తాగుడుకు పైసలియ్యలేదని తండ్రిని కొట్టి చంపిన కొడుకు

మణుగూరు, వెలుగు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో తండ్రిని కొడుకు చంపిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. మణుగూరు సీఐ సతీశ్​కుమార్ తెలిపిన ప్రకారం.. మణుగూరు మండలం పగిడేరులోని ఎస్టీ కాలనీకి చెందిన కొర్సా సూర్యనారాయణ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. మంగళవారం తండ్రి బుచ్చయ్య (80) సమీపంలోని పొలంలో పని చేస్తుండగా అక్కడికి వెళ్లాడు. తండ్రిని మద్యానికి డబ్బులు ఇవ్వమని సూర్యనారాయణ అడగగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో కొడుకు కర్రతో తండ్రి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బుచ్చయ్య భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.