- ఆన్లైన్లో ఎలిజిబుల్ పండిత్ పోస్టుల లిస్టు
- జిల్లాలో రేపటి నుంచి రెండు రోజులు అభ్యంతరాల స్వీకరణ
- తర్వాత ఎస్టీటీలకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు
- ఈనెల 22 వరకు ముగించేందుకు ఆదేశాలు
నిజామాబాద్, వెలుగు : కోర్టు కేసులు, ఎన్నికల కోడ్‌తో ఆగిపోయిన టీచర్ల ప్రమోషన్, ట్రాన్స్ఫర్ల ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో షురువైంది. బాషా పండిత్‌లతో ఆరంభించి ఎలిజిబుల్ ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్‌గా నియమించేందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. టెట్‌తో సంబంధంలేకుండా ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో న్యాయపరమైన చిక్కు వీడింది.
పండిత్, పీఈటీ పోస్టుల్లో అప్పర్ ప్రైమరీ బడుల్లో కొనసాగుతున్న వారినే హైస్కూల్ అప్‌గ్రేడ్ పోస్టుల్లో అపాయింట్ చేయాలని గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వెలువడ్డాయి. స్కూల్స్ రీ ఓపెన్ అయినప్పటి నుంచి ఈ నెల 22 వరకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు పూర్తి చేయాలని ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇందూర్ విద్యాశాఖలో సందడి వాతావరణం నెలకొంది.
మొత్తం 848 ఖాళీలు
జిల్లాలో 693 ప్రైమరీ, 116 అప్పర్ ప్రైమరీ, 230 హైస్కూల్స్ ఉన్నాయి. వీటిలో ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టులు 78 వెకెంట్ ఉన్నాయి. హిందీ పండిత్ ఖాళీలు 6, తెలుగు 10, ఉర్దూ 5 ఉన్నాయి. పీఈటీ పోస్టులు 9, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం 121, ఉర్దూ మీడియం 17, ఇంగ్లీష్ మీడియం కలిపి మొత్తం 140 ఖాళీ ఉన్నాయి. బయోలజీ తెలుగు మీడియం 56, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం కలిపి 65 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఖాళీలు27
స్కూల్ అసిస్టెంట్ హిందీ 26, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 34, ఉర్దూ 11 వెకెంట్ ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు మీడియంలో 20, ఉర్దూ మీడియంలో 5 కలిపి మొత్తం 25, ఫిజికల్ సైన్స్9, ఫిజిక్స్ తెలుగు మీడియం 7, ఉర్దూ మీడియంలో 2 కలిపి 9 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎస్జీటీ ఖాళీలు 394 కలిపి టోటల్ 848 పోస్టులు వెకెంట్ ఉన్నట్లు ఆఫీసర్లు లెక్క తేల్చారు.
ప్రమోషన్ లిస్టు రెడీ
ఖాళీ పోస్ట్‌లలో ప్రమోషన్లకు అర్హతగల టీచర్ల సీనియారిటీ లిస్టు రెడీ అయింది. పండిత్, పీఈటీల ప్రమోషన్లు ఫస్ట్ పూర్తి చేయాలని డిసైడ్ అయిన ఆఫీసర్లు ఎలిజిబుల్ క్యాటగిరి పేర్లను deo.NIZAMABAD.in వెబ్సైట్లో పెట్టారు. ఈ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే 10,11 తేదీలలో తెలపాలని డీఈవో దుర్గాప్రసాద్ కోరారు. ఆ ప్రమోషన్లు కంప్లీట్ అయిన వెంటనే స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్ ప్రమోషన్లు ఎస్జీటీలతో చేపడతారు.
ప్రమోషన్ ఖాళీ అడ్జెస్ట్‌మెంట్‌కు వీవీలు
పదోన్నతులు, ట్రాన్స్ఫర్లతో ఖాళీ అయ్యే పోస్టులను ప్రస్తుతానికి విద్యావాలంటీర్ల నియామకంతో నెట్టుకొస్తారు. డీఎస్సీ ద్వారా కొత్త టీచర్ల అపాయింట్కు గవర్నమెంట్ చర్యలు చేపట్టింది. వాటి భర్తీ పూర్తయ్యేదాకా స్టూడెంట్స్‌కు ఇబ్బంది కలగకుండా వాలంటీర్లను నియమించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ట్రాన్స్ఫర్ అయిన పీజీహెచ్ఎంలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, స్కూల్‌అసిస్టెంట్లు రిలీవర్లులేక పాత బడుల్లోనే ఇన్నాళ్లూ కొనసాగారు. గవర్నమెంట్ ఆర్డర్స్‌తో వారంతా సోమవారం ట్రాన్స్ఫర్ అయిన కొత్త స్కూల్స్‌లో రిపోర్టు చేశారు.