ఫంక్షన్‌ చేద్దామని వెళ్తుంటే.. వ్యాను బోల్తా పడి ఇద్దరు మృతి

 

నిజామాబాద్ రూరల్, వెలుగు ​: దేవుడి సన్నిధిలో శుభకార్యం జరుపుకుందామని సంతోషంగా బయలుదేరిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. బంధుమిత్రులతో  కలిసి కందూరు చేసుకుందామని వెళ్తుండగా వ్యాన్​బోల్తా పడి ఇద్దరు చనిపోయారు. మరో15మంది తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్​రూరల్​ఎస్​హెచ్​వో మహేశ్​కథనం ప్రకారం..నిజామాబాద్​జిల్లా కమ్మర్​పల్లికి చెందిన రెంజర్ల స్వామి తన కొడుకుకు ధోతి కట్టే కార్యక్రమాన్ని వర్ని మండలం బడాపహాడ్​దర్గా వద్ద నిర్వహించాలనుకున్నాడు.

 దీనికోసం కందూరు ఏర్పాటు చేశాడు. కుటుంబసభ్యులు, సమీప బంధువులు సుమారు 35మంది గురువారం రాత్రి 9:30 ప్రాంతంలో వ్యానులో కమ్మర్ పల్లి నుంచి బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా  కొత్తపేట అటవీ ప్రాంతంలోని మల్కాపూర్​సమీపంలో వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెంజర్ల వసంత(30), శ్యాంసుందర్​అక్కడికక్కడే చనిపోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.