సర్వేలో సమస్తం కులగణనకు రాష్ట్ర సర్కారు రెడీ

  • కులం, ఉప కులం మొదలుకొని ఆస్తిపాస్తులు, అప్పుల దాకా 54 ప్రశ్నలతో క్వశ్చనీర్
  • కుటుంబ సభ్యులతోపాటు పశుసంపద సమాచారం సేకరణ
  • పేరు, వయసు, చదువు, ఉద్యోగం లాంటి వివరాలు అందులోనే
  • ఫ్యామిలీ ఇన్​కం, భూమి, ఇల్లు,  బైకులు, కార్ల లాంటి డేటా కూడా
  • వచ్చే నెల 6 నుంచి సర్వే మొదలు..  15- నుంచి 20 రోజుల్లో పూర్తి!
  • కులగణన ఫారంపై కుటుంబ యజమాని సంతకం తప్పనిసరి

హైదరాబాద్​, వెలుగు : కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. వచ్చే నెల 6 నుంచి దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.  15 నుంచి 20 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయనుంది. ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే’ పేరుతో చేపట్టే  కులగణన కోసం మొత్తం 54 ప్రశ్నలతో క్వశ్చనీర్​ను ప్రభుత్వం రూపొందించింది. దీని సాయంతోనే ఇంటింటికి వెళ్లి వివరాలను సిబ్బంది సేకరించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కుటుంబసభ్యుల వ్యక్తిగత వివరాలతో పాటు వారి కులం, ఉప కులం

చదువు, చేస్తున్న ఉద్యోగం, వస్తున్న ఆదాయం, చేసిన అప్పులు, ఉంటున్న ఇల్లు, పొలం, బైకో, కారో ఉంటే ఆ వివరాలు.. ఇట్ల ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరిస్తారు. కుటుంబ రాజకీయ ప్రస్తానం గురించీ ఆరా తీయనున్నారు. కుటుంబంలో ఎవరైనా  ప్రజాప్రతినిధిగా పనిచేశారా? ఎంత కాలం చేశారు ? నామినేటేడ్​ పదవులు ఏమైనా పొందారా? లాంటి వివరాలు కూడా తెలుసుకోనున్నారు. ఈ మేరకు ప్లానింగ్​ డిపార్ట్​మెంట్​ క్వశ్చనీర్​ రెడీ చేసింది.

సర్వేలో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎన్యుమరేటర్లపైన సూపర్​వైజర్లను నియమించారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాల నుంచి వచ్చిన సూపర్​వైజర్లకు మాస్టర్​ ట్రైనింగ్ ​పూర్తిచేశారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎంసీహెచ్​ఆర్డీ  సెంటర్​ నుంచి సీఎస్​ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించి, కులగణనపై దిశానిర్దేశం చేశారు. 

ప్రత్యేక కోడ్​

సర్వేలో ఇంటి నంబర్లకు ప్రత్యేక కోడ్‌ కేటాయించి, పూర్తి సమాచారాన్ని నమోదు చేసేలా ఫారంను రెడీ చేశారు.  మొదటి పేజీలో జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ పేరు, ఆవాసం పేరు ఉంటుంది. వార్డు నెంబర్​, ఇంటి నంబర్, వీధి పేరు ఉంటాయి. ఆ తర్వాత పార్ట్​1​లో కుటుంబ సభ్యుల సంఖ్య సేకరిస్తారు. యజమాని, కుటుంబ సభ్యులు, యజమానితో వారికి సంబంధం, జెండర్, మతం, కులం/సామాజిక వర్గం, ఉప కులం, కులానికి సంబంధించిన ఇతర పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్‌ నంబర్‌ సేకరిస్తారు.

కంటిన్యూషన్​లో ఓటర్ ఐడీ కార్డు,  దివ్యాంగులైతే అందుకు సంబంధించిన పూర్తివివరాలు, మ్యారీడ్, అన్ మ్యారిడ్, వివాహకాలం నాటికి వయసు, ఆరేండ్ల వయసులోపు వారు స్కూల్​లో చేరారా? లేదా? ఏ స్కూల్, విద్యార్హతలు, 6–16 ఏండ్ల మధ్య బడి మానే స్తే ఆ సమయానికి చదివిన తరగతి, బడి మానేయటానికి కారణాలు, 17–40 ఏండ్లలోపు ఎవరైనా విద్యను కొనసాగించకపోవడానికి గల కారణాలు, నిరాక్షరాస్యులైతే ఆ కారణాలనూ అడిగి తీసుకుంటారు. 

కులమేంటి? వృత్తి ఏంటి? 

