దంపతుల ప్రాణం తీసిన వర్క్ రివార్డ్.. విమాన ప్రమాదంలో ఒక్కొక్కరిదీ ఒక్కో హృదయవిదారక గాథ

  • మూడేండ్ల చిన్నారిని బలిగొన్న హాలిడే ట్రిప్

సియోల్: దక్షిణ కొరియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. మరణించిన 179 మంది ప్రయాణికుల లాస్ట్ జర్నీకి చెందిన హృదయ విదారక కథలు ప్రతిఒక్కరినీ కలిచివేస్తున్నాయి. దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు సిటీకి చెందిన 30 ఏండ్ల మహిళ ఓ సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్నది. ఇటీవల బెస్ట్ ఎంప్లాయ్ గా ఎంపికైన ఆమెకు.. సంస్థ బ్యాంకాక్‌‌ ట్రిప్ అవకాశం ఇచ్చింది. దాంతో ఆమె. తన భర్త(33) తో కలిసి బ్యాంకాక్‌‌ టూర్ వెళ్లింది. 

దంపతులిద్దరూ అక్కడ ఎంతో ఎంజాయ్ చేశారు. వెళ్లిన ప్రతిచోట ఫొటోలు దిగిన మహిళ..వాటన్నింటిని తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. ఫొటోలకు " ఇక్కడ వాతావరణం చాలా బాగుంది" అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే, దంపతులిద్దరూ ట్రిప్ ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఫ్లైట్ క్రాష్‌‌ అయ్యింది. దాంతో దంపతులిద్దరు సజీవదహనం అయ్యారు. ఆ జంట మృతిపై కుటుంబసభ్యులు, కొలీగ్స్ కూడా షాక్ అయ్యారు.

మూడేండ్ల చిన్నారి ఫస్ట్ జర్నీ విషాదం

థాయ్‌‌లాండ్ కు  చెందిన కాంగ్ కో(43) , భార్య జిన్ లీ సియోన్ (37), కుమారుడు (3)తో కలిసి హాలిడే ఎంజాయ్ చేయడానికి విదేశీ పర్యటనకు బయల్దేరారు. తమ కుమారుడి మొదటి "ఫ్లైట్ జర్నీ" జ్ఞాపకాలను అతనికి అందించాలని విమానం ఎక్కగానే బాలుడు విండో నుంచి బయటకు చూస్తుండగా ఫొటోలు తీశాడు. వాటిని తన ఇన్‌‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. "నా కొడుకు ఫస్ట్ టైం విమానంలో  విదేశాలకు వెళుతున్నాడు. ట్రిప్ ఏర్పాట్ల వల్ల నేను చాలా  అలసిపోయాను. కానీ నా కొడుకు చాలా సరదాగా గడుపుతున్నాడు. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా" అని క్యాప్షన్ ఇచ్చాడు. కానీ ప్రమాదంలో  తల్లిదండ్రులతోపాటు ఆ మూడేండ్ల చిన్నారి కూడా సజీవదహనం అయ్యాడు.

ఆ ఇద్దరూ విమానం తోక వల్లే బతికారు

దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమానం తోక భాగంలోని సీట్లలో కూర్చోవడం వల్లే వారిద్దరూ బతికిబట్టకట్టారని టైమ్ మ్యాగజైన్ స్టడీ చెబుతోంది. ఈ ప్రమాదంలో 179 మంది చనిపోగా.. 32 ఏండ్ల లీ(మహిళ), 25 ఏండ్ల క్వాన్‌‌(యువకుడు) మాత్రమే ప్రాణాలతో బయటపడడం ఆశ్చర్యానికి గురిచేసింది. లీ ఎడమ భుజం విరగడంతో పాటు తలకు గాయమైందని, క్వాన్ తలకు గాయం కావడంతోపాటు అతని చేయి ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు చెప్పారు. అయితే, ఇద్దరికీ ప్రాణహాని మాత్రం లేదని వెల్లడించినట్లు పేర్కొంది. కాగా, టైమ్ మ్యాగజైన్ స్టడీ ప్రకారం.. విమాన ప్రమాదాల్లో వెనుక సీట్లలో కూర్చున్న వారి మరణాల రేటు 32% కాగా, మధ్య సీట్లు 39%, ముందు సీట్లలో ఉన్నవారి మరణాల రేటు 38% వరకు ఉందని తేలింది.