మిస్టరీ : దారి కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు!..అసలు వాళ్లకు ఏం జరిగింది?

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను పాలించింది బ్రిటన్‌‌. అందుకోసం చాలా దేశాలకు సముద్ర మార్గాలను కనిపెట్టింది. దాంతో ప్రపంచ అభివృద్ధికి కారణమైంది. కొత్త ప్రాంతాలు, మార్గాలను అన్వేషించాలనే ఉద్దేశంతోనే ఎంతోమంది నావికులను సాహస యాత్రలకు పంపింది. అలా ఇంగ్లాండ్‌‌ నుంచి 129 మందితో బయల్దేరిన రెండు షిప్‌‌లు ఇప్పటికీ తిరిగిరాలేదు. చివరికి ఎంతోమంది వాళ్ల జాడ కోసం వెతికి చివరికి చనిపోయారని తేల్చారు. కానీ.. ఎందుకు చనిపోయారు? యాత్రలో తలెత్తిన సమస్య ఏంటి? అసలు వాళ్లకు ఏం జరిగింది? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకలేదు. 

బ్రిటన్‌‌ నేవీ అధికారి, అన్వేషకుడు సర్ జాన్ ఫ్రాంక్లిన్1845 మే19న హెచ్‌‌.ఎం.ఎస్‌‌. ఎరేబస్‌‌... దాని సిస్టర్ షిప్ హెచ్‌‌.ఎం.ఎస్‌‌. టెర్రర్‌‌ని తీసుకుని ఒక సాహసయాత్రకు బయల్దేరాడు. ఆయనతోపాటు128 మంది సిబ్బంది ఉన్నారు. కెనడాలోని మంచుతో నిండిన ఆర్కిటిక్ ఇన్‌‌లెట్ల గుండా అట్లాంటిక్ నుండి పసిఫిక్‌‌కు చేరుకోవాలనేదే ఆయన లక్ష్యం. అందుకోసం చాలా పొడవుగా ఉండే నార్త్‌‌వెస్ట్ పాసేజ్‌‌ ఒకటి ఉంది. దాన్ని ఎలాగైనా గుర్తించి, దాని గుండా ప్రయాణం చేయాలి అనుకున్నారు.  

ఇలా మొదలైంది

సర్ జాన్ బారో1804లో యునైటెడ్ కింగ్‌‌డమ్ అడ్మిరల్టీకి రెండో సెక్రెటరీగా బాధ్యతలు తీసుకున్నాడు. అట్లాంటిక్ నుండి పసిఫిక్ మహాసముద్రానికి వెళ్లేందుకు సరైన మార్గాలను కనుక్కోవాలని గవర్నమెంట్​కు ప్రతిపాదించాడు. ఆ తర్వాత ఈ మిషన్‌‌ కోసం ఒక గొప్ప అన్వేషకుడిని ఎంచుకున్నాడు. అతనే రాయల్ నేవీ ఆఫీసర్ సర్ జాన్ ఫ్రాంక్లిన్. అంతకుముందే ఇతను కొన్ని సాహసయాత్రల్లో కీలకంగా ఉన్నాడు. 1818లో డొరోథియా, ట్రెంట్ అనే ఓడలతో ప్రయాణించి ఒక అడ్వెంచరస్​ జర్నీలో సెకండ్‌‌ -ఇన్-కమాండ్‌‌గా పనిచేశాడు.1819-–22, 1825-–27ల్లో జరిగిన రెండు యాత్రలకి నాయకత్వం వహించాడు.1845లో తన మరో అడ్వెంచరస్​ జర్నీకి ఎంపికయ్యాడు. అయితే అదే అతని చివరి యాత్ర అవుతుందని, తన చావు ఒక మిస్టరీగా మారుతుందని ఊహించలేకపోయాడు. 

