కలిసొచ్చిన ఎర్రజొన్న సాగు..క్వింటాల్​రూ.4 వేలకు ఎగబాకిన ధర

  •     గడిచిన పది రోజుల్లోనే రూ.500 పెరుగుదల
  •     వ్యాపారుల సిండికేట్​కు అడ్డుకట్టతో ఫలితాలు​
  •     హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

నిజామాబాద్, వెలుగు : ఈ యేడు ఎర్రజొన్న సాగు చేసిన రైతులకు కలిసి వచ్చింది. సిండికేట్​గా మారి రైతులను మోసం చేస్తున్న వ్యాపారులను అరికట్టాలని ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తీసుకున్న చర్యల వల్ల రైతులకు మంచి ధర లభిస్తోంది. క్వింటాల్​కు రూ.3,400 ధరతో కొనుగోళ్లు షురూ కాగా ఇప్పుడు రూ.4 వేలకు చేరింది. గడిచిన పది రోజుల్లోనే రూ.500 ధర పెరిగింది.

రేట్​పై భరోసా లేక తగ్గిన విస్తీర్ణం

జిల్లాలో గతేడాది 46 వేల ఎకరాల్లో రైతులు ఎర్రజొన్న సాగు చేశారు. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకొని ఫ్రీగా సీడ్​సప్లయ్​చేస్తారు. ఇదే టైమ్​లో రేట్​ను కూడా ఫిక్స్​ చేస్తారు. జిల్లాలో ఏండ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. గతేడాది వ్యాపారులంతా సిండికేట్​గా మారి క్వింటాల్​కు రూ.3,200 మాత్రమే చెల్లించారు. తమ దందాకు అడ్డపడకుండా లీడర్లు, ఆఫీసర్లకు ముడుపులు ఇచ్చారు. వ్యాపారులు చెల్లించిన రేటు గిట్టుబాటు కాకపోవడంతో ఈ సంవత్సరం జిల్లాల్లో ఎర్రజొన్న సాగు విస్తీర్ణం తగ్గింది.

కేవలం 38 వేల ఎకరాల్లో మాత్రమే పంట వేశారు. సుమారు 9 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సరిగ్గా పంట కోతకు వచ్చే సమయానికి రాష్ట్రంలో కాంగ్రెస్​ గవర్నమెంట్​ఏర్పడింది. సిండికేట్​ వ్యాపారాన్ని ఆపాలంటూ జిల్లా యంత్రాంగానికి ఆర్డర్స్​ వచ్చాయి. దీంతో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు ట్రేడర్లు, ఎర్రజొన్న రైతులతో రెండుసార్లు మీటింగ్​ నిర్వహించారు. ట్రేడర్లు సిండికేట్​గా మారి రైతులను మోసం చేస్తే గవర్నమెంట్​ నుంచి సీరియస్ ​యాక్షన్​తప్పదని వార్నింగ్​ఇచ్చారు.

తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునేలా రైతులకు ఫ్రీడం ఇవ్వాలని, ఒత్తిడి చేయొద్దని మందలించారు. అగ్రికల్చర్​ఆఫీసర్లతో క్షేత్ర స్థాయిలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ చర్యలు ఫలితాలనిచ్చాయి.  పది రోజుల నుంచి రేట్ పెరుగుతూ రూ.4 వేలకు చేరింది. ఇప్పటికే 75 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి.

పశువుల దాణా.. 

జిల్లాలో 38 వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగు కాగా ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలోనే సుమారు 34 వేల ఎకరాలు ఉంది. రూరల్​సెగ్మెంట్​లోని  జక్రాన్​పల్లి, సిరికొండ, ధర్పల్లి మండలాల్లో 4 వేల ఎకరాల్లో పంట వేశారు. ప్రతీ విలేజ్​లో లోకల్ ​వ్యాపారులు ఎర్రజొన్న కొనుగోళ్లు చేసి గోదాముల్లో స్టాక్​ చేస్తారు. ఫౌల్ట్రీతో పాటు పశువుల దాణాగా ఎర్రజొన్నను వినియోగించే ఢిల్లీ,పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్​లకు సప్లయ్​ చేస్తారు. వీరికి క్వింటాల్​కు రూ.4,300 దాకా అందుతుంది. గతేడాది రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోళ్లు చేసిన వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జించారు.

మంచి ధర లభించింది

రెండెకరాల్లో ఎర్రజొన్న పంట వేశా. 42 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండు వారాల కింద  క్వింటాల్​కు రూ.3,900 చొప్పున అమ్మిన. నిజం చెప్పాలంటే ఇది మంచి ధరే. వ్యాపారులు సిండికేట్​ కాకుండా ప్రభుత్వం చూడడం వల్ల ప్రయోజనం జరిగింది.

- అల్లూరి గంగారెడ్డి, పెర్కిట్

పంట సాగు పెరుగుతది

రైతులకు లాభదాయక ధర దక్కినప్పుడు పంట విస్తీర్ణం పెరుగుతది. వచ్చే సీజన్​లో రైతులు అధిక మొత్తంలో ఎర్రజొన్న సాగు చేస్తరని అనిపిస్తుంది. నేను నాలుగెకరాల్లో ఎర్రజొన్న పండించిన. పంట చేతికి వచ్చిన వెంటనే అమ్మడంతో రూ.3,500 ధర లభించింది. 

-  బుల్లెట్​రామిరెడ్డి, రెంజర్ల