గల్ఫ్ జైలు నుంచి నా కొడుకును విడిపించండి : రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన బాధితుడి తల్లి

జగిత్యాల, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి జైలు పాలైన తన కొడుకు విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని బాధితుడి తల్లి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్ బేగంపేట మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో కార్మికుడి తల్లి ప్రమీల వినతిపత్రం అందజేశారు. 

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచెర్లకు చెందిన సుంకరి శ్రీధర్ పేరుపై ఉన్న పాత మొబైల్ ఫోన్ సిమ్ కార్డును అక్కడ ఎవరో దుర్వినియోగం చేసి రూ. 12,850 దిర్హమ్స్ (రూ.3 లక్షలు) బిల్ చేశారని, దీంతో ఈనెల17న యూఏఈలోని షార్జా ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఆమె వినతిపత్రంలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అడ్వొకేట్ ను నియమించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని, షార్జా జైలు నుంచి విడిపించి దేశానికి రప్పించాలని కోరింది. ఆమె వెంట కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, గల్ఫ్ జేఏసీ నేత చెన్నమనేని శ్రీనివాస రావు ఉన్నారు.