అందరూ నిష్ణాతులే 

ఈ జర్నీకి చాలా రోజుల ముందు నుంచే ఎన్నో ప్లాన్లు రెడీ చేశారు. యూరప్‌‌లో అంతకుముందు నాలుగు శతాబ్దాల్లో చేపట్టిన ఏ మిషన్‌‌లో కూడా ఈ మిషన్‌‌లో ఉన్నంత మంది టాలెంటెడ్‌‌ మెరైన్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ని వాడలేదు. వాళ్లలో చాలామందికి ఉత్తర అమెరికా హై లాటిట్యూడ్స్‌‌ గురించి బాగా తెలుసు. ఐరిష్‌‌ అన్వేషకుడు‌‌, నావికాదళ అధికారి ఫ్రాన్సిస్ క్రోజియర్‌‌ని టెర్రర్‌‌కు, యువ నౌకాదళ అధికారి జేమ్స్ ఫిట్జ్‌‌జేమ్స్‌‌ని ఎరేబస్‌‌కి సెకండ్​ ఇన్-కమాండ్‌‌గా నియమించారు. అంతేకాదు.. ఈ యాత్రలో వాడిన షిప్‌‌లు హెక్లా -క్లాస్ బాంబ్ వెజల్ హెచ్‌‌.ఎం.ఎస్‌‌. ఎరేబస్ (1826),  వెసువియస్ -క్లాస్ బాంబ్ వెసెల్ హె.ఎచ్‌‌.ఎం.ఎస్‌‌. టెర్రర్ (1813)లకు ఐస్‌‌ వాటర్‌‌‌‌లో జర్నీ చేసిన అనుభవం ఉంది. ఈ రెండింటినీ జేమ్స్ క్లార్క్ రాస్ 1841-–44 అంటార్కిటిక్ జర్నీలో ఉపయోగించాడు.

రెండు ఓడల్లో మంచును కత్తిరించే రీన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ విల్లులు ఉన్నాయి. కెనడియన్ ఆర్కిటిక్‌‌లోని కఠినమైన ఉష్ణోగ్రతలను షిప్‌‌లోని సిబ్బంది తట్టుకునేందుకు, వాళ్లను సౌకర్యవంతంగా ఉంచేందుకు ఎరేబస్, టెర్రర్‌‌‌‌లో ఇంటర్నల్‌‌ స్టీమ్‌‌ హీటింగ్‌‌ సిస్టమ్‌‌ ఉంది. ఈ రెండు షిప్‌‌లు ఎంత చల్లని వాతావరణం ఉన్నా తట్టుకోగలవు. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే ఈ మిషన్‌‌ కచ్చితంగా సక్సెస్‌‌ అవుతుందని అంతా నమ్మారు. కానీ.. జర్నీ మొదలయ్యాక రెండు నెలలకు ఈ రెండు షిప్‌‌లు అదృశ్యమయ్యాయి. అవి ఎక్కడికి వెళ్లాయి? వాటిలో ఉన్నవాళ్లు ఏమయ్యారు? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 

ముందుగా స్కాట్‌‌లాండ్‌‌ 

ఫ్రాంక్లిన్ యాత్ర మే 9న ఉదయం కెంట్‌‌లోని గ్రీన్‌‌హిత్ నుండి మొదలైంది. షిప్స్​ మొదట ఉత్తర స్కాట్‌‌లాండ్‌‌లోని స్ట్రోమ్‌‌నెస్, ఓర్క్నీ దీవులకు, ఆ తర్వాత గ్రీన్‌‌ల్యాండ్‌‌కు పయనమయ్యాయి. గ్రీన్‌‌ల్యాండ్‌‌లోని డిస్కో బేకు చేరుకున్న తర్వాత కొన్ని వస్తువులను షిప్స్​లో ఎక్కించారు. టెర్రర్, ఎరేబస్‌‌లో ఉన్న సిబ్బంది చివరిసారిగా తమ కుటుంబీకులకు ఇక్కడి నుంచే లెటర్లు పంపారు.

