కమర్షియల్ ట్యాక్స్​లో ఏం జరుగుతోంది?: సీఎం రేవంత్ రెడ్డి

  • అక్రమాలపై రిపోర్ట్​ ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం
  • రూ.1,200  కోట్ల ఇన్​పుట్ ట్యాక్స్ క్రెడిట్ పక్కదారి
  • 2,900 అనుమానాస్పద జీఎస్టీ రిజిస్ట్రేషన్లు
  • వీటిలో 700కుపైగా నకిలీ రిజిస్ట్రేషన్ల గుర్తింపు 
  • 11 ప్రైవేట్ సంస్థలకు రూ.400 కోట్లు లబ్ధి
  • ఇప్పటికే మాజీ సీఎస్​పై కేసు నమోదు 
  • పూర్తి స్థాయి రిపోర్ట్​ రెడీ చేస్తున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు:  వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన అక్రమాలు, మాజీ సీఎస్​పై కేసు నమోదు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. శాఖకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రస్తుతం సీఎం దగ్గరనే ఉన్నది. పైగా ప్రభుత్వానికి  ప్రధాన ఆదాయ వనరు కావడం, పెద్ద వ్యాపార సంస్థలకు లింక్ ఉండటంతో ఈ డిపార్ట్​మెంట్​ను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అయితే, కమర్షియల్ ట్యాక్స్​లో ఇదివరకు నకిలీ జీఎస్టీ రిజిస్ర్టేషన్లు చేసి ఇన్​పుట్​ట్యాక్స్ క్రెడిట్ పేరుతో రూ. వేల కోట్లు కొల్లగొట్టినట్లు నిర్ధారించారు. ఆ సొమ్మును రికవరీ చేసే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో పాటు జీఎస్టీకి సంబంధించిన సాఫ్ట్ వేర్​లో మార్పులు చేయడంతో ఏకంగా 11 ప్రైవేట్ సంస్థలకు రూ.400 కోట్ల మేర లబ్ధి జరిగిందన్న ఆరోపణలు రాగా.. సీసీఎస్​లో మాజీ సీఎస్ సోమేశ్ ​ కుమార్​పై కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారంపైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్​గా ఉన్నారు. ఇందులో గత ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఏయే వ్యాపార సంస్థలకు మేలు జరిగింది? అవి ఎవరికి సంబంధించినవనే దానిపై లోతుగా ఎంక్వైరీ చేయిస్తున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ లాంటి కొన్ని ప్రభుత్వ సంస్థల నుంచి కూడా ట్యాక్స్ రాకపోవడంపైనా దృష్టి పెడుతున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్​లో వ్యాట్ వసూలు చేయకుండా అక్రమాలకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పుడు ఈ రెండు శాఖలనూ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ చూశారు. దీంతో ఎక్కడ తప్పిదం జరిగిందనే దానిపై అన్ని రకాలుగా లెక్కలు  తీస్తున్నారు. జీఎస్టీలో కేంద్రానికీ వాటా ఉన్నందున.. ఈ వ్యవహారంపై కేంద్రం నుంచి కూడా ప్రభుత్వానికి లెటర్ అందినట్లు తెలుస్తోంది.  ​ 

డబ్బుల రికవరీకి కసరత్తు  

జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్లతో భారీ ఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొమ్మును కొందరు అక్రమార్కులు దోచేశారు. జీఎస్టీ నెట్‌‌వర్క్‌‌, రాష్ట్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా దేశవ్యాప్తంగా లక్షకుపైగా అనుమానాస్పద జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లుగా గుర్తించారు. వీటి ద్వారా ఇన్‌‌పుట్‌‌ట్యాక్స్ క్రెడిట్ పేరుతో అక్రమార్కులు రూ. వేల కోట్లు పొందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. తెలంగాణలో దాదాపు 2,900 రిజిస్ట్రేషన్లు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత వీటిలో 700కుపైగా నకిలీ రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు తేల్చారు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చూపిన అడ్రస్‌‌లో సంస్థలు లేకపోవడం.. ఒకవేళ ఉన్నా వ్యాపార లావాదేవీలు చేయకుండానే కాగితాల మీదనే వ్యాపారం చేసినట్లు చూపినట్టు గుర్తించారు. దీంతో రిటర్న్‌‌లు వేసి.. ఐటీసీ తీసుకున్నట్టు తేల్చారు. ఈ బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు రూ.1,200 కోట్లు దోచేసినట్టు నిర్ధారించారు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి అందాల్సిన సొమ్మును ప్రైవేట్ సంస్థలు దోచేశాయని తేలడంతో ఆ డబ్బును ఎలా రికవరీ చేయాలనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

సాఫ్ట్ వేర్​ను మార్చి అక్రమాలు   

కమర్షియల్​ట్యాక్స్​కు సాంకేతిక సాయం అందించే సర్వీస్ ప్రొవైడర్‌‌గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్ అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం, సర్వీస్ ప్రొవైడర్ చేయాల్సిన పని. పన్ను చెల్లింపుదారుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన ‘స్క్రూటినీ మాడ్యూల్’ గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్‌‌లీప్‌‌ టెక్నాలజీస్ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ గుర్తించలేదు. కావాలనే కొందరి అక్రమాలు గుర్తించకుండా సాఫ్ట్ వేర్​లో మార్పులు చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. అప్పటి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్.వి. కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్ మౌఖిక ఆదేశాలతోనే అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్‌‌వేర్​లో మార్పులు చేసినట్లు శాఖాపరమైన ఎంక్వైరీలో తేల్చారు.

మాజీ సీఎస్ వెనక ఎవరున్నరు? 

వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌‌ సీసీఎస్ పోలీసులు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ మీద ఇదివరకే కేసు నమోదు చేశారు. 11 ప్రైవేటు సంస్థలు సుమారు రూ. 400 కోట్లు ఎగవేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘స్పెషల్ ఇనీషియేటివ్స్’ పేరిట ఏర్పాటైన వాట్సాప్ గ్రూప్ లో జరిగిన చాట్ లపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ప్రభుత్వం నుంచి లెటర్ వెళ్లింది. ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే మాజీ సీఎస్ వెనక ఎవరున్నారనే విషయం తెలుస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఎవరెవరికి ఏ మేరకు లబ్ధి జరిగింది? ఇంకా ఏమైనా అక్రమాలు జరిగాయా?  అనే దానిపైనా వివరాలు తెలుస్తాయని అనుకుంటున్నది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది. బేవరేజెస్ కార్పొరేషన్ లోనూ రూ.1000 కోట్లు అక్రమార్కుల పాలైందని ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు.