సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల కాలపరిమితి రెండేళ్లే

  • కాలపరిమితిపై ఉత్కంఠకు తెరదించిన సంస్థ
  •  సర్టిఫికెట్లు అందుకున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ


కోల్​బెల్ట్/గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాల పరిమితిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రెండేండ్ల అధికారంతో సింగరేణి సంస్థ సోమవారం గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలకు ధ్రువీకరణ పత్రాలు అందజేసింది.  ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలైనా సర్టిఫికెట్ల కోసం గెలిచిన సంఘాలు ఎదురు చూస్తున్నాయి. చివరకు కార్మిక సంఘాలు, కార్మికుల నుంచి ఒత్తడి రావడంతో శనివారం గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగరేణిలో ఏఐటీయూసీ (సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్) గుర్తింపు కార్మిక సంఘంగా ఆ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్,  ఐఎన్టీయూసీ(సింగరేణి కోల్​మైన్స్ లేబర్ యూనియన్​) సింగరేణి ప్రాతినిధ్య సంఘంగా సెక్రటరీ జనరల్​బి.జనక్​ప్రసాద్​, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, జనరల్​సెక్రటరీ త్యాగరాజన్​ లకు సింగరేణి  సీఎండీ బలరాంనాయక్​, డీవైసీఎల్​సీ డి.శ్రీనివాస్ సర్టిఫికెట్లు అందజేశారు.  

అనంతరం సింగరేణి సీఎండీ బలరాంనాయక్​ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమంతో పాటు ఉత్పత్తి, ఉత్పాదకత మీద దృష్టి సారించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలను కోరారు. కార్మిక నేతలకు త్వరలోనే శిక్షణ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్(కో – ఆర్డినేషన్) ఎస్ డీఎం. సుభాని, జీఎం(ఐఆర్, పీఎం) కవితా నాయుడు పాల్గొన్నారు. 

నాలుగేండ్ల కోసం న్యాయ పోరాటం.. కూనంనేని 

సింగరేణి కార్మికుల పెండింగ్​ సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం గుర్తింపు సంఘంతో రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహించాలని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.  ఏఐటీయూసీ గుర్తింపు పత్రం అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.  గుర్తింపు కాలపరిమితి నాలుగేండ్ల కోసం  ఏఐటీయూసీ న్యాయ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. కార్మిక సమస్యల ఎప్పటికప్పుడు యాజమాన్యంతో చర్చిస్తూ పరిష్కారానికి కృషి చేయనున్నట్లు సింగరేణి ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్,​ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్​ బి.జనక్​ప్రసాద్​ తెలిపారు. కంపెనీ విస్తరణకు, అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.