అంతేకాదు... ఈ స్టాప్‌‌లో ఆగినప్పుడు సిబ్బంది నుంచి ఐదుగురు యాత్ర నుంచి తప్పుకున్నారు. అంటే ఈ షిప్స్​ను ప్రపంచం చివరిసారిగా చూసింది1845 జులై చివరిలోనే. ఆ తర్వాత ఓడ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. దాంతో ఏం జరిగిందో తెలియక కొన్నాళ్లకు సెర్చ్‌‌ ఆపరేషన్స్ మొదలుపెట్టింది అప్పటి గవర్నమెంట్‌‌. 

రెండేండ్ల తరువాత

షిప్స్​ జాడ తెలియకపోవడంతో అనుకోని పరిస్థితుల వల్ల ప్రయాణం కొన్ని రోజులు ఆపి, షిప్స్​ ఎక్కడైనా నిలిపారని అనుకున్నారంతా. ఎందుకంటే.. అలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునేందుకు ఈ షిప్‌‌ల్లో సిబ్బందికి దాదాపు మూడేండ్ల పాటు సరిపడా ఫుడ్‌‌ ఉంది. అందుకే కొన్ని రోజులు పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ.. ఫ్రాంక్లిన్ భార్య లేడీ జేన్ ఫ్రాంక్లిన్, కొంతమంది పార్లమెంటు సభ్యులు, కొన్ని సంస్థలు  కలిసి తప్పిపోయినవాళ్ల కోసం సెర్చ్‌‌ పార్టీలను పంపమని అడ్మిరల్టీపై ఒత్తిడి చేశారు. దాంతో రెండేండ్లు గడిచిన తర్వాత గవర్నమెంట్‌‌.... వాళ్లకు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని తేల్చేసింది. 1848లో  మొదటి ఓవర్‌‌ల్యాండ్ సెర్చ్ పార్టీని పంపింది. కానీ.. ఫలితం దక్కలేదు.

దాంతో గవర్నమెంట్ ఆ షిప్స్​ కనిపెట్టిన వాళ్లకు 20 వేల యూరోలు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత1849- –1859ల మధ్యకాలంలో దాదాపు32 వేర్వేరు టీంలు షిప్స్​ వెతికేందుకు ప్రయత్నించాయి. అందులో భాగంగానే 1845-–46 మధ్య  శీతాకాలంలో ఒక చోట ఏర్పాటు చేసిన క్యాంప్‌‌ ఆనవాళ్లు దొరికాయి. ఆ క్యాంప్‌‌ పక్కనే ఫ్రాంక్లిన్ యాత్రలో ముగ్గురు సభ్యుల సమాధులు కనుగొన్నారు. అవి పెట్టీ ఆఫీసర్‌‌‌‌ జాన్ టోరింగ్టన్, రాయల్ మెరైన్ ప్రైవేట్ విలియం బ్రెయిన్, ఏబుల్ సీమాన్ జాన్ హార్ట్‌‌నెల్‌‌ సమాధులుగా తేల్చారు. కానీ.. అక్కడ దొరికిన ఆధారాలతో అసలు ఫ్రాంక్లిన్ యాత్రలో ఏం జరిగింది? మిగతా వాళ్లంతా ఏమయ్యారు? అనేది మాత్రం తెలియలేదు. 

ఆకలితో చనిపోయారా? 

