ఇవాళ చివరి విడత రుణమాఫీ.. రూ.2 లక్షల వరకు క్రాప్ లోన్ల మాఫీకి సర్కారు ఏర్పాట్లు

  • వైరా బహిరంగ సభలో నిధులు రిలీజ్​ చేయనున్న సీఎం రేవంత్
  • ఇప్పటికే 17.55 లక్షల మంది రైతులకు రూ.12,224 కోట్లు మాఫీ
  • ప్రకటించినట్టే పంద్రాగస్టు రోజే రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించినట్టే పంద్రాగస్టు రోజే చరిత్రాత్మక రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం కానున్నది. రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే రెండు విడతలుగా రూ.లక్షన్నర వరకు ఉన్న క్రాప్​ లోన్లను మాఫీ చేయగా.. మూడో విడతగా గురువారం రెండు లక్షల వరకున్న  రైతుల క్రాప్​ లోన్​ అకౌంట్​లోకి నిధులు జమ చేయనున్నది. 

ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్​రెడ్డి,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు బటన్​ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. ఆ వెంటనే క్రాప్​లోన్లు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.  రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు.  పంద్రాగస్టు లోగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని  చెప్పారు. ఇచ్చిన మాట నిలపుకొనేందుకు ఇప్పటికే  ఆ మేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది. గత నెల18న రుణమాఫీ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ కింద 17.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.  

ఈ క్రమంలోనే తాజాగా, మూడో విడత రుణమాఫీ చేయనున్నది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా రైతులను సంపూర్ణ రుణవిముక్తి చేయాలనే ప్రక్రియలో భాగంగా  రూ.2 లక్షల కంటే ఎక్కువ క్రాప్​ లోన్లు తీసుకున్న రైతులు..అదనంగా ఎంతైతే లోన్లు ఉంటాయో ఆ మొత్తాన్ని ముందుగా బ్యాంకులకు చెల్లిస్తేనే వారికి  రుణమాఫీ వర్తింపజేయనున్నారు.  ఇప్పటికే రేషన్​ కార్డులు లేని వారు, బ్యాంకు అకౌంట్లలో సమస్యలు, ఆధార్​లో పేర్లు తప్పులు.. ఇలా  వివిధ రకాల కారణాలతో మాఫీ కాని వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని, తప్పులు సరి చేసి,  రుణాలను మాఫీ చేయనున్నారు.