థీమ్ పార్కులొస్తున్నయ్ !

  •   సిటీలో ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు
  •     మల్లాపూర్ లో మోడల్ పార్క్ నిర్మాణం 
  •     ప్రజల డిమాండ్ ను బట్టి  ఏర్పాటుకు రెడీ
  •     గ్రీనరీ నిధులతో నిర్మిస్తామంటున్న అధికారులు  
  •       ఇయ్యాల్టి నుంచి స్వచ్ఛదనం- పచ్చదనం

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్ సిటీలోని పార్కులను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కలర్ థీమ్ పార్కులను ఇంద్రధనుస్సు మాదిరిగా ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా మల్లాపూర్ లోని పార్కుని డెవలప్ చేసింది. ఖాళీ స్థలం ఉండి స్థానికులు డిమాండ్ చేస్తే.. పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. 

గ్రీనరీ బడ్జెట్ ని వందశాతం వినియోగించుకుంటామని పేర్కొంటున్నారు. కలర్ థీమ్ లో ఒక్కో పార్కు డెవలప్ కు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఏర్పాటైన పార్కుల్లోనూ అన్నిరకాల పూల మొక్కలను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీలు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. 

ఖాళీ స్థలాలను క్లీన్ చేసి..

కాలనీల్లో.. బస్తీల్లో గుట్టలు, ముళ్ల పొదలు ఉన్న  ఖాళీ స్థలాలను పూర్తిగా క్లీన్ చేసి కలర్ థీమ్ పార్కు నిర్మిస్తారు.  హెచ్ఎండీఏ నుంచి సిటీ డెవలప్ మెంట్ కు ప్రతి జోన్ కు రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.60 కోట్లు నిధులు వచ్చాయి. థీమ్ పార్కులను డెవలప్ చేసేందుకు ఆ నిధులను వాడుకునే చాన్స్ ఉంది. మొత్తానికి సిటీని పచ్చగా చేసేందుకు జీహెచ్ఎంసీ  కృషి చేస్తుంది. ఇప్పటికే  వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటుతుంది. సోమవారం నుంచి  స్వచ్ఛదనం-– పచ్చదనం ప్రోగ్రామ్ ను ప్రారంభించనుంది. 

82 లక్షల చ.మీ మాత్రమే తక్కువ

వనమహోత్సవంలో 50 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ఇప్పటికే 10 లక్షలకుపైగా నాటింది. కొద్దిరోజుల్లో పూర్తి టార్గెట్ ని పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. అయితే.. సిటీలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) నిబంధనల మేరకు ఒక మనిషికి 9 చదరపు మీటర్ల గ్రీనరీ ఉండాలి.  ప్రస్తుతం 8.18 చ.మీ మాత్రమే ఉన్నట్లు జీహెచ్ఎంసీ లెక్కల ద్వారా తెలుస్తుంది. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ సిటీలో 69 లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం కోటి మందికి చేరారు. వీరిలో ఒక్కొక్కరికి 8.18 చ.మీ చొప్పున గ్రీనరీ ఉండగా,  ఇది మొత్తం 8.18. కోట్ల చ.మీ పచ్చదనం ప్రస్తుతం ఉంది. అంటే  ఉండాల్సిన దాంట్లో  82లక్షల చ.మీ మాత్రమే తక్కువగా ఉంది.  ప్రస్తుతం గ్రీన్ సిటీగానే ఉంది.  మిగిలిన గ్రీనరీని కూడా పూర్తి చేసే పనిలో జీహెచ్ఎంసీ ఉంది. 

ఇతర మెట్రోపాలిటన్ సిటీలో పోల్చి చూస్తే..

ఈసారి వనమహోత్సంతో పాటు ఇతర కార్యక్రమాలు చేపట్టి పచ్చదనాన్ని పెంచేందుకు బల్దియా ప్రయత్నాలు చేస్తుంది. జీహెచ్ఎంసీకి గ్రీనరీలో  వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు –2022 కూడా లభించింది. ప్రస్తుతం గ్రీనరీలో సిటీ సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. డబ్ల్యూహెచ్ వో నిబంధనల మేరకు అటవీ ప్రాంతం 33 శాతం ఉండాలి. ప్రస్తుతం 12.8 శాతం ఫారెస్ట్ ఉంది. ఇలా చూస్తే గ్రామాల్లో కూడా 33 శాతం ఉండే చాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇతర మెట్రో పాలిటన్ సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లో ఫారెస్ట్ పర్వాలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ సిటీలో ఉన్న అటవీ ప్రాంతాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.