యూరోపియన్, అమెరికన్ సెర్చ్ పార్టీలు తప్పిపోయిన బ్రిటన్స్‌‌ని గుర్తించడానికి 1850 తర్వాత వెళ్లి, అనేక ప్రయత్నాలు చేశాయి. సాయం కోసం ఆ క్యాంప్‌‌కు దగ్గర్లో ఉండే స్థానిక ప్రజల్ని కలిశారు. వాళ్లలో కొందరి దగ్గర ఫ్రాంక్లిన్ యాత్ర సభ్యులకు చెందిన కొన్ని వస్తువులు ఉన్నాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ‘అవి ఎక్కడివి?’ అని ప్రశ్నిస్తే.. రకరకాల సమాధానాలు చెప్పారు వాళ్లు. తీరం వెంబడి ఆకలితో చనిపోతున్న కొందరు విదేశీయులు ఇచ్చారని చెప్పారు. ఇంకొందరు వాళ్లకు దొరికాయని చెప్పారు. దాంతో1854 మార్చి 31న బ్రిటన్ అధికారికంగా టెర్రర్, ఎరేబస్‌‌లో వెళ్లినవాళ్లంతా చనిపోయారని ప్రకటించింది. ఇక సెర్చ్‌‌ పార్టీలను పంపకూడదని నిర్ణయించుకుంది.

లేడీ ఫ్రాంక్లిన్ ప్రయత్నాలు

బ్రిటన్ అధికారిక నిర్ణయం తీసుకున్నప్పటికీ, లేడీ ఫ్రాంక్లిన్ వాళ్ల ఆచూకీ ఎలాగైనా కనిపెట్టాలనే ఆలోచనతో ఒక ప్రైవేట్ సెర్చ్ పార్టీని పంపేందుకు కావాల్సిన డబ్బు సేకరించింది. ఆమె నియమించిన టీం1857లో ఇంగ్లాండ్‌‌ నుంచి బయల్దేరింది. 1859లో ఈ టీం చాలా ఆధారాలు కనిపెట్టింది. కింగ్ విలియం ఐల్యాండ్‌‌లో ఒక గుట్ట దగ్గర్లో క్రోజియర్, ఫిట్జ్‌‌జేమ్స్‌‌లు పంపిన రెండు మెసేజ్‌‌లు ఉన్న లెటర్లు దొరికాయి. వాటిలో మొదటిది1847 మే28 న రాశారు. అందులో ‘‘1846-– 47 ల్లో చలికాలంలో బీచీ ద్వీపంలో షిప్స్​ ఉన్నాయి. ఇక్కడ అంతా బాగానే ఉంది.

సర్ జాన్ ఫ్రాంక్లిన్ ఈ సాహసయాత్రకు నాయకత్వం వహించాడు”  అని ఉంది. రెండోది1848 ఏప్రిల్ 25 నాటిది. ఈ మెసేజ్‌‌లో చాలా భయంకరమైన పరిస్థితుల గురించి రాశారు. ‘‘ఫ్రాంక్లిన్‌‌తో సహా యాత్రలోని 24 మంది సభ్యులు1847 జూన్11 నాటికి చనిపోయారు. మిగతా 105 మంది క్రోజియర్ ఆధ్వర్యంలో దక్షిణాన బ్యాక్ రివర్ వైపు వెళ్తున్నారు” అని రాసి ఉంది. అక్కడే ఫ్రాంక్లిన్ యాత్రలో సభ్యుడిగా ఉన్న మరో వ్యక్తి అస్థిపంజరం కూడా దొరికింది. 

ఇప్పటికీ తెలియలేదు

ఈ టీంలో సభ్యులు ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారనేది ఇప్పటికీ తెలియలేదు. రీసెర్చ్​లు మాత్రం రకరకాల కారణాలు చూపిస్తున్నాయి. చాలా ఏళ్ల పాటు ఈ యాత్రకు సంబంధించిన మిస్టరీని ఛేదించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వాటిలో చాలా ఆధారాలు దొరికాయి. స్థానిక ప్రజలు చెప్పిన ప్రకారం.. వాళ్లంతా ఆకలి, అనారోగ్యంతో చనిపోయారు. కానీ..1980, 1990ల్లో బీచీ ఐల్యాండ్‌‌, కింగ్ విలియం ఐల్యాండ్‌‌ల దగ్గర పురావస్తు తవ్వకాలు చేశారు. ఆ తవ్వకాలు, పరిశోధనల్లో చాలా విషయాలు బయటపడ్డాయి. 

