బాలసదన్ చిన్నారులకు ఆరోగ్య శ్రీ కార్డులు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకునే అర్హత

బాలసదన్ చిన్నారులకు  ఆరోగ్య శ్రీ కార్డులు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకునే అర్హత
  • ఖమ్మం కలెక్టర్ అనుదీప్​ దురిశెట్టి చొరవతో ప్రత్యేక ఏర్పాట్లు
  • ప్రతి ఒక్కరికీ సరైన ఐడీ ప్రూఫ్​ లు సిద్ధం
  • ఇప్పటికే 70 మందికి కార్డులు అప్రూవల్ 
  • త్వరలోనే అందరికీ అందించేందుకు చర్యలు 

వాళ్లంతా విధి వంచితులు. తల్లిదండ్రులు వదిలేయడంతో అనాథలుగా మారిన వారు కొందరైతే.. అందరూ ఉన్నా వారి ప్రేమకు నోచుకోలేకపోయిన వారు మరికొందరు. అనుకోని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కేసుల్లో చిక్కుకోవడంతో ఒంటరిగా మిగిలిన వారు ఇంకొందరు. లైంగిక వేధింపులతో బాధితులుగా మారిన వారు కూడా ఇక్కడ ఉంటారు. అలాంటి వారికి ఆరోగ్యపరంగా రక్షణ కల్పించేందుకు ఖమ్మం కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక ఆలోచన చేశారు. వాళ్లందరికీ ఐడీ ప్రూఫ్​ లతో పాటు ఆరోగ్య శ్రీ కార్డులను అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలోని బాల సదన్​ లో ఉన్న పిల్లల ఆరోగ్యా న్ని కాపాడేందుకు కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వాళ్లందరికీ ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెల రోజులకు పైగా వివిధ శాఖల అధికారులను ఇన్వాల్వ్ చేసి, ఆరోగ్య శ్రీ కార్డులు అందేలా  చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి బర్త్ సర్టిఫికెట్లు లేకపోవడం, ఆధార్​ కార్డు లేకపోవడంతో ముందుగా అందరికీ సరైన ఐడీ ప్రూఫ్​ లు సిద్ధం చేశారు. త్వరలోనే అందరికీ ఆరోగ్య శ్రీకార్డులు అందించనున్నారు. 

జిల్లాలో మూడు బాల బాలికల సంరక్షణ కేంద్రాల్లో 18 ఏళ్ల లోపు వయస్సున్న 81 మంది పిల్లలున్నారు. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్వహిస్తున్న బాల సదన్​ లో 55 మంది అమ్మాయిలు ఉన్నారు. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థలో 15 మంది, బోనకల్ లోని శాంతి నిలయంలో 11 మంది పిల్లలున్నారు. ఈ రెండు ప్రైవేట్ సంస్థల్లో ఉన్న పిల్లల్లో 11 మంది అమ్మాయిలు, 15 మంది అబ్బాయిలున్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులు, విడాకులు పొందిన దంపతులకు చెందిన ఆడపిల్లలు, పేరెంట్స్ పోషించలేక వదిలేసిన చిన్నారులు, లైంగిక దాడికి గురైన బాధితులు, తల్లి లేదా తండ్రి లేని వారు, సంరక్షణ, రక్షణ అవసరమైన పిల్లలు ఈ బాల సదన్​ లో ఉన్నారు. 

వీళ్లందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు ఇప్పించాలని ఖమ్మం కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి భావించారు. గతంలో హైదరాబాద్​ లో కలెక్టర్​ గా పనిచేసిన సమయంలో ఆయన కొన్ని వందల సంస్థల్లో ఉన్న వేల మంది చిన్నారులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆధార్​ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇప్పించారు. అదే తరహాలో ఖమ్మంలోనూ ప్లాన్​ చేయగా, గత నెల 20న ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. బర్త్ సర్టిఫికెట్లు లేకపోవడం, వేరే జిల్లాల్లో ఉన్న రేషన్​ కార్డుల్లో నమోదై ఉండడం, వేరే జిల్లాలకు చెందిన ఆధార్​ కార్డులు ఉండడం, అసలు ఆధార్​ కార్డులు లేకపోవడం లాంటి సమస్యలు ఎదురుకాగా, వాటన్నింటినీ క్రమంగా పరిష్కరించారు. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అప్లై చేశారు. మొత్తం 81 మందికి గాను ఇప్పటి వరకు 70 మందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరోగ్య శ్రీ కార్డులు జనరేట్ అయ్యాయి. 

గుర్తింపు కార్డులు రావడం సంతోషంగా ఉంది

ఇన్నేళ్లుగా మాలో చాలా మందికి ఆధార్​ కార్డులు లేవు. ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్​ కార్డులు వచ్చాయి. త్వరలోనే ఆరోగ్య శ్రీ కార్డులు కూడా ఇస్తామని ఆఫీసర్లు చెప్పారు. భవిష్యత్ లో ఆరోగ్య పరంగా అత్యవసరం అయినప్పుడు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. మాకు కూడా ఆరోగ్య శ్రీకార్డులు రావడం సంతోషంగా ఉంది. - కావ్య, ఖమ్మం 

త్వరలోనే ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తాం

వేర్వేరు కారణాల వల్ల బాల సదన్​ లో ఉన్న చిన్నారులకు ఏదైనా అనుకోని ఆరోగ్య సమస్య వస్తే రూ.లక్షల్లో ఖర్చవుతాయి. అవి భరించలేని పరిస్థితిలో వాళ్లుండడంతో భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆరోగ్య శ్రీ కార్డులివ్వడం ద్వారా వారికి ప్రైవేట్, కార్పొరేట్​ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా వైద్యం పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాం. అందరికీ కార్డులు జనరేట్ కాగానే పంపిణీ చేస్తాం.  - అనుదీప్​ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్​