బాల్కొండ, వెలుగు: పుడమి పులకించి, తొలకరి జల్లుల పలకరింపుతో అన్నదాతకు బాసటగా నిలిచే మృగశిర కార్తె ప్రవేశించిన రోజు గ్రామాల్లో చేపలకు మస్తు గిరాకీ లభించింది. రిజర్వాయర్, కాలువలు, చెరువుల్లో పట్టిన చేపలను మార్కెట్ కు తరలించి విక్రయిస్తారు. చెరువుల్లోని చేపలు రుచికరంగా ఉంటాయని గ్రామాల్లో చేపల కోసం చాలా మంది పట్టణాల నుంచి తరలివచ్చారు.
మృగశిర రోజు చేపలు తినాలనే ఆశతో జనాలు చేపల కోసం ఎగబడ్డారు. గ్రామాల్లో మత్సకారుల చేపల అమ్మకాలు జోరందుకున్నాయి. పట్టణ కేంద్రాల్లో ఫిష్ మార్కెట్లు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. చేపల రకాలను బట్టి కిలో రూ.140 నుంచి రూ.600 వరకు విక్రయించారు. కార్తె పురస్కరించుకుని మటన్, చికెన్ కన్నా చేపలకు బలే గిరాకీ ఉంది.