నరమాంస భక్షకుల.. 

కొంతమంది అవశేషాల్లో ఎముకలపై నరమాంస భక్షకులు తిన్న ఆధారాలు కనిపించాయి. కాబట్టి ఆహారం కోసం సిబ్బంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతున్నప్పుడు నరమాంస భక్షకులకు చిక్కి ఉంటారు అనుకున్నారు. చనిపోయిన వాళ్లలో చాలామందికి విటమిన్-–సి లోపం ఉన్నట్టు నిర్ధారించారు. దీనివల్ల కూడా చనిపోయి ఉండొచ్చని కొందరు అనుకున్నారు. 

లెడ్‌‌ వల్ల!

కొందరి శరీరాల్లో లెడ్‌‌ ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఈ లెడ్‌‌ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే.. షిప్‌‌లో తీసుకెళ్లడానికి నిల్వ ఉండే ఫుడ్‌‌ని ఇవ్వాలని ఫ్రాంక్లిన్ బయల్దేరే ఏడు వారాల ముందు ‘గోల్డ్‌‌నర్’ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. అయితే.. ఎనిమిదివేల టిన్‌‌ల ఫుడ్‌‌ని రెడీ చేయాల్సి ఉన్నా టైం ఏడు వారాలు మాత్రమే ఉంది. దాంతో క్వాలిటీ చెక్‌‌ సరిగ్గా చేయక ఫుడ్‌‌ టిన్స్‌‌లో లెడ్‌‌ ఉండి ఉంటుందని చాలామంది వాదించారు.

దానివల్లే వాళ్లంతా  అనారోగ్యంతో చనిపోయారు అన్నారు. కానీ.. కొందరేమో ఈ సమస్య టిన్డ్ ఫుడ్ వల్ల వచ్చింది కాదు. షిప్‌‌లోని వాటర్ డిస్టిలేషన్‌‌ సిస్టమ్స్‌‌ వల్లే జరిగింది అన్నారు. కొన్ని అవశేషాల్లో న్యుమోనియా, క్షయ, పాట్స్ వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లు కూడా గుర్తించారు. ఇన్ని కారణాల్లో దేనివల్ల చనిపోయారన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే!

మరి ఎరేబస్‌‌, టెర్రర్‌‌‌‌ ఎక్కడ? 

మనుషులు కనిపించకుండా పోవడమే కాదు.. వాళ్లను తీసుకెళ్లిన షిప్స్​ కూడా మాయమయ్యాయి. వెతికేందుకు వెళ్లిన పార్టీలకు కనీసం వాటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. కానీ.. అవి మాయమై దాదాపు170 ఏండ్లు అయ్యాక వాటి ఆనవాళ్లను కనుగొన్నారు. 2014  సెప్టెంబర్‌‌‌‌1న నునావట్ కింగ్ విలియం ఐల్యాండ్‌‌కు దగ్గర్లో క్వీన్ మౌడ్ గల్ఫ్‌‌లోని హాట్ ఐల్యాండ్‌‌లో రాయల్‌‌ నేవీ షిప్‌‌కు చెందిన రెండు ముక్కలు దొరికాయి.

కొన్ని రోజుల తర్వాత సెప్టెంబరు7న ఆ ప్రాంతంలో పనిచేస్తున్న టీం క్వీన్ మౌడ్ గల్ఫ్ తూర్పు భాగంలో దాదాపు 36 అడుగుల లోతు నీళ్లలో ఎరేబస్‌‌ను కనుగొన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత రెండేండ్లకు 2016 సెప్టెంబర్ 16న ఆర్కిటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ‘టెర్రర్’ని సముద్రం అడుగున గుర్తించినట్టు ప్రకటించింది. ఇది కింగ్ విలియం ద్వీపానికి దక్షిణ ప్రాంతం వైపు దొరికింది.