జహిరాబాద్ లో మహిళా ఓటర్లే కీలకం

  •     జహీరాబాద్​ పార్లమెంట్​ పరిధిలో మహిళ ఓటర్లే ఎక్కువ 
  •     అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిన మహిళలు 

కామారెడ్డి, వెలుగు : జహీరాబాద్‌‌ పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపొటముల్లో మహిళ ఓట్లే కీలకం కానున్నాయి.  ఈ ఎంపీ సెగ్మెంట్‌‌లో పురుషుల ఓట్ల కంటే మహిళా ఓటర్లు 36,200 మంది ఎక్కువ ఉన్నారు.  ఇక్కడ గెలుపోటములను డిసైడ్‌‌ చేసేది మహిళా ఓటర్లే అని నాయకులు నమ్ముతుండగా..  వారి ఓట్లను ఎలాగైనా తమకే పడేట్లు ప్రచారం నిర్వహిస్తున్నారు.  

క్షేత్రస్థాయిలో మీటింగ్‌‌లు షురూ.. 

జహీరాబాద్‌‌ ఎంపీ సెగ్మెంట్‌‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో  క్షేత్రస్థాయిలో  ప్రచారం జోరందుకుంది.  ఇక్కడ  మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను కామారెడ్డి జిల్లాలో 4, సంగారెడ్డి జిల్లాలో 3 ఉన్నాయి.  ఈ ఎంపీ సెగ్మెంట్‌‌లో 16,31,561 మంది ఓటర్లు ఉండగా ఇందులో  పురుషులు  7,97,649 మంది, మహిళలు  8,33,849 మంది ఉన్నారు.  పురుషుల కంటే  మహిళలు 36,200 ఎక్కువగా ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులకు మహిళా ఓట్లు కీలకం కానున్నాయి. 

రెండు జిల్లాలోనూ వారే ఎక్కువ

కామారెడ్డి జిల్లాలో 4  నియోజకవర్గాల్లో  8,73,630  మంది ఓటర్లు ఉండగా..  పురుషులు 4,20,990 మంది, మహిళలు 4,52,596 మంది ఉన్నారు.   కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్​ పరిధిలో 31,606 మంది మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి.  సంగారెడ్డి జిల్లాలోని 3 నియోజక వర్గాల్లో  మొత్తం ఓటర్లు 7,57,931 మంది కాగా ఇందులో పురుషులు 3,76,659 మంది, మహిళలు  3,81,253 మంది ఉన్నారు.  దీంతో ఇక్కడ కూడా మహిళా ఓటర్లు  4,594 మంది ఎక్కువగా ఉండడం గమనార్హం. 

అత్యధికంగా కామారెడ్డి నియోజకవర్గంలో 9,775 మంది,  ఎల్లారెడ్డిలో  8,982 మంది, బాన్సువాడలో 9,149 మంది,  జుక్కల్​లో 3,700 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు.   నారాయణ్‌‌​ఖేడ్​లో  మహిళల కంటే పురుషులు  566 మంది, జహీరాబాద్​లో 178 మంది పురుషుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.  గత నవంబర్‌‌‌‌లో జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో మహిళ ఓట్లు కీలకంగా పని చేశాయి.  

గ్రామీణ ప్రాంతాల్లో మహిళాసంఘాల సమాచారాన్ని పార్టీల ప్రతినిధులు సేకరిస్తున్నారు.  మహిళా సంఘాల ప్రతినిధులతో పాటు బీడీ కార్మికుల వివరాలు సేకరించి  తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఆయా రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. దీని కోసం ఆయా సంఘాల ప్రతినిధులను కలిసి తమకే మద్దతు ప్రకటించాలని కోరుతున్నాయి.