తాళమేస్తే ఇల్లు గుల్ల ..లాక్​ చేసిన ఇండ్లే టార్గెట్​గా చోరీలు

  • పగటిపూట రెక్కీ నిర్వహించి ఇండ్ల గుర్తింపు
  • దొంగలను పట్టుకోలేకపోతున్న పోలీసులు
  • వంతులవారీగా గస్తీ  తిరుగుతున్న యువకులు ​ 

నిజామాబాద్​, వెలుగు: తాళం వేసి వెళ్లారంటే చాలు దొంగలు ఇళ్లను గుల్ల చేస్తున్నారు. పగటిపూట గల్లీల్లో తిరుగుతున్న దొంగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్​ చేస్తున్నారు. రాత్రి తాళాలు పగలగొట్టి దొపిడీ చేస్తున్నారు. రకరకాల సామాన్లు అమ్ముతూ.. రిపేర్లు చేస్తామంటూ తిరుగుతున్నవాళ్లే ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించినా చోరీలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారు.

జిల్లావ్యాప్తంగా రోజూ ఏదో మూల దొంగతనాలు జరగడం జనాన్ని కలవరపెడుతోంది. కొన్ని చోరీలు సీసీ కెమెరాలలో రికార్డవుతున్నా ఆ కేసుల్లో కూడా పోలీసులు దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఈ జనవరి నుంచి జులై వరకు జిల్లాలో 200 దొంగతనాలు జరిగాయి. ఈ ఒక్క నెలలోనే జిల్లాలో పెద్ద ఎత్తున చోరీలు జరిగాయి. దొంగతనాలు అరికట్టడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

ఈనెలలో జరిగిన దొంగతనాలు.. 

ఈనెల 25న నిజామాబాద్​లోని హమాల్​వాడీ కాలనీకి చెందిన పెంటయ్య ఫ్యామిలీతో కలిసి ఓ ఫంక్షన్​కు వెళ్లాడు. అతని ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు 13 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. త్రీటౌన్​లో పోలీస్​ కేసు నమోదైంది. ఈనెల 23న పగటిపూటే ముప్కాల్​ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో అవుసుల లింబాద్రి ఇంటి తాళాన్ని పగులగొట్టి 25 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

అదే ఊళ్లోఉన్న తన పాత ఇంటికి భార్యతో కలిసి వెళ్లి వచ్చేలోగా దొంగతనం జరిగింది. లింబాద్రి కొడుకులలో ఒకరు పోలీస్​ కానిస్టేబుల్​కాగా మరొకరు ఆర్మీలో పనిచేస్తున్నారు. ఐడీ పార్టీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
   ఈనెల 19న నిజామాబాద్​లోని ప్రగతినగర్​ ఏరియాలో నివసించే గవర్నమెంట్​ టీచర్​బందెల శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగింది. ఆయన, అంగన్​వాడీ టీచర్​అయిన ఆయన భార్య డ్యూటీలకు వెళ్లారు. శ్రీనివాస్ తల్లి పక్కింటికి వెళ్లి పలుకరించి వచ్చేలోపు లాక్​ బ్రేక్​ చేసి రూ.4.5 లక్షల నగదు, రెండు తులాల గోల్ట్​ పట్టుపోయారు. ఫోర్త్​టౌన్​లో కేసు రిజిస్టరైంది.

   ఈనెల 16 న నందిపేట మండలం వెల్మల్​లో తాళం వేసిన మూడు ఇండ్లను టార్గెట్​ చేసుకున్న దొంగలు 20 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, రూ.10 క్యాష్​ ఎత్తుకెళ్లారు. డాగ్​ స్క్వాడ్​కు ఆనవాళ్లు దొరకుండా దొంగతనం చేసిన ఇండ్ల చుట్టూ కారంపొడి చల్లారు. నందిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో గ్రామ యువకులు వంతుల వారీగా రాత్రిపూట గస్తీ తిరుగుతున్నారు. 

17న మెండోరా మండల కేంద్రంలో కాలినడక వెళ్తున్న మహిళ మెడలో నుంచి చైన్​ స్నాచర్లు తులంన్నర బంగారు గొలుసు లాక్కెళ్లారు.14 తేదిన నిజామాబాద్​లోని ముబారక్​నగర్​లో కారులో వచ్చిన ముగ్గురు దొంగలు కళావతి, మరో గవర్నమెంట్​ఎంప్లాయి ఇళ్లలో సుమారు రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. రూరల్​ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్​లో దొంగిలించిన కారులో వచ్చి ఇక్కడ ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనం చేశారు. సిటీలోని వినాయక్​నగర్​లో వెంకట్​ అనే వ్యక్తి భార్యతో కలిసి వేములవాడ దైవదర్శనానికి వెళ్లగా ఈనెల 13న దొంగలు ఆయన ఇంటి తాళం పగులగొట్టి ఏడు తులాల గోల్డ్​ పట్టుకుపోయారు. 4 తారీకు సీతారాంనగర్​ కాలనీలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. 

విలువైన వస్తువులు బ్యాంకులో దాచుకోవాలి 

సెల్​ఫోన్​, తదితర వస్తువుల రిపేర్​ చేస్తామని, పాతసామాన్లు కొంటామని కాలనీలలో తిరిగే అనుమానాస్పద వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటికి లాక్​ వేసి బయటకు కానబడకుండా దానిపై డోర్​ స్క్రీన్​ కప్పాలి. అన్నింటికి మించి విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకులో భద్రపర్చుకోవడం మంచిది.  


- బస్వారెడ్డి, ఏసీపీ, ఆర్మూర్​