సర్వేలో కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. కులం, ఉప కులం వివరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందినవారైతే కుల ధ్రువీకరణ పత్రం పొందారా? లేదా?  సంచార తెగకు చెందినవారా? పాక్షిక సంచార తెగకు చెందిన వారా? రిజర్వేషన్ పొందుతున్నారా? ఆయా కుటుంబాలకు రిజర్వేషన్ల వల్ల వచ్చిన విద్య, ఉద్యోగ ప్రయోజనాలేంటి? ఒకవేళ రాజకీయ నేపథ్యం ఉంటే ఆ వివరాలు రికార్డు చేస్తారు. దీంతో పాటు  కుటుంబ సభ్యుల ఉద్యోగ, ఉపాధి వివరాలు, సంప్రదాయ కులవృత్తులు

ఆదాయ వివరాలు అడిగి తెలుసుకుంటారు. కూలి/ కులవృత్తి/ ఉద్యోగం/వ్యవసాయం/ వ్యాపారంలో ఏది చేస్తున్నారు.. వాటి ద్వారా వచ్చే ఆదాయం ఎంత?  ఒకవేళ కులవృత్తిని కొనసాగిస్తుంటే వచ్చే ఆదాయం ఎలా ఉంది? ఏమైనా వ్యాధులబారినపడ్డారా? అనే ప్రశ్నలకు సమాధానం రాబడుతారు. వార్షికాదాయం, ఒకవేళ ఆదాయపు పన్ను కడ్తే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా ఉందా? లేదా? లాంటి వివరాలనూ నమోదు చేస్తారు. 

ఎంత భూమి ఉంది ? ఎట్లొచ్చింది ?

ఇక పార్ట్​ 2లో కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎలా వచ్చిందనే వివరాలు నమోదు చేయనున్నారు. దీని ప్రకారం కుటుంబంలో ఎవరెవరి పేర ఎంత భూమి ఉంది? అందులో తరి, మెట్ట ఎంత అనే వివరాలు నమోదుచేస్తారు. ధరణి పాస్‌బుక్‌ ఉందా? ఉంటే  పాస్‌బుక్‌ నంబర్, భూమిరకం వివరాలు, తర్వాత ఆ భూమి వారసత్వమా? సొంతంగా కొన్న దా? బహుమతిగా వచ్చిందా? అసైన్డ్‌ భూమా? అట వీ హక్కుల ద్వారా పొందినదా? అనే వివరాలు,  అలాగే భూమికి ప్రధాన నీటి వనరు, ఎన్ని పంటలు పండుతాయి, రుణాలు తీసుకున్నారా? ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు?

ఎక్కడి నుంచి తీసుకున్నారు? వ్యవసాయ అనుబంధంగా ఏదైనా పనిచేస్తున్నారా? అనేవన్నీ నమోదు చేస్తారు. కుటుంబానికి చెందిన పశుసంపద వివరాలను కూడా సేకరిస్తారు. ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతులు, పందులు ఇతరత్రా పెంపుడు జంతువుల లెక్కలు  కూడా తీసుకుంటారు. వాటినుంచి వచ్చే ఆదాయం, ప్రభుత్వం సహకారంపై ఆరా తీస్తారు. కుటుంబ ఆస్తులకు సం బంధించి ఇంట్లో అందరి స్థిర, చరాస్తుల మొత్తం వివరా లు, వాహనాలు,  ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, ఇంటిరకం, మరుగుదొడ్డి, వంట కోసం ఉపయోగించే ఇంధనం, తాగునీటి  విద్యుత్‌ సదుపాయం వంటి వివరాలను సమగ్రంగా సేకరిస్తారు.

ఒకరోజు ముందే చెప్పి వస్తరు

రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా కుటుంబాలు ఉండగా.. వివరాల సేకరణకు మొత్తం 80 వేల సిబ్బందిని ఎన్యుమరేటర్లుగా నియమించారు. ఒక్కో ఎన్యుమరేటర్​ రోజూ కనీసం 15 ఇండ్ల నుంచి వివరాలు సేకరిస్తారు. ఏరోజు ఏయే ఇండ్లలో సర్వే నిర్వహిస్తారనే విషయాన్ని ఒకరోజు ముందే తెలియజేస్తారు. ఒకసారి కులగణన ఫారం నింపిన తర్వాత కుటుంబ యాజమాని పేరు, సంతకం తీసుకుంటారు. దాని కిందే ఎన్యుమరేటర్​ పేరు, సంతకం, సూపర్​వైజర్​ పేరు, సంతకం (తేదీతో పాటు) చేయాలని నిబంధన విధించారు.