సీఎంఆర్​ కష్టమే .. వనపర్తి జిల్లాలో 160 మంది మిల్లర్లు డిఫాల్టర్లే

  • గ్యారంటీపై ముందుకు రాని మిల్లర్లు
  • ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు

వనపర్తి, వెలుగు: ఈ సారి ఖరీఫ్​ సీజన్​లో సేకరించే వడ్లను సీఎంఆర్​ చేయించేందుకు సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు అష్టకష్టాలు పడక తప్పని పరిస్థితి నెలకొంది. పెండింగ్​ సీఎంఆర్​ ఇవ్వక డిఫాల్టర్లుగా ఉన్న వారికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వడ్లు ఇవ్వవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న మిల్లర్లలో 93 శాతం మంది మిల్లర్లు డిఫాల్టర్లే కావడం గమనార్హం. సీఎంఆర్​ కేటాయింపులకు అర్హత ఉన్నవారు జిల్లాలో  కేవలం 12 మందే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

3.50 లక్షల టన్నులు నిల్వ చేయాల్సిందే..

జిల్లాలో ఈ ఖరీఫ్​ సీజన్​లో 4 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. అందులో 50 వేల టన్నుల ధాన్యంలో కొంత విత్తనాలకు, తినడానికి బియ్యంగా మార్చుకునే అవకాశం ఉంది. ఈ సీజన్​లో 377 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 3.50 లక్షల టన్నుల వడ్లను కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్ద మొత్తంలో సేకరించిన వడ్లను ప్రతి సీజన్​లో మిల్లర్లకు ఇచ్చి సీఎంఆర్​ తీసుకుంటూ వస్తారు. ఈ సారి డిఫాల్టర్​ మిల్లర్లకు ఇవ్వవద్దని నిర్ణయం తీసుకోవడంతో సేకరించిన వడ్లను నిల్వ చేసేందుకు అధికారులు గోదాములను సిద్దం చేస్తున్నారు. 

మార్కెటింగ్, స్టేట్​ వేర్​ హౌసింగ్​ ఇలా పలు సంస్థల గోదాముల్లో 2.28 లక్షల టన్నులు నిల్వ చేయనున్నారు. ఇంకా అవసరమైతే జడ్చర్ల, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని ప్రైవేటు గోదామ్​లను పరిశీలిస్తున్నారు. మిల్లులు ఎక్కువగా ఉండి దిగుబడి తక్కువగా ఉన్న  మహబూబ్​నగర్, గద్వాల జిల్లాలతో పాటు పెద్దపల్లి, కరీంనగర్​ జిల్లాలకు వడ్లను తరలించాలని యోచిస్తున్నారు.

గ్యారంటీతో ముందుకు రాని మిల్లర్లు

వడ్లను సీఎంఆర్​గా ఇచ్చే విషయంలో గతంలో మిల్లర్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇచ్చే వడ్లలో 25 శాతం గ్యారంటీ ఇస్తేనే సీఎంఆర్​ కేటాయిస్తామని సర్కారు షరతు పెట్టింది. ఇటీవల మిల్లర్లతో సమావేశమైనప్పుడు గ్యారంటీ విషయంలో తాము ఆలోచించుకొని చెబుతామని దాటవేశారు. అలా సీఎంఆర్​కు ముందుకు రాకపోతే నిబంధనల ప్రకారం ట్రేడింగ్​ చేసే రైస్​ మిల్లు 50 శాతం సీఎంఆర్, మరో 50 శాతం ట్రేడింగ్​ చేసుకోవాలి. ఇలా మిల్లర్ల నుంచి సీఎంఆర్​ చేయించే అవకాశాన్ని ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. 

సీఎంఆర్​ ఆగదు

ఈ సారి దొడ్డు రకాలు, సన్న రకాలను విడివిడిగా కొంటాం. కొన్న వడ్లను గోదాముల్లో నిల్వ ఉంచి విడతల వారీగా సీఎంఆర్​ చేయిస్తాం. సీఎంఆర్​ సేకరణలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. స్థానిక మిల్లర్లతో పాటు ఎక్కడ మిల్లు అందుబాటులో ఉంటే అక్కడికి వడ్లు పంపి సీఎంఆర్​ చేయిస్తాం. 

వెంకటేశ్వర్లు, అడిషనల్​ కలెక్టర్​, వనపర్తి