మందులు చల్లే డ్రోన్లకు మస్తు గిరాకీ.. ఎకరానికి రూ.500 చొప్పున చార్జ్

  • ఉపాధి పొందుతున్న యువత
  • ఎకరానికి రూ.500 చొప్పున చార్జ్ 
  • రాష్ట్రంలో ప్రస్తుతం 3 వేలకు పైగా కిసాన్ డ్రోన్లు
  • అగ్రికల్చర్ వర్సిటీలో డ్రోన్ పైలెట్ ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కిసాన్ ​డ్రోన్ల వినియోగం పెరుగుతున్నది. ఇప్పుడివి ఊరూరా చక్కర్లు కొడుతున్నాయి. పురుగు మందులు స్ప్రే చేయడం, ఎరువులు, విత్తనాలు చల్లడం, పంట చేన్లలో ఫొటోలు తీసి చీడపీడల్ని గుర్తించడం లాంటి పనులు చేస్తున్నాయి. ఓవైపు కూలీల కొరత, మరోవైపు పెట్టుబడి పెరగడంతో రైతులు కూడా డ్రోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చులో ఎక్కువ పని, అదీ ఎలాంటి శారీరక శ్రమ లేకుండా అయిపోతుండడంతో తమ రోజువారీ వ్యవసాయ పనుల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. మరోవైపు యువత దీన్ని ఉపాధి అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు డ్రోన్ పైలెట్​గా శిక్షణ పొంది, మరికొందరు సొంతంగా డ్రోన్ కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. ఇంకొందరు డ్రోన్లు కొనుగోలు చేసి, రైతులకు అద్దె ప్రాతిపదికన ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఏటేటా డ్రోన్ల వినియోగం పెరుగుతున్నది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 వేలకు పైగా కిసాన్ డ్రోన్లు ఉన్నాయి.


కాగా, కిసాన్ డ్రోన్లు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, పుణె, బెంగళూర్, ముంబై తదితర ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. వీటి వినియోగానికి అవసరమైన శిక్షణను డ్రోన్ల తయారీ సంస్థలే ఇస్తున్నాయి. అలాగే హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్​యూనివర్సిటీలోనూ డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. వారం పది రోజుల్లో డ్రోన్ల వినియోగంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు.  

ఇవీ ఉపయోగాలు.. 

సాధారణంగా ఎకరం వరి పొలంలో చేతిపంపుతో పురుగుమందులు స్ప్రే చేయడానికి రెండు మూడు గంటలు పడుతుంది. దీనికి కూలీని పెట్టుకుంటే రైతు రూ.500 నుంచి రూ.800 వరకు చెల్లించాలి. అదే డ్రోన్ అయితే కేవలం 10 నిమిషాల్లో ఎకరం స్ర్పే చేయొచ్చే. దీనికయ్యే ఖర్చు రూ.500 మాత్రమే. డ్రోన్లతో స్ప్రే చేస్తే 25 శాతం వరకు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. చేతిపంపుతో ఎకరాకు 200 లీటర్ల నీళ్లు అవసరమైతే, డ్రోన్ తో 10 లీటర్లు సరిపోతాయి. చేతి పంపుతో మందులు స్ర్పే చేస్తే రైతులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్రోన్లతో అలాంటి ప్రమాదం లేదు. అలాగే కూలీల సమస్య ఉండదు. ఒకప్పుడు మామిడి, జామ, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్ల తోటలకు మందులు స్ర్పే చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు డ్రోన్లు వచ్చాక ఈజీ అయిపోయింది.

ప్రభుత్వం సబ్సిడీ మీద ఇవ్వాలి.. 

డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాలకు డ్రోన్ల​సేవలు మరింత చేరువకావాలి. ప్రభుత్వం యువతకు డ్రోన్​ పైలెట్​ ట్రైనింగ్​ఇవ్వడంతో పాటు సబ్సిడీ మీద డ్రోన్లు అందిస్తే వాళ్లకు ఉపాధి లభిస్తుంది. అలాగే రైతులకు కూలీల కొరత తీరుతుంది. డ్రోన్లతో మందులు స్ప్రే చేయడంతో పాటు పంటలను ఫొటో తీసి చీడపీడలను గుర్తించవచ్చు.
- కె.రాములు, ఎండీ, తెలంగాణ ఆగ్రోస్​ 

డ్రోన్ల సంఖ్య పెరగాలి.. 

గ్రామాల్లో డ్రోన్ల వాడకం క్రమంగా పెరుగుతున్నది. మేము స్వయంగా చేతి పంపుతో మందులు కొడితే చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. కొన్నిసార్లు ఆ మందుల ప్రభావం మనపై పడి, ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ డ్రోన్లతో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. డ్రోన్లు ఇంకా ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రావాలి. 
- మంగ చేరాలు, రైతు, గూడూరు, మహబూబాబాద్ జిల్లా