. 

వనపర్తిలో 43 పోస్టులు ఖాళీ

ప్రమోషన్స్​వచ్చిన టీచర్లు చాలా వరకు సబ్జెక్టుతో సంబంధం లేకుండా తమకు దగ్గరగా ఉన్న స్కూళ్లను ఎంపిక చేసుకుని జాయిన్​ కావడంతో స్కూల్ అసిస్టెంట్​ పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ఎస్​జీటీల్లో కొందరికి రెండు, మూడు సబ్జెక్టుల్లో ప్రమోషన్​ వచ్చింది. అయితే, ప్రమోషన్​ వచ్చిన వాటిలో సదరు టీచరు ఒక్క సబ్జెక్టును ఎంచుకుని మిగతా పోస్టులకు నాట్​విల్లింగ్ ఇవ్వాల్సి ఉండగా, అలా చేయలేదు. 

ఫలితంగా ఒకే టీచరుకు రెండు, మూడు సబ్జెక్టులకు ప్రమోషన్ వచ్చింది. వనపర్తి జిల్లాలో మొత్తం 417 మంది ఎస్​జీటీ, భాషా పండితులు, వ్యాయామోపాధ్యాయులకు పదోన్నతులు వచ్చాయి.  వీరిలో 43 మందికి రెండు, మూడు చొప్పున పదోన్నతులు రాగా, ఒక్క పోస్టునే ఎంచుకోవడంతో అవి మిగిలిపోయాయి. 

గ్రామీణ బడులు మూతపడే ప్రమాదం

ఇదిలా ఉంటే, ప్రైమరీ స్కూళ్లలో  పనిచేసే టీచర్లందరికీ ప్రమోషన్లు వచ్చి బదిలీ అయిన చోట్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. స్కూళ్లలో  ఒకరు, ఇద్దరు ముగ్గురు ఎస్​జీటీలున్న చోట్ల వారందరికీ ప్రమోషన్​ రావడంతో వారి స్థానంలో టీచర్ పోస్టు ఖాళీ ఏర్పడింది. ప్రమోషన్ల ఫలితంగా స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని అధికారులు తక్షణమే వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పలువురు కోరుతున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో పనిచేసే టీచర్లు పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాలకు దగ్గరగా ఉన్న స్కూళ్లలో చేరడంతో గ్రామీణ ప్రాంతాల స్కూళ్లు మూతబడే ప్రమాదం ఉంది.

సాఫ్ట్​వేర్​లోనే ప్రాబ్లమ్!

పదోన్నతులు కల్పించే సాఫ్ట్​వేర్​లోనే ప్రాబ్లమ్ ఉందని, పదోన్నతి వచ్చిన టీచర్ ​రెండో స్కూల్​ను ఎంపిక చేయకుండా సాఫ్ట్​వేర్​ రూపొందించి ఉండి ఉంటే పోస్టులు మిగిలేవి కావని పలువురు టీచర్లు పేర్కొంటున్నారు. టీచర్లు కూడా ప్రమోషన్​ వచ్చిన పోస్టుల్లో ఒకదాన్ని ఎంచుకుని మిగిలిన వాటిని వదులుకుని ఉంటే మిగతా టీచర్లకు న్యాయం జరిగేదని అభిప్రాయపడుతున్నారు. పాతిక ఏండ్లుగా ప్రమోషన్లు రాక ఆందోళన చెందుతున్న టీచర్లకు ఖాళీగా ఉన్న  పోస్టులను సీనియారిటీ ప్రకారం ప్రమోషన్​ఇవ్వాలని పీఆర్​టీయూ- తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మహిపాల్​రెడ్డి కోరారు.   

నాగర్ కర్నూల్ ​జిల్లా కొల్లాపూరు నియోజకవర్గంలోని పాన్​గల్​ మండలానికి చెందిన ఎస్​జీటీకి బయోసైన్స్​, ఇంగ్లీషు రెండింటిలో పదోన్నతి లభించింది. తనకు రవాణా పరంగా ఇంగ్లీషు సబ్జెక్టు కేటాయించిన స్కూల్​ దగ్గరగా ఉండడంతో అటువైపే మొగ్గుచూపాడు. ఫలితంగా మిగతా పోస్టులు కేటాయించిన స్కూళ్లలో ఆ పోస్టులు ఖాళీగానే ఉండనున్నాయి.

వనపర్తి మండలానికి చెందిన టీచర్​కు​ కూడా ఎల్ఎఫ్ఎల్, సోషల్​ స్టడీస్, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో ప్రమోషన్​ వచ్చింది.  ఎల్ఎఫ్ఎల్ ​పోస్టు ఉన్న స్కూల్​​దగ్గరగా ఉండడంతో అదే ఎంచుకున్నారు.