వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి వడ్ల కుప్పను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

డిచ్ పల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందాడు. చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి, రైలు కిందపడి యువకుడు, పెన్షన్​ తీసుకొని వస్తుండగా వృద్ధుడు, బైక్ అదుపుతప్పి మరో యువకుడు దుర్మరణం చెందారు. డిచ్​పల్లి ఎస్ఐ మహేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి మండలం చల్లగర్గెకు చెందిన మీసాల సాయిలు(54) డిచ్​పల్లి బస్టాండ్​సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

బైక్ అదుపుతప్పి ..

నందిపేట : బైక్ అదుపుతప్పి కిందపడడంతో యువకుడు మృతి చెందాడు. నందిపేట మండలం ఉమ్మెడ శివారులో​ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ రాహుల్​తెలిపిన ప్రకారం.. నిర్మల్ జిల్లా లోస్రా గ్రామానికి చెందిన ధర్మపురి సూర్య కిరణ్​(29) నందిపేట మండలం తల్వేదలోని బంధువుల ఇంటికి పండుగకు వచ్చాడు. రాత్రి బైక్ పై తిరిగి వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. బైంసా ప్రభుత్వాస్పత్రికి తరలించగా, సూర్య కిరణ్​అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

పెన్షన్​ తీసుకొని వస్తుండగా..

ఎడపల్లి: ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారం గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  మెట్టు భూమయ్య(62) అక్కడికక్కడే మృతి చెందాడు. వృద్ధాప్య పెన్షన్​ తీసుకోవడానికి తన స్వగ్రామమైన తానాకలాన్​నుంచి ఎడపల్లి పోస్టు ఆఫీస్ కు భూమయ్య మోపెడ్ పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రోడ్డు క్రాస్​ చేస్తుండగా కారు ఢీ కొనడంతో మృతి చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బోధన్​ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రైలు కిందపడి యువకుడు

నిజామాబాద్ క్రైమ్: నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. అజంతా ఎక్స్​ప్రెస్​స్టేషన్ వద్దకు యువకుడు హఠాత్తుగా అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ సాయరెడ్డి తెలిపారు. యువకుడు వైలెట్ కలర్ షర్టు, బ్లూ కలర్ జీన్ పాయింట్ ధరించినట్లు చెప్పారు.

డిచ్​పల్లి: రోడ్డుపై పోసిన వడ్ల కుప్పను ఢీకొట్టిన వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన డిచ్ పల్లి మండలంలోని అమృతాపూర్ లో జరిగింది.  గ్రామానికి చెందిన కుందేటి శ్రీకాంత్ ఆదివారం రాత్రి​ డిచ్​పల్లి నుంచి స్వగ్రామానికి బైక్​ పై వెళ్తున్నాడు. చీకట్లో రోడ్డు పై పోసిన వడ్లకుప్పను ఢీకొని కింద పడ్డాడు. తీవ్ర గాయాల కావడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మహేశ్​ హెచ్చరించారు.