హోలీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ పండుగను ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు జరుపుకుంటారు. పురాణాలలో ఈ పండుగ గురించి అనేక కథలు ఉన్నాయి.
ఏం చెప్తుందంటే..!
హోలీ చేసుకోవడం అంటే రంగులు చల్లుకొని ఎంజాయ్ చేయడం కాదు, జీవితాన్ని రంగులమయం చేసుకోవడం. ఒకరితో ఒకరు కలిసి సంతోషంగా బతుకును పంచుకోవడం. ఇంద్రధనస్సులో ఏడురంగులు ఎలా కలిసి ఉంటాయో, అలా ఐకమత్యంతో కలిసి ఉండాలన్న సందేశం ఇస్తుంది ఈ పండుగ.
కామదహనం
పార్వతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్లి అవమానానికి గురవుతుంది. ఆ బాధతో అదే యజ్ఞంలో పడి ఆత్మహత్య చేసుకుంటుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక శివుడు కాళభైరవుడిని సృష్టిస్తాడు. అతడు దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు. భార్య వియోగాన్ని తట్టుకోలేని శివుడు ఘోరతపస్సు చేస్తుంటాడు. దాంతో రాక్షసులకు ఎదురులేకుండా పోతుంది. వాళ్ల ఆగడాలకు భయపడిన దేవతలు శివుడి తపస్సుకు భంగం కలిగించాలనుకుంటారు. మన్మథుడితో అతడిపై పూలబాణాలు వేయిస్తారు. ఆ బాణాల వల్ల తన తపస్సుకు భంగం కలగడంతో శివుడు కోపంతో మూడవ కన్ను తెరిచి మన్మథుడ్ని బూడిద చేస్తాడు. మన్మథుడి భార్య రతీదేవీ ప్రార్ధించడంతో ఆమెకు మాత్రమే కనపడేలా వరం ఇస్తాడు. . .అందుకే హోలీ ముందురోజు మంటలు వేసి కాముడి పున్నమి చేస్తారు.
ప్రహ్లాదుడు
హిరణ్యకశిపుడు, శివుడి గురించి తపస్సు చేసి పగలు, రాత్రి, ఇంటి లోపల, ఇంటి బయట, భూమిపైన, ఆకాశంలో మనుషుల చేత, జంతువుల వల్ల, అస్త్రశస్త్రాలతో చావు లేకుండా. రాన్ని పొందుతాడు. అతడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. ఎంత చెప్పినా విష్ణువును ఆరాధించడం మానడు. దాంతో కొడుకును చంపడానికి అనేకసార్లు ప్రయత్నిస్తాడు హిరణ్యకశిపుడు. కానీ కుదరదు. తన సోదరి హోలిక ఒడిలో కూర్చోబెట్టి మంటల్లో ప్రహ్లాదుడిని తగల బెడతాడు. అయితే విష్ణుమాయ వల్ల ప్రహ్లాదుడు మంటల్లోంచి కాలకుండా బయటపడితే హోలిక చనిపోతుంది. హోలిక చనిపోయిన రోజే హోలీ అని ప్రచారంలో ఉంది.
హోలిక
కృతయుగంలో రఘునాథుడనే రాజు ఉండేవాడు. అతడు సూర్యవంశానికి చెందినవాడు. అతడి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవాళ్లు. అయితే హోలిక అనే రాక్షసి పసిపిల్లలను బాధపెడుతూ.. ఉండేది. ప్రజలందరూ రఘునాథుడికి ఈ విషయం చెప్పి కాపాడమని అడుగుతారు. అప్పుడు అక్కడే ఉన్న నారదుడు హోలికను పూజించమని, అలా పూజిస్తే పిల్లల్ని ఏమీ చేయదని చెప్తాడు. అప్పటి నుంచి ఫాల్గులు పూర్ణిమరోజు హోలికను పూజించడం అక్కడి ప్రజలు మొదలు పెట్టారు. అయితే కాలక్రమంలో పగలు రాత్రుళ్లు మాత్రమే హోలికను పూజించాలన్న ఆనవాయితీ ఏర్పడింది. అలా హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని చెప్తారు.
కృష్ణుడు.. రాధ
హోలీ పండుగకు సంబంధించిన మరో కథ రాధా కృష్ణులది. కృష్ణుడు తన శరీరం రంగుకు, రాధ రంగుకు తేడా ఉందని తల్లి దేవకిని అడుగుతాడు. దేవకి 'నువ్వు రాధ ముఖానికి రంగు పుయ్యి' అని చెప్తుంది. కృష్ణుడు రాధ ముఖానికి రంగు పూయాలని.. నిర్ణయించుకుంటాడు. బృందావనంలో రాధ. గోపికలు, కృష్ణుడు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ ఆడినట్లు పురాణాల్లో ఉంది.
ఆరోగ్యం
హోలీ రోజు రంగులు చల్లుకొని, ఆ నీళ్లతో తడిసి ముద్దవుతారు. అవన్నీ పోవాలంటే పరిశుభ్రంగా స్నానం చేయాల్సిందే. అందుకే హోలీ శరీర శుద్ధికి సంబంధించిన పండుగ. వీధుల్లో తిరుగుతూ, ఒకరిపై ఒకరు సరదాగా, సంతోషంగా రంగునీళ్లు పోసుకుంటారు. ఉత్సాహంగా అందరూ ఒకచోట చేరి హోలీ జరుపుకుంటారు. హోలీ ఆడటం వల్ల మానసిక, శారీరక వ్యాయామం లభిస్తుంది. ఈ పండుగతో చలికాలం వెళ్లిపోయి, ఎండాకాలం మొదలవుతుంది. ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పును చర్మం తట్టుకోవడానికి అవసరమైన ఔషధాన్ని ఈ రంగులు ఇస్తాయి.
ఒకప్పుడు రంగులను సహజంగా తయారుచేసుకునే వాళ్లు. పసుపు కలిపిన చందనం, అష్టగంథం, చెట్ల వేళ్ల నుంచి తీసిన రసాలు, మోదుగ పువ్వుల గుజ్జు, మందారపూలు, గులాబీపూల నుంచి తీసిన రసాలతో రంగులు చేసుకునేవాళ్లు. అవి శరీరానికి ఔషధాలుగా పనిచేసేవి. అందుకే హోలీ అంటే ఆరోగ్యంతో పాటు, పర్యావరణానికి సంబంధించిన పండుగ. ప్రతీకని చెప్తారు. హోలీరోజు కృష్ణుడిని, రాధను ఉయ్యాలలో వేసి ఊపుతారు.
రంగులే రంగులు
హోలీ పండుగలోని రంగులకు జీవితానికి దగ్గర సంబంధం ఉంది. అసలు ఈ ప్రపంచమే. రంగుల మయం. మనిషిలో ఉండే రకరకాల భావోద్వేగాలకు రంగులకు దగ్గరి సంబంధం ఉందని కూడా అంటారు. ఒక్కో రంగు ఒక్కో ఉద్వేగాన్ని తెలియజేస్తుంది. ఎరుపు ఆవేశం, తెలుపు ప్రశాంతత, పసుపు సంతోషం... ఇలా అన్నిరంగ కలయికే మనిషి జీవితం ప్రతి ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకుంటూ అవసరమైనప్పుడు, అవసరమైన వరకు మాత్రమే ప్రదర్శించాలి.
ప్రకృతి కూడా రంగులమయమే. సూర్యకిరణాలు, ఇంద్రధనసులోని ఏడు వర్ణాలు, సూర్యకిరణం మంచుబిందువుపై పడినప్పుడు కనిపించే రంగులు.. హోలీ తత్వాన్ని తెలియజేసేవే. రంగులు చల్లుకోవడం వెనక ఉద్దేశం కూడా. ఇదే ప్రతి ఒక్కరూ జీవితంలోకి సంతోషాన్ని ఆహ్వానించాలని చెప్తుంది ఈ పండుగ.