పూజల పేరుతో హత్య..ఆపై నగల దోపిడీ

  •     దొంగస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పటాన్​చెరు(గుమ్మడిదల),వెలుగు : పూజలు చేస్తానని నమ్మించి హత్య చేసిన దొంగ స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురించిన ఆదివారం సీఐ సుధీర్​కుమార్ వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన తత్తారి నర్సింగ్​రావు అలియాస్​ నర్సింగ్​రావు అలియాస్​ శివ ఆలయాల వద్ద తిరుగుతూ పలువురిని మోసం చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో గుమ్మడిదల పీఎస్​ పరిధిలోని వీరన్న గూడెంలో తిరుగుతూ గ్రామంలోని బుచ్చమ్మ (60) ను మాయమాటలు చెప్పి ఆకట్టుకున్నాడు.

ఆమెకు మంచి జరిగేందుకు పూజలు చేస్తానని నమ్మబలికి ఫిబ్రవరి 13న ఆమెను సికింద్రాబాద్​కు తీసుకెళ్లి పూజకు అవసరమ్యే సామగ్రిని కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి ఆమెను ఘట్కేసర్ పరిధిలోని మాదారం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పూజలు చేస్తూ మెడలోని బంగారు గొలుసులను తీయాలని చెప్పగా అందుకు బుచ్చమ్మ నిరాకరించింది. దీంతో బండ రాయితో ఆమె తలపై బలంగా మోది చంపేసి మెడలో ఉన్న నగలను  తీసుకొని పారిపోయాడు.

 దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు. హత్యకు పాల్పడ్డ  నేరస్తుడు తత్తారి నర్సింగ్​రావుపై ఇప్పటికే పలు కేసులున్నాయని,  గతంలో దొంగ స్వామీజీ అవతారం ఎత్తి పలువురిని మోసం  చేసినట్లు పేర్కొన